సాక్షి, అమరావతి: పండుగ సమయంలో తమిళనాడు రవాణాశాఖ ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్ని నిలిపేసింది. వెంటనే మన రాష్ట్ర రవాణాశాఖ తమిళనాడు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులపై పట్టు బిగించింది. చివరకు తమిళనాడు అధికారులు దిగొచ్చారు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు సఫలం కావడంతో వివాదం ముగిసింది. రెండు రాష్ట్రాల మధ్య అంతర్‌రాష్ట్ర ఒప్పందం ఉన్నా.. చిన్న కారణాలతో తమిళనాడు అధికారులు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను ఆ రాష్ట్రంలో నిలిపేశారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఏపీఎస్‌ఆర్టీసీ తమిళనాడుకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న సంగతి తెలిసిందే.
బస్సులో పర్మిట్ లేదనే కారణంతో తిరుపతి డిపోకు చెందిన మూడు, చిత్తూరు డిపోకి చెందిన రెండు ఆర్టీసీ బస్సులను తమిళనాడు ఆర్టీఏ అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు చెప్పడంతో తమిళనాడు అధికారులతో చర్చలు జరపాలని రవాణాశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచించారు. మన ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడం వెనుక ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా ప్రమేయం ఉందని భావించిన రవాణాశాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి తమిళనాడుకు చెందిన ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్‌పై తనిఖీలు ముమ్మరం చేసి 24 బస్సులను సరైన పర్మిట్లు లేవని నిలిపేశారు. ఈలోగా రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలప్రదం అయ్యాయి. దీంతో రెండు రాష్ట్రాల అధికారులు ఆర్టీసీ బస్సులను వదిలేశారు.
5 బస్సులు ఆపిన తమిళనాడు.. 24 బస్సుల్ని పట్టుకున్న ఏపీ
Published Sat, Jan 16 2021 5:41 AM | Last Updated on Sat, Jan 16 2021 5:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment