సాక్షి, సిటీబ్యూరో: పొరుగు రాష్ట్రాలకు చెందిన వాహనాల నమోదులో అక్రమాలను అరికట్టేందుకు రవాణాశాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. వాహనాల జీవితకాల పన్నుపైన ప్రభుత్వానికి వచ్చే కోట్లాది రూపాయాల ఆదాయానికి గండి కొట్టే విధంగా కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దళారులతో కుమ్మక్కై వాహనాల జీవితకాల పన్ను ఎగ్గొడుతున్న నేపథ్యంలో సర్కార్ అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నియంత్రించేందుకు జాతీయ సమాచార కేంద్రం (నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్)లోని ‘వాహన్ సారధి’ తో మొత్తం వాహనాలను అనుసంధానించాలని నిర్ణయించింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలో ఎక్కడ వాహనాలు రిజిస్ట్రేషన్ అయినా వాటి వివరాలు వెంటనే వాహన్ సారథిలో నిక్షిప్తమవుతాయి. అలాగే వాహనాల ఖరీదు, వాటిపైన ప్రభుత్వానికి చెల్లించవలసిన జీవితకాల పన్ను మొత్తం కూడా నమోదవుతుంది.
దీంతో ప్రాంతీయ రవాణా అధికారి నుంచి కిందిస్థాయి అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, క్లర్క్‌లు ఎలాంటి అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఉండదు. మరోవైపు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) ద్వారా పొరుగు రాష్ట్రాలకు చెందిన వాహనాల వివరాలను కూడా వెంటనే తెలుసుకొని జీవితకాల పన్నును కచ్చితంగా అంచనా వేసేందుకు అవకాశం లభిస్తుంది. ఇటీవల నగరంలోని బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయంలో కొందరు అధికారులు దళారులతో కుమ్ముక్కై సుమారు 800 వాహనాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంలో సుమారు రూ.1.5 కోట్ల మేర ప్రభుత్వాదాయానికి గండి పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలకు సంబంధం ఉన్నట్లు గుర్తించిన ఒక అడ్మినిస్ట్రేటివ్ అధికారి, మరో ముగ్గురు క్లర్క్‌లను సస్పెండ్ చేయడంతో పాటు, సదరు ప్రాంతీయ రవాణా అధికారిని ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. బండ్లగూడ తరహాలో మరోసారి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఎన్‌ఐసీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
బండ్లగూడ అక్రమాలపై విచారణ ..
కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి ఇరుగు పొరుగు రాష్ట్రాలకు చెందిన 500 నుంచి 1000 వాహనాలు రోజూ గ్రేటర్ హైదరాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయాల్లో నమోదవుతాయి.ఈ సమయంలో వాహనాల ఇన్‌వాయీస్, వాహనాల వయస్సును పరిగణనలోకి తీసుకొని జీవితకాల పన్ను వసూలు చేయాలి. ఉదాహరణకు కర్ణాటకకు చెందిన రూ.6.5 లక్షల మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారు హైదరాబాద్‌కు బదిలీ అయినప్పుడు 12 శాతం పన్ను వసూలు చేయాలి. ఒకవేళ అది రెండేళ్ల కిందటి వాహనం అయితే 10 శాతం చొప్పున తీసుకోవాలి. కానీ బండ్లగూడలో ఇలాంటి లెక్కలు లేకుండా, ఇన్‌వాయిస్ నమోదు చేయకుండా ఏకంగా 800 వాహనాలపైన అతి తక్కువ జీవితకాల పన్ను విధించారు. ఒక్కో వాహనంపై సగటున రూ.55000 ఆదాయం రావలసి ఉండగా, అందులో రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకే ప్రభుత్వ ఆదాయానికి జమ చేశారు. మిగతా సొమ్మును దళారులు, అధికారులు కాజేసినట్లు గుర్తించారు.అలా రూ.కోటి 50 లక్షల వరకు ప్రభుత్వ ఆదాయం పక్కదారి పట్టింది. ఈ ఉదంతంపై ప్రస్తుతం రంగారెడ్డి ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావును ప్రభుత్వం విచారణాధికారిగా నియమించింది.
ఎన్‌ఐసీతో అనుసంధానం ఇలా...
కేంద్ర జాతీయ సమాచార వ్యవస్థలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎన్‌ఐసీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్‌ఐసీలో ‘వాహన్,సారధి’ ఒక ప్రత్యేక ఆప్షన్. ఇందులో ఆర్టీఏ కార్యాలయాల్లో నమోదయ్యే వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సుల వివరాలను నిక్షిప్తం చేస్తారు. అలాగే పొరుగు రాష్ట్రాల వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సుల సమాచారాన్ని కూడా ఈ ఆప్షన్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్‌ఐసీతో రవాణాశాఖ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో అనుసంధానం కాకపోవడం వల్ల ఆ లోపా న్ని అవకాశంగా మార్చుకొని కొంతమంది అధికారులు సొమ్ము చేసుకున్నారు. వాహనాలపై రావలసిన జీవితకాల పన్నును ఎగ్గొట్టారు. ఎన్‌ఐసీతో అనుసంధానం కావడం వల్ల పొరు గు రాష్ట్రాల వాహనాలను హైదరాబాద్‌లో, తెలంగాణ లో ఎక్కడ నమోదు చేసినా వాటి వాస్తవ ధరలు, వివరాల ప్రకారమే నమోదు చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment