రాయితీలతో ‘ఎలక్ట్రిక్‌’ సవారీ!   | Huge Discounts Available For Buying Electric Vehicles | Sakshi
Sakshi News home page

రాయితీలతో ‘ఎలక్ట్రిక్‌’ సవారీ!  

Published Fri, Aug 21 2020 2:08 AM | Last Updated on Fri, Aug 21 2020 3:45 AM

Huge Discounts Available For Buying Electric Vehicles - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రోడ్లపైకి విపరీతంగా వచ్చి చేరుతున్న వాహనాలతో చుట్టుముడుతున్న కాలుష్యానికి కళ్లెం వేసే క్రమంలో ఎక్కువ సంఖ్యలో బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్‌ వాహనాలను అనుమతించేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కాలుష్యాన్ని తగ్గించటంతోపాటు ఉద్యోగావకాశాలు కూడా కల్పించేందుకు బ్యాటరీ వాహనాల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. వాహనదారులు పెట్రోల్, డీజిల్‌ వాహనాలవైపే మక్కువ చూపుతున్న నేపథ్యంలో వారి దృష్టిని ఆకర్షించేలా ఈ–వాహనాలు కొంటే ప్రత్యేక తాయిలాలు ఇచ్చేందుకు ఎలక్ట్రిక్‌ వెహికల్‌ పాలసీని రూపొందిస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో సీఎం ఈ మేరకు ప్రకటించ డంతో ఇప్పుడు పాలసీ రూపొందించే బాధ్య తను పరిశ్రమల శాఖ చేపట్టింది. రవాణాశాఖ తో కలసి కసరత్తు చేస్తోంది. వారం రోజుల్లో పాలసీని ప్రకటించే అవకాశం ఉంది. 

ప్రస్తుతం ఉన్నవి 10 వేలే... 
రాష్ట్రంలో ప్రస్తుతం నామమాత్రంగానే ఎలక్ట్రిక్‌ వాహనాలున్నాయి. ఆ సంఖ్య కూడా ఇటీవలి కాలంలోనే పెరిగింది. గత రెండేళ్లలో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య రాష్ట్రంలో దాదాపు 23 శాతం పెరిగింది. ప్రస్తుతం అన్ని రకాల మోడళ్లు కలుపుకొని 10 వేల వరకు బ్యాటరీ వాహనాలు ఉన్నాయి. వచ్చే ఐదారేళ్లలో ఈ సంఖ్యను భారీగా పెంచేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త పాలసీకి రూపకల్పన చేస్తోంది. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు, త్రైమాసిక పన్ను, లైఫ్‌ ట్యాక్స్‌లలో రాయితీలు ఇవ్వడం ద్వారా ఈ వాహనాలు కొనేందుకు కొనుగోలుదారులను ప్రోత్సహించనుంది. 

పెట్టుబడిదారులకూ ఆఫర్లు... 
రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టే వారిని ఆకట్టుకొనేలా రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వాహనాల తయారీ, బ్యాటరీల తయారీ, చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు.. ఇలా వివిధ రకాల సంస్థలను ప్రోత్సహించనుంది. నిర్ధారిత కాలానికి, ముందుగా పెట్టుబడి పెట్టే నిర్ధారిత సంఖ్యలోని సంస్థలకు 20 శాతం క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సబ్సిడీ, పవర్‌ టారిఫ్‌ డిస్కౌంట్‌ 25 శాతం, ఎస్‌జీఎస్టీలో రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం, స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు తదితరాలు అందించనుంది. ఇక ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి సంబంధించి కొంత స్థలాన్ని కూడా కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ రంగంలో లక్షన్నర మందికి ప్రత్యక్షంగా, రెండున్నర లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరికే అవకాశం ఉందని అంచనా. 

రాయితీలు..  
ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర పెద్ద వాహనాలకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే తొలుత దీన్ని నిర్ధారిత సంఖ్యలో వాహనాలకు మాత్రమే పరిమితం చేయాలనుకుంటోంది. ముందుగా కొనే 2 లక్షల ద్విచక్ర వాహనాలు, 5 వేల కార్లు, ఇతర పెద్ద వాహనాలకు దీన్ని వర్తింపచేయాలనుకుంటోంది. ఆ తర్వాత కొనే వాహనాలకు ఆ పన్నును పరిమిత మొత్తంలో వేయాలా లేక రాయితీని కొనసాగించాలా అనే విషయంపై తర్వాత నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం మారుమూల పల్లెటూళ్లలోనూ ఆటోరిక్షాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఆ కేటగిరీలో కూడా ఢిల్లీ తరహాలో బ్యాటరీ వాహనాలను ప్రోత్సహించనుంది. రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులో నూరు శాతం రాయితీలను తొలి 20 వేల ఎలక్ట్రిక్‌ ఆటోరిక్షాలకు వర్తింపజేయాలని నిర్ణయించినట్టు సమాచారం.  త్రైమాసిక  పన్ను, లైఫ్‌ ట్యాక్స్‌ విషయంలోనూ ఇదే తరహా పరిమితులు వర్తించనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement