సాక్షి, హైదరాబాద్: వాహనాల్లో అమర్చిన గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉన్నా, ఆ పని చేయకపోవడంపై ఉమ్మడి హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రవాణా శాఖ కమిషనర్, డీజీపీ, కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి, హెచ్‌పీసీఎల్ తదితరులను ఆదేశించింది. దీనిలో భాగంగా వారికి నోటీసులు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వాహనాల్లో గ్యాస్ సిలిండర్లను తనిఖీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ వినియోగదారుల హక్కుల సంఘం గ్రేటర్ అధ్యక్షుడు హరిబాబు హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
పార్కులపై కౌంటర్ దాఖలు చేయండి: జంట నగరాలతో పాటు తెలంగాణలో పార్కులకోసం స్థలం కేటాయింపు, వాటి నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పార్కులకు తగినంత స్థలం లేకపోవడం వల్ల హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయిందని, ఈ విషయంలో ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ సీనియర్ న్యాయవాది కె.ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఆక్రమణలకు అడ్డాలుగా ఫుట్‌పాత్‌లు
జంట నగరాల్లోని ఫుట్‌పాత్‌లన్నీ ఆక్రమణలకు అడ్డాలుగా మారాయని, దీంతో పాదచారులు విధిలేని పరిస్థితుల్లో రోడ్లపై నడవాల్సి వస్తోందని ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల అలసత్వం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని మండిపడింది. హైదరాబాద్, సిద్ది అంబర్‌బజార్‌లలో ఫుట్‌పాత్ వ్యాపారులు చట్టానికంటే తామే అధికులమని భావిస్తున్నారని.. అందుకే కోర్టుకిచ్చిన హామీని ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారో తెలపాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. ఇందుకు స్వయంగా కోర్టు ముందు హాజరు కావాలని కమిషనర్‌కు స్పష్టం చేసింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌ల ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
‘సోలార్’ కంపెనీలకు భూములు కట్టబెట్టొద్దు
మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో ప్రైవేట్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల్ని రిజిస్ట్రేషన్ చేశారనే ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. దేవాదాయ, సర్వీస్ ఇనాం, అసైన్డ్ భూములే కాకుండా వెట్టి నుంచి విముక్తి కల్పించిన కార్మికులకు ఇచ్చిన భూముల్ని కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పాలమూరు వలస కూలీల సంఘం హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. ప్రైవేట్ సోలార్ పవర్ ప్రాజెక్టుల పేరిట రిజిస్ట్రేషన్ జరగకుండా చూడాలని అధికారులను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వ, పేదల భూములు పరులపరం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి, రెండు జిల్లాల కలెక్టర్లకు నోటీసులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment