ఆయన జీవితం ఆద్యంతం వివాదాస్పదమే.. వృత్తిలో.. నిజ జీవితంలో.. పుట్టి పెరిగిన ప్రదేశంలో.. పనిచేసే చోట ఎక్కడైనా తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ వస్తున్న అతని నేర ప్రవృత్తి తార స్థాయికి చేరింది. పాపం పండటంతో తను పన్నిన కుట్రలన్నీ బయటపడ్డాయి. సొంత అన్నను హత్య చేసేందుకు కిరాయి హంతక ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని, ఓ యువకుడి హత్యకు కారణమైన అతను పోలీసులకు దొరికిపోయాడు. ఇదంతా చేసింది ఓ రౌడీ షీటరో.. పాత నేరస్తుడో కాదు.. ఈ ఘనతలన్నీ మన డీటీఓ సార్ భద్రునాయక్‌వే..
వికారాబాద్: రెండేళ్ల క్రితం వికారాబాద్ డీటీఓగా విధులు చేపట్టిన భద్రునాయక్‌కు వివాదాస్పదమైన వ్యక్తిగా పేరుంది. జిల్లాలో లారీల్లో ఓవర్ లోడ్ (కెపాసిటీకి రెండింతలు) వేసేందుకు ఓనర్ల నుంచి నెలనెలా మూమూళ్లు తీసుకుంటాడనే ఆరోపణలున్నాయి. ఓవర్‌లోడ్ కారణంగా.. వేసిన కొద్ది రోజులకే రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. ఈ విషయాన్ని ఆర్‌అండ్‌బీ, పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు బాహాటంగా చెబుతున్నారు.
ఇక లైసెన్సులు, ఫిట్‌నెస్, ప్రధానంగా వ్యవసాయ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ల సమయంలో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పరిమిత రుసుముకు మూడు నుంచి పది రెట్లు ఎక్కువ మొత్తం వసూలు చేస్తాడని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇతని తీరును నిరసిస్తూ ఏకంగా డీటీఓ ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టారు. వాహనదారులతో దురుసు ప్రవర్తన, దుర్భాషలాడటం వంటి కారణాలతో వివాదాస్పదమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.
ఎఫ్‌ఐఆర్ చేయని పోలీసులు
డీటీఓ భద్రునాయక్ తనను దుర్భాషలాడారని ఇటీవల ఓ వ్యక్తి చన్గొముల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పత్రాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ వాహనాన్ని అడ్డుకుని సీజ్ చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సమయంలో పలువురు వాహనదారులు, ప్రజలు బాధితుడికి అండగా వచ్చారు. భద్రునాయక్ ఆగడాలపై మండిపడుతూ నిరసన వ్యక్తంచేశారు. ఇంత జరిగినా.. డీటీఓపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు.
ఇందులో కొందరు నేతలు, పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకుని పీఎస్‌లోనే పంచాయితీ పెట్టి.. బాధితుడు ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా ఒప్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆయనపై కేసు నమోదు కాకుండా జిల్లా పోలీసులే గట్టెక్కించారని తెలిసింది. జిల్లా రవాణాధికారిని సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారనే వార్తలు శుక్రవారం సంచలనంగా మారాయి. పోలీసులు అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయాలపై శనివారం ఉదయం వరకు స్పష్టత లేకపోవడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగింది.
వసూళ్లకు ముఠా ఏర్పాటు
రెండేళ్లుగా వికారాబాద్ డీటీఓగా విధులు నిర్వహిస్తు న్న భద్రునాయక్ అనేక వివాదాలకు తెరతీసినప్పటికీ ఆ శాఖ ఉన్నతాధికారులు నోరు మెదపక పోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆదాయ వనరు లు సమకూర్చుకునేందుకు తన కార్యాలయానికి చెందిన కొందరు కింది స్థాయి ఉద్యోగులు, కానిస్టేబుళ్లు, ఆర్టీఏ బ్రోకర్లతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నా యి. ఈయన క్యాడర్ ఎంవీఐ అయినప్పటికీ తన పలుకుబడితో డీటీఓగా పోస్టింగ్ వేయించుకుని రెండేళ్లుగా వికారాబాద్‌లో తిష్ట వేయడం గమనార్హం.
విచారణలో కొత్త కోణాలు
సొంత అన్నను హత్య చేయించేందుకు రూ.కోటితో పాటు ఎకరం పొలం ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్న భద్రునాయక్‌ను అరెస్టు చేసిన సూర్యాపేట పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. విచారణలో ఆయన పనిచేస్తున్న రవాణా శాఖతో పాటు అవినీతి నిరోధక శాఖల పనితీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి.
అన్నను హత్య చేసేందుకు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకోవడం, భద్రునాయక్ అక్రమాస్తుల చిట్టాను ఏసీబీకి చెబుతానని సొంత అన్నే అతన్ని బెదిరిస్తూ రావడం, భద్రునాయక్ అనేక చోట్ల అక్రమ ఆస్తులు కలిగి ఉండటం అవినీతి నిరోధక, ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖల నిఘా వైఫల్యాలను సూచిస్తోంది. తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆయన ఆగడాలను ఉపేక్షిస్తుండటం ఆర్టీఏ ఉన్నతాధికారుల డొల్లతనం, లోపాయికారీ ఒప్పందాలను ప్రస్ఫుటం చేస్తోంది. ప్రవీణ్ హత్య కేసును విచారణ చేస్తున్న సూర్యాపేట పోలీసులు భద్రునాయక్ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేయగా.. అతనిపై చేసిన ఫిర్యాదును బుట్టదాఖలు చేయించి, ఎఫ్‌ఐఆర్ నమోదు కాకుండా చేసిన మన జిల్లా పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment