ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై ఫిర్యాదుల వెల్లువ | Rto Officers Attack On Private Travels In Amravati | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై ఫిర్యాదుల వెల్లువ

Published Fri, Jan 10 2020 5:46 AM | Last Updated on Fri, Jan 10 2020 5:46 AM

Rto Officers Attack On Private Travels In Amravati - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేటు ట్రావెల్స్‌ సంస్థల ఆగడాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ట్రావెల్స్‌ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 9542800800 వాట్సాప్‌ నెంబరును ప్రకటించింది. ఈ నెంబరుకు గత వారం రోజుల వ్యవధిలో 1,702 ఫిర్యాదులు అందాయి. ఇందులో అధిక శాతం ఫిర్యాదులు టిక్కెట్లు రేట్లు పెంచి దోచుకుంటున్నారనే ఉన్నాయి. రవాణా శాఖ దాడులు చేస్తున్నా ప్రైవేటు ట్రావెల్స్‌ దందా మాత్రం ఆగడం లేదు. ప్రస్తుత సంక్రాంతి సీజన్‌లో బస్సు చార్జీలను రెండు మూడు రెట్లు పెంచేశాయి.

పండుగ రద్దీని సొమ్ము చేసుకుంటున్నాయి. చార్జీల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచి, టిక్కెట్లను విక్రయిస్తున్నాయి. రవాణా శాఖ అధికారులు  గత నాలుగు రోజులుగా రాష్ట్ర సరిహద్దుల్లో ప్రైవేటు బస్సుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 170 బస్సులను సీజ్‌ చేసి, 80 కేసులు నమోదు చేశారు. చార్జీలు విచ్చలవిడిగా పెంచేసి, ప్రయాణికులను దోచుకుంటున్న ట్రావెల్స్‌ సంస్థలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్‌ బస్సులపై రూ.25 వేల చొప్పున జరిమానా విధించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కేసులు నమోదు చేసిన బస్సుల వివరాలు అన్ని చెక్‌పోస్టులకు పంపించాలని సూచించారు. కేసుల నమోదు విషయంలో ఇతర రాష్ట్రాల బస్సులకు సైతం మినహాయింపు లేదని స్పష్టం చేశారు.

ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు పండుగ
పండుగ సీజన్‌లో టిక్కెట్ల ధరలు తగ్గిస్తామని ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రికి తొలుత హామీనిచ్చారు. కానీ, ఆ హామీని తుంగలో తొక్కుతున్నారు. డిమాండ్‌ ఉన్న తేదీల్లో దోపిడీ మరింత అధికంగా ఉంది. జనవరి 11న ఏపీఎస్‌ ఆర్టీసీ ఏసీ బస్సుల్లో(రెగ్యులర్‌ సర్వీసు) హైదరాబాద్‌ నుంచి గుంటూరుకు రూ.530 వరకు ధర ఉంది. స్పెషల్‌ బస్సు అయితే రూ.795 వసూలు చేస్తున్నారు. ప్రైవేటు బస్సుల్లో రూ.1,130 నుంచి రూ.1,200 వరకు గుంజుతున్నారు. నాన్‌ ఏసీ ఆర్టీసీ బస్సుల్లో(రెగ్యులర్‌ సర్వీసు) రూ.383 కాగా, స్పెషల్‌ బస్సుల్లో రూ.609 వసూలు చేస్తున్నారు. ప్రైవేటు నాన్‌ ఏసీ బస్సుల్లో టిక్కెట్ల ధరలు రూ.850 వరకు ఉన్నాయి.

రాష్ట్రంలో ప్రైవేటు బస్సులు: 750
గత నాలుగు రోజుల్లో సీజ్‌ చేసిన బస్సులు: 170
నమోదు చేసిన కేసులు: 80
వారం వ్యవధిలో వాట్సాప్‌ నెంబరుకు అందిన ఫిర్యాదులు: 1,702 

తనిఖీలు ఇక మరింత ముమ్మరం
‘‘బస్సు టిక్కెట్ల రిజర్వేషన్లు చేసే రెడ్‌ బస్, అభీ బస్‌ వెబ్‌సైట్ల నిర్వాహకులను పిలిపించి మాట్లాడాం. మోటారు వాహన చట్టం ప్రకారం ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులపైనే కాదు.. ఇలాంటి వెబ్‌సైట్లపైనా కేసులు నమోదు చేయొచ్చు. ఆపరేటర్లు ప్రకటించిన రేట్లనే ఆన్‌లైన్‌లో ఉంచి, టిక్కెట్లు విక్రయిస్తున్నామని వెబ్‌సైట్ల నిర్వాహకులు చెబుతున్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తే వెబ్‌సైట్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తాం. ప్రైవేటు బస్సుల్లో తనిఖీలను మరింత ముమ్మరం చేస్తాం’’
– పీఎస్సార్‌ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement