పాకూర్: అయోధ్యలో రామమందిరం అంశంపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. నాలుగు నెలల్లో అయోధ్యలో రామమందిరం కడతామని ఆయన వెల్లడించారు. సోమవారం జార్ఖండ్ పాకూర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు.
అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు ప్రదేశంలో రామమందిర నిర్మాణానికి వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు గత నెల 9న సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ‘సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక, నాలుగు నెలల్లో ఆకాశాన్ని తాకే రామమందిరాన్ని అయోధ్యలో నిర్మిస్తాం’ అని షా పేర్కొన్నారు. అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాస్పద భూవివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. రివ్యూ పిటిషన్లకు సరైన ప్రాతిపదిక లేదని, రివ్యూ పిటిషన్లన్నింటినీ పరిశీలించిన తర్వాత వీటిని కొట్టివేయాలని నిర్ణయం తీసుకున్నామని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment