ఏకకాలంలో.. జీవితకాలపు దెబ్బ..! | Life Time Tax Collection From july 1st Chittoor | Sakshi
Sakshi News home page

ఏకకాలంలో.. జీవితకాలపు దెబ్బ..!

Published Fri, Jun 29 2018 7:56 AM | Last Updated on Fri, Jun 29 2018 7:56 AM

Life Time Tax Collection From july 1st Chittoor - Sakshi

మినీ గూడ్స్‌ వెహికల్‌, ప్యాసింజర్‌ ఆటో

జీవనోపాధికి చిన్నపాటి వాహనాలను నడుపుకునే వారిపై ‘జీవితకాలపు’ దెబ్బ పడుతోంది. వాహనాలకు జీవితాకాలపు పన్ను ఏకకాలంలో వసూలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదల పాలిట శాపంగా మారింది. ప్యాసింజర్‌ ఆటోలు, మినీ ట్రాన్స్‌పోర్టు వెహికల్స్‌ (3 వేల కేజీలలోపు బరువు)కు జీవితకాలం పన్ను విధించనున్నారు. మూడు నెలల కొకసారి పన్నులు వసూలు చేసే విధానానికి రవాణా శాఖ స్వస్తి పలికింది. జూలై 1నుంచి  జీవితకాలపు పన్నును ముక్కు పిండి ఏకకాలంలో వసూళ్లకు ఉపక్రమించింది.

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌ : జిల్లాలో సుమారు  54 వేల వాహనాలు జీవితకాలపు పన్ను  చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో  ప్యాసింజర్‌ ఆటోలు 27,633, మినీ గూడ్స్‌ వెహికల్స్‌ (మూడు చక్రాల వాహనాలు) 3,835, టాటా ఏస్, మహేంద్ర మ్యాక్స్‌ (నాలుగు చక్రాలు) వాహనాలు సుమారు 10 వేల వరకు ఉన్నాయి.
తిరుపతి పరిధిలో ప్యాసింజర్‌ ఆటోలు 11,784, మినీ గూడ్స్‌ వెహికల్స్‌ 1,174,  టాటా ఏస్, మహేంద్ర మ్యాక్స్‌ వాహనాలు 2,126 ఉన్నాయి. వీటి జీవిత కాల పన్ను చెల్లింపు గడువు 6 నెలలుగా నిర్ణయించి ప్రభుత్వం ప్రకటించింది.

కొత్తవాటికి రిజిస్ట్రేషన్‌ సమయంలోనే పన్ను..
కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్‌ సమయంలోనే  లైఫ్‌ టైం ట్యాక్స్‌ వేసేందుకు సిద్ధమయ్యారు.  ప్రయాణికులను తరలించే ప్యాసింజర్‌ ఆటోలకు ఆటో విలువలో రెండు శాతం మొత్తాన్ని పన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది. వాహనం ఇది వరకే రిజిస్ట్రేషన్‌ అయి  మూడేళ్లు గడిచి ఉంటే, దాని విలువలో 1.5 శాతం పన్ను కట్టాల్సిందే. 6 నుంచి 9 ఏళ్ల లోపు రిజిస్ట్రేషన్‌ అయివుంటే 1.3 శాతం పన్ను, 9 ఏళ్లు మించితే 1 శాతం  పన్ను కట్టాల్సి ఉంటుంది.

కొత్త  మినీ ట్రాన్స్‌ఫోర్టు వెహికల్‌ (మూడువేల కేజీల వరకు బరువున్న లగేజీ వాహనం)కు వాహన విలువలో  7 శాతం జీవిత కాలం పన్ను చెల్లించాలి. మూడేళ్లలోపు రిజిస్ట్రేషన్‌ అయిన వాహనాలకు  6.5 శాతం, 6 నుంచి 9 ఏళ్ల లోపు రిజిస్ట్రేషన్‌ వాహనాలకు 4 శాతం, 9 ఏళ్లు పైబడిన వాహనాలకు దాని విలువలో 1 శాతం పన్ను ఏకకాలంలో చెల్లించాల్సి ఉంటుంది.

ఈ– వాహనాలకు  ఇదే పరిస్థితి..
రిజిస్ట్రేషన్‌ సమయంలో ఈ–రిక్షాకు రూ.1000, ఈ–కారుకు రూ.2వేలు చొప్పున జీవికాలపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేసిన వాహనాలకు ఐదేళ్లు మించిన ఈ–రిక్షాకు రూ.900లు, ఈ –కారుకు రూ.1800  చెల్లించే విధానం ఉంది.

పన్ను ఎగవేతకు ముకుతాడు..
జిల్లాలో సకాలంలో  పన్నులు చెల్లించని ఎగవేతదారులను అరికట్టే ఉద్దేశంతో  రాష్ట్ర రవాణా శాఖ జీవిత కాలంపు పన్ను విధానాన్ని ఏక కాలంలో చెల్లించే  విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో సకాలంలో పన్ను వసూలు చేయవచ్చని ఆలోచనతో ప్రభుత్వం ఉంది. త్రైమాసిక పన్ను చెల్లింపు వి«ధానంలో బకాయిలు ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోయి రవాణా శాఖ ఆదాయానికి గండి కొడుతోంది. పన్ను చెల్లించని వాహనాలపై కేసులు నమోదు చేయడం, వాటిని జప్తు చేయడం అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుత జీవిత కాలపు పన్ను విధానంతో  ఎటువంటి ఇబ్బందులకు తావులేకుండా పన్నులు నిక్కచ్చిగా సకాలంలో వసూలు చేయవచ్చు.

జూలై 1వ తేది నుంచి పకడ్బందీగా..
వాహన యజమానులు పన్ను చెల్లింపు విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిని అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా జీవితకాల పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్యాసింజర్‌ ఆటోలు, మినీ గూడ్స్‌ వెహికల్స్‌కు రిజిస్ట్రేషన్‌ సమయంలోనే లైఫ్‌టైం టాక్స్‌ వసూలు చేస్తారు. ఇప్పటికే తిరుగుతున్న వాహనాలకు (ప్రస్తుతం ఉన్న పాతవాహనాలకు) 6నెలల గడువు ఇస్తారు. గడువులోపు వాహన యాజమానులు జీవితకాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అప్పటికీ పన్ను చెల్లించని వాహనాలపై కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుంది.
– జి. వివేకానందరెడ్డి. ఆర్టీవో, తిరుపతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement