ఈ-రిక్షా.. ట్రాఫిక్‌కు శిక్ష! | Police Department says no to Battery Autos | Sakshi
Sakshi News home page

ఈ-రిక్షా.. ట్రాఫిక్‌కు శిక్ష!

Published Wed, May 23 2018 1:27 AM | Last Updated on Wed, May 23 2018 1:27 AM

Police Department says no to Battery Autos - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ-రిక్షాలు రోడ్డెక్కకముందే అటకెక్కాయి. హైదరాబాద్‌ నగరంలో తీవ్రంగా పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈ-రిక్షాలు ఉపయోగ పడతాయని భావించినా.. ట్రాఫిక్‌ చిక్కులు వాటికి ప్రతిబంధకంగా మారాయి. నెమ్మదిగా తిరిగే ఈ వాహనాలు ట్రాఫిక్‌ సమస్యను తీవ్రం చేస్తాయని భావించిన పోలీసు శాఖ, వాటిని అనుమతించేందుకు ససేమిరా అంటోంది. దీంతో వాటిని నగరంలో తిప్పేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తోంది. ఢిల్లీ తరహాలో ఈ-రిక్షాలను ప్రవేశపెట్టి వీలైనంత మేర వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు చేసిన ప్రయత్నం దాదాపు నీరుగారిపోయింది. వీటికి అనుమతి వస్తుందన్న ఉద్దేశంతో దాదాపు ఐదు కంపెనీలు ఈ-రిక్షాల సరఫరాకు ముందుకు వచ్చినప్పటికీ, ప్రస్తుతం ఆర్డర్లు లేక బిచాణా ఎత్తేసేందుకు సిద్ధమయ్యాయి.

ఢిల్లీలో లక్ష ఈ-రిక్షాలు: రాష్ట్రంలో వాహనాల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ప్రస్తుతం కోటి వాహనాలతో తెలంగాణ కిటకిటలా డుతోంది. ఇందులో మూడొంతులు భాగ్యనగరం, శివారు ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఫలితంగా నగరంపై కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఢిల్లీలో వాహన కాలుష్యం తీవ్రంగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం బ్యాటరీ రిక్షాలను ప్రోత్సహించింది. ప్రస్తుతం అక్కడ దాదాపు లక్ష ఈ-రిక్షాలు తిరు గుతున్నాయి. ఇదే తరహాలో ఇక్కడ కూడా వాటిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి వినతులు రావటంతో, రవాణా శాఖ అనుమతించింది. ప్రస్తుతం నగరంలో 1.20 లక్షల సాధారణ ఆటోలు తిరుగుతున్నాయి. కొత్త ఆటో పర్మిట్లపై సిటీలో నిషేధం ఉన్నా, వేరే జిల్లాలు, నగర శివారు ప్రాంతాల చిరునామాలతో ఆటోలు కొని అక్రమంగా తిప్పుతున్న వారి సంఖ్య ఎక్కువే ఉంది. చాలామంది ఆటోవాలాలు ఖర్చు తగ్గించుకునేందుకు డీజిల్‌లో కిరోసిన్‌ కలుపుతుం డటం కాలుష్యాన్ని మరింత పెంచుతోంది. 

గంటకు 25 కిలోమీటర్లే..
ఈ-రిక్షాలు అందుబాటులోకి వస్తే కాలుష్యాన్ని తగ్గించొచ్చన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. కానీ ఈ-రిక్షాలు గంటకు 25 కి.మీ. కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. ఇది ట్రాఫిక్‌ ఇబ్బందులకు కారణమవుతుంది. మరోవైపు సాధారణ ఆటోలపై నిషేధం ఉన్నా, ఈృరిక్షాలకు అనుమతిస్తే వాటి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగటం ఖాయం. దీంతో ట్రాఫిక్‌ చిక్కులు  పెరుగుతాయని పోలీసు శాఖ నివేదించడంతో రాజధానిలో ప్రస్తుతానికి ఈ-రిక్షాల ప్రవేశానికి ప్రభుత్వం అనుమతించలేదు. శివారు ప్రాంతాలు, ఇతర జిల్లాలకు మాత్రం అనుమతి కొన సాగిస్తోంది. కానీ వేరే చోట్ల వీటికి అంత డిమాండ్‌ లేకపోవటంతో రోడ్లపై అరుదుగానే కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో సాధారణ ఆటోలకు కొత్త పర్మిట్లు మంజూరు చేసే సమయంలో, వాటికి బదులుగా ఈ-రిక్షాలను మాత్రమే కొనేలా ఆంక్షలు విధిస్తే ఫలితముంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ దీనిపై ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించినట్లు కనిపించటం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement