ఆ బస్సులను సీజ్ చేయవద్దు
- రవాణాశాఖ అధికారులకు హైకోర్టు ఆదేశం
ఏఆర్ రిజిస్ట్రేషన్లతో ఏపీలో తిరుగు తున్న బస్సులను ఎక్కడికక్కడే నిలిపేయాలంటూ ఈ నెల 13న రవాణాశాఖ జారీ చేసిన సర్క్యుల ర్‌ను సవాలు చేస్తూ తిరుమల క్యాబ్స్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... తిరుమల క్యాబ్స్‌కు చెందిన బస్సులను అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిçష్టర్ చేసి ఆల్ ఇండియా పర్మిట్‌తో ఆ రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో తిప్పుతున్నామని తెలిపారు. పన్నులన్నింటినీ కూడా నిబంధనల ప్రకారం చెల్లిస్తున్నామన్నారు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 207(1) ప్రకారం తగిన పర్మిట్లు లేని వాటినే అధికారులు సీజ్ చేయాలని, కాని ఏపీ రవాణాశాఖ అధికారులు మాత్రం తమ బస్సులకు అన్ని రకాల పర్మిట్లు ఉన్నప్పటికీ సీజ్ చేస్తున్నారని తెలిపారు.
ఇందుకు కమిషనర్ సర్క్యులర్‌ను చూపుతున్నారని వివరించారు. తాము చేసిన తప్పేంటో చెప్పకుండా అరుణాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో బస్సులు ఉన్నాయి కాబట్టి తిరిగినివ్వమని చెప్పడం చట్టవిరుద్ధమే అవుతుందన్నారు. సెంట్రల్ మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 85(3) కింద తమ వాహనాలను సీజ్ చేశారని, అలా చేసే అధికారం వారికి లేదని తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) డి.రమేశ్ స్పందిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని గడువు కావాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ కౌంటర్ నిమిత్తం విచారణను జూలై 10కి వాయిదా వేశారు. అప్పటివరకు ఏఆర్ రిజిస్ట్రేషన్‌తో రాష్ట్రంలో తిరుగుతున్న తిరుమల క్యాబ్స్‌కు చెందిన బస్సులను సీజ్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.