సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీతో శాంతి భద్రతల పర్యవేక్షణ సులభతరం చేసిన పోలీస్ శాఖ, ఇప్పుడు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించింది. హైదరాబాద్ కమిషనరేట్‌లో పూర్తి స్థాయిలో ఈ–చలాన్ వ్యవస్థ, ట్రాఫిక్ పోలీసులకు బాడీ వార్మ్‌డ్ కెమెరాలు, ఆన్‌లైన్ ద్వారా జరిమానాల చెల్లింపు, మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘిస్తే పాయింట్ల విధానం, తదితరాలన్నింటిని అమలుచేసి సక్సెస్ అయ్యింది. ఇదే తరహాలో 60 శాతం మేర సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోనూ టెక్నాలజీ వినియోగాన్ని తీసుకువచ్చారు. ఇప్పుడిదే తరహా ఆధునీకరణ చర్యలను అన్ని జిల్లాల్లోని పోలీస్ విభాగాల్లో ప్రవేశపెట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
క్యాష్‌లెస్ విధానంలో...
రాజధాని ట్రాఫిక్ పోలీసులు ఎక్కడా కూడా నేరుగా జరిమానాలు స్వీకరించడం లేదు. ఈ–సేవ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిమానాల చెల్లింపులు స్వీకరిస్తున్నారు. దీని ద్వారా ట్రాఫిక్ పోలీసులపై వచ్చే అవినీతి ఆరోపణలకు చెక్‌పెట్టినట్టయ్యింది. ఇదే రీతిలో జిల్లాల్లోని అర్బన్ ప్రాంతాల్లో ముందుగా ఈ–చలాన్ విధానం, క్యాష్‌లెస్ చలాన్లను అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందుకుగాను అర్బన్ ప్రాంతాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక సిగ్నల్ వ్యవస్థ, సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. ప్రతిజిల్లాకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మేర నిధులు కేటాయించి ఈ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌లో ప్రవేశపెట్టిన బాడీ వార్మ్‌డ్ కెమెరాలను జిల్లాలోని ట్రాఫిక్ అధికారులకు కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అలాగే నిబంధనలు ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్స్‌పై పాయింట్ల విధానం ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్‌లో అమల్లో ఉంది. దీన్ని జిల్లాల్లో కూడా అమలు చేసే ఆలోచన ఉంది. ఇందుకుగాను ప్రతీ జిల్లాల్లోని రవాణా శాఖ డేటాబేస్‌ను పోలీస్ శాఖ డేటాబేస్‌కు అనుసంధానించేలా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని ఆయా జిల్లాల ఎస్పీలను రాష్ట్ర పోలీస్ శాఖ ఆదేశించినట్టు తెలుస్తోంది. డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు సైతం ప్రతి గురు, శుక్ర, శనివారాలు తప్పనిసరిగా నిర్వహించేలా పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేయబోతోంది. దీని కోసం అత్యాధునిక బ్రీత్ అనలైజర్లు, ఇతర సామగ్రిని కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ప్రతి జిల్లాలో శాంతి భద్రతల విభాగానికి ఉన్నట్టుగానే ప్రత్యేకంగా ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కోసం కంట్రోల్ సెంటర్లను ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. దీని ద్వారా సీసీ కెమెరాల ద్వారా ఆటోమేటిక్ చలాన్ జనరేటింగ్, నిబంధనలు ఉల్లంఘించేవారి జాబితా ఆన్‌లైన్‌లోనే రూపొందించడం సులభతరమవుతుంది. అదే విధంగా అర్బన్ ప్రాంతాల్లో రోడ్లపై జరిగే నేరనియంత్రణ కూడా సులభమవుతుందని పోలీస్ శాఖ భావిస్తోంది.
ఇక జిల్లాల్లో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్
Published Tue, Mar 27 2018 3:03 AM | Last Updated on Tue, Mar 27 2018 3:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment