
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మహబూబ్‌గంజ్, సిద్ధిఅంబర్ బజార్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేయడంపై వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఒక అధికారిని నియమించాలని నిర్ణయించింది. ఆ అధికారి నెలపాటు ప్రతిరోజూ ఫుట్‌పాత్ ఆక్రమణ ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన అనంతరం తమకు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. సదరు అధికారిని నియమించాలని హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. విచారణ ఆగస్టు 14కి వాయిదా వేసింది.
సిద్ధిఅంబర్ బజార్, మహబూబ్‌గంజ్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించాలని కోరుతూ లక్ష్మీనివాస్ అగర్వాల్ అనే వ్యక్తి ‘పిల్’ దాఖలు చేశారు. దీనిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఫుట్‌పాత్ ఆక్రమణలకు గురికావడానికి వీల్లేదని, ఇలాంటి చర్యల్ని సహించేది లేదని తేల్చి చెప్పింది. కాలి నడకన వెళ్లే వారి కోసం ఉద్దేశించిన ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే వారు ఎక్కడ నడవాలని ప్రశ్నించింది. ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసుకోవడం వల్ల బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు.