న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) వినియోగంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యాయి. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ..‘లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై విస్తృతంగా చర్చించాం. అలాగే దేశంలో నిరుద్యోగిత, వ్యవసాయం, రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలపై దాడిపై మరింత లోతుగా చర్చించేందుకు అన్నిపక్షాలు అంగీకరించాయి. ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ నెల 4న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుసుకుని తమ అభ్యంతరాలు, ఆందోళనల్ని తెలియజేస్తాయి’ అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శరద్ పవార్(ఎన్సీపీ), ఒమర్ అబ్దుల్లా(నేషనల్ కాన్ఫరెన్స్), రామ్‌గోపాల్ యాదవ్(సమాజ్‌వాదీ పార్టీ), సతీశ్‌చంద్ర మిశ్రా(బీఎస్పీ), కనిమొళి(డీఎంకే), డెరెక్ ఓబ్రెయిన్(టీఎంసీ), డి.రాజా(సీపీఐ), టీకే రంగరాజన్(సీపీఎం), జయంత్ చౌదరి(ఆర్జేడీ)తో పాటు కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment