Traffic control
-
ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్జెండర్లను వలంటీర్లుగా నియమించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోంగార్డ్స్ ప్రస్తుతం ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డ్స్ తరహాలోనే ట్రాన్స్జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థిక భరోసా.. సమాజంలో గౌరవం వలంటీర్లుగా పనిచేసే ట్రాన్స్జెండర్లకు ప్రతినెలా కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి ఆర్థికంగా భరోసా కలి్పంచడంతో పాటు సమాజంలో గౌరవస్థానం కల్పించవచ్చునని సీఎం పేర్కొన్నారు. ఆసక్తిగా ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వారం, పది రోజులపాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని, విధుల్లో ఉండే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండాలని అధికారులకు సూచించారు.శుక్రవారం సచివాలయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ఇతర అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం ఈ విషయం వెల్లడించారు. సీఎం నిర్ణయంతో ఈ కార్యక్రమం విజయవంతమైతే దేశంలో ఇతర నగరాలు కూడా దీనిని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. అడిషనల్ కమిషనర్లందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, ఘనవ్యర్థాల నిర్వహణ మెరుగుపడాలని చెప్పారు. -
విశాఖలో 12 ఫ్లైఓవర్ల నిర్మాణంపై ఫోకస్
సాక్షి, విశాఖపట్నం: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి అధికారులను కోరారు. విశాఖ ట్రాఫిక్ నియంత్రణ అంశంపై సీఐఐ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. సమావేశంలో, అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ నగరంలో విపరీతంగా పెరిగిన సరకు రవాణా, ప్రజారవాణా వాహనాల క్రమబద్ధీకరణపై దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని కోరారు. విశాఖపట్నం–భోగాపురం ఆరులేన్ల రోడ్డు నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి కొంతమేర తగ్గుతుందని చెప్పారు. షీలానగర్–సబ్బవరం రోడ్డు పూర్తయితే నగరంపై ట్రాఫిక్ ప్రభావం తగ్గుతుందని చెప్పారు. విశాఖ నగరం మీదుగా వెళ్లే హైవే–16పై వివిధ ప్రాంతాల్లో 12 ఫ్లై ఓవర్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. ప్రధాన జంక్షన్లలో వ్యాపారులకు ప్రత్యామ్నాయస్థలాలు చూపి, జంక్షన్లను అభివృద్ధి చేయాలని కోరారు. అగనంపూడి టోల్గేట్ అంశంపై అవసరమైతే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తామన్నారు. ఎన్ఏడీ, హనుమంతవాక జంక్షన్ల విస్తరణకు, నగరంలో ట్రక్ పార్కింగ్తో పాటు బస్ పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ విశాఖ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి వీలుపడదని, అర్థచంద్రాకారంలోనైనా రింగ్‌రోడ్డు నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నరసింహనగర్‌లో కొండ తొలిచి అక్కడినుంచి హెల్త్ సిటీలో ఉన్న బీఎస్సార్ బీఆర్టీఎస్ టన్నెల్ నిర్మించే అంశమూ పరిశీలనలో ఉందన్నారు. నగరంలో ట్రాక్టర్ టెర్మినల్స్ ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలొస్తాయన్నారు. విశాఖ నుంచి పాలన కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం దసరా నుంచి విశాఖ నుంచే పాలన సాగించాలని భావించామని, కానీ మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. పరిపాలన రాజధాని వసతులపై సీఎం వైఎస్ జగన్ వేసిన కమిటీ డిపార్ట్మెంట్ భవనాలు ఫైనలైజ్ చేసేవరకు సీఎం రావడం ఆలస్యమవుతుందన్నారు. టీడీపీ నేతలు చెబుతున్నట్టుగా తాము దొడ్డిదారిన వైజాగ్ రావల్సిన అవసరం లేదన్నారు. రైట్‌గా, రాయల్‌గా విశాఖకు వచ్చి ఇక్కడినుంచే తమ నాయకుడు పరిపాలన అందిస్తారని తెలిపారు. సమావేశంలో మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పార్టీ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు కోలా గురువులు, దామా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
వీడియో: రజినీ స్టైల్లో ట్రాఫిక్ క్లియర్.. రోడ్డుపై ఆయనుంటే సందడే వేరు!
సోషల్ మీడియాలో కనిపించే కొన్ని వీడియోలు.. చూడగానే నవ్వు తెప్పిస్తాయి.. కొన్ని వీడియోలు ఆవేదనకు గురిచేస్తాయి. కాగా, ఓ ట్రాఫిక్ పోలీసు వీడియో నెటిజన్లు తెగ ఆకట్టుకుంటోంది. వాహనాలను మళ్లించే ఆయన యూనిక్ స్టైల్ చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న సిటీ హార్ట్ ఆసుపత్రి వద్ద హోంగార్డ్ జోగింద్ర కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు వస్తున్న వాహనాలను వినూత్న రీతిలో నియంత్రిస్తున్నాడు. నలువైపుల వస్తున్న వాహనాలను క్లియర్ చేయడానికి ఆయన డ్యాన్స్ చేస్తూ చూపించిన సైగలు హైలెట్ అని చెప్పవచ్చు. #WATCH | Uttarakhand: Jogendra Kumar, a Home Guard deployed as a Traffic Police personnel near City Heart Hospital in Dehradun, controls the vehicular movement of traffic in a unique way. pic.twitter.com/zy2yyrhMio — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 15, 2022 ఇలా వినూత్న రీతిలో ఆయన వాహనదారులను మళ్లించడం ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. నేను అతడిని ప్రతీరోజూ చూస్తాను. ఆఫీసులకు వెళ్తున్న ఎంతో మందిని ఆయన ఉత్తేజపరుస్తాడు. ఆయనను దేవుడు చల్లాగా చూడాలంటూ కామెంట్స్ చేశాడు. -
గ్రేట్ వారియర్.. గ్రామసింహంపై ప్రశంసల వర్షం
కొన్ని సందర్భాల్లో జంతువుల చేసే పనులు చూస్తే ఔరా అనిపిస్తుంది. మనుషులు ఆలోచనతో చేయలేని పనులను సైతం జంతువులు చేసి చూపిస్తాయి. తాజాగా ఓ కుక్క చేసిన పని చేసి పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. రిపబ్లిక్ ఆఫ్ జార్జియాలోని రోడ్డు ఆ సమయంలో రద్దీగా ఉంది. వాహనాలు బిజీ బిజీగా రోడ్డుపై తిరుగుతున్నాయి. ఈ క్రమంలో కొంత మంది చిన్నారులు రోడ్డు దాటడానికి సిద్దంగా ఉన్నారు. ఇంతలో ఓ పెంపుడు కుక్క అక్కడికి వచ్చి వారికి సాయం అందించింది. రోడ్డును బ్లాక్ చేసి వాహనాలను ఆపి.. పిల్లలు రోడ్డుదాటేలా చూసుకుంది. చిన్నారులు రోడ్డును క్రాస్ చేస్తున్న సమయంలో డాగ్.. క్రాసింగ్ గార్డ్లాగా విధులు నిర్వహించింది. కార్లు ముందుకు కదులుతుంటే కుక్క గర్జిస్తూ వాటిని ఆపింది. ఈ క్రమంలో చిన్నారులు సురక్షితంగా రోడ్డు దాటారు. అనంతరం కుక్క కూడా రోడ్డు మీద నుంచి బయటకు వెళ్లిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. వీడియో ఆఫ్ ది డే, గ్రేట్ వారియర్ అంటూ కామెంట్స్ చేశారు. This Will Make Your Day.❤️ pic.twitter.com/5MFETG4OA9 — Awanish Sharan (@AwanishSharan) July 30, 2022 ఇది కూడా చదవండి: చేసిన కర్మకు తక్షణ ప్రతిఫలం.. ఈ వీడియో చూస్తే కాదనలేరు! -
అవన్నీటితో సంబంధం లేదు.. చల్లాన్లు విధించడంలో బీజీ బీజీ...
సాక్షి, నాగోలు: ట్రాఫిక్ పోలీసుల ముఖ్య విధి ట్రాఫిక్‌ను నియంత్రించడం... ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే వెంటనే రంగంలోకి దిగి వాహనాలు సాఫీగా ముందుకు సాగేలా చేయడం... ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తీసుకోవడం.. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు తమ విధులను పక్కన పెట్టి కేవలం వాహనదారులకు చలాన్లు విధించడంలోనే బిజీగా ఉంటుండంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ►ఎల్బీనగర్ పరిధిలోని వివిధ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు తమ విధులను పక్కన పెట్టి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారులకు చలాన్లు విధించే పనిలోనే ఎప్పుడూ నిమగ్నమై ఉంటున్నారు. ►చౌరస్తాల వద్ద ట్రాఫిక్ జామ్ అయినా.. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిపోయినా తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. కానిస్టేబుళ్లు అందరూ పోగై వాహన తనిఖీలు చేపడుతున్నారు. ► రహదారిపై ఏదైనా ప్రమాదం జరిగితే కొంత మంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అసలు పట్టించుకోవడం లేదు. ►రహదారుల వెంబడి ఉన్న బడా హోటల్ వద్ద అక్రమంగా పార్కింగ్ చేస్తున్న వాహనాల వైపుకూడా కన్నెత్తి చూడటం లేదు. ►ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న ఓ హోటల్ నిర్వాహకులు తమ హోటల్‌కు వచ్చే వినియోగదారులు వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేయిస్తున్నారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ►వివిధ చౌరస్తాల వద్ద ట్రాఫిక్ సిబ్బంది నిలబడి చేతిలో కెమెరాలు పట్టుకొని కేవలం హెల్మెట్ లేని వారు, త్రిబుల్ రైడింగ్ చేసేవారికి ఫొటోలు తీస్తున్నారు. ►వీరు రోజూ కనీసం 100 చలాన్లు విధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ►కొన్నిచోట్ల రోడ్లపై వారాంతపు సంతలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. ► వివిధ చౌరస్తాల వద్ద ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికి చాలన్ విధించడమే పనిగా పెట్టుకున్నారు. ►వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐలతో పాటు కిందస్థాయి సిబ్బంది తమ వెంట తీసుకుని వచ్చిన వాహనలకు పత్రాలు లేని వారి నుంచి పెద్ద ఎత్తున్న డబ్బు వసలు చేస్తున్నారు. ►సర్వీస్ రోడ్డును పూర్తిగా ఆక్రమించుకొని వాహనాలను పార్క్ చేసి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చల్లాన్లు విధించడంలో బీజీ బీజీ... ట్రాఫిక్ నియంత్రణ కోసం చౌరస్తాల్లో నియమిస్తున్న ట్రాఫిక్ పోలీసులు విధులను సక్రమంగా నిర్వర్తించడంలేదు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ట్రాఫిక్ నియంత్రణను పక్కకు వదిలేసి చేతిలో కెమెరా.. ట్యాబ్ పట్టుకొని చలాన్లు విధిస్తూ వాహనదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు కేవలం ఫొటోలు తీయడమే కాకుండా ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేయాలని కోరుతున్నారు. -
'88 ఏళ్ల తర్వాత గుర్రాలపై పోలీసుల గస్తీ'
ముంబై: మహారాష్ట్ర పోలీసులు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు మరోసారి పాత పద్ధతిని అనుసరించబోతున్నారు. శివాజీపార్క్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం మౌంటెడ్ పోలీస్ యూనిట్‌ను విధుల్లోకి ప్రవేశపెట్టనున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. మహానగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా 1932లో మౌంటెడ్ పోలీస్ యూనిట్ సేవలను రద్దు అయినట్లు మంత్రి వెల్లడించారు. నేటి ముంబై పోలీసులు అధునాతన జీపులు, మోటర్ సైకిళ్లు వాడుతున్నారు. గుంపుగా ఉన్న ప్రాంతాల్లో క్రైమ్ పెట్రోల్ చేయడానికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలా చేయడం ఇదే తొలిసారని మంత్రి మీడియాతో పేర్కొన్నారు. గస్తీ విషయంలో గుర్రంపై ఉన్న పోలీస్.. రోడ్ మీద విధుల్లో ఉన్న 30మంది పోలీస్‌లతో సమానమన్నారు. ఒక సబ్ఇన్స్పెక్టర్ క్రింద ప్రస్తుతం 13 గుర్రాలతో కూడిన యూనిట్ ఉండగా.. వచ్చే ఆరునెలల్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ క్రింద 32 మంది కానిస్టేబుల్స్‌తో కూడిన 30 గుర్రాల యూనిట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వీటి కోసం అంధేరీలో 2.5ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. చదవండి: పౌర నిరసనలు : ‘పోలీసులే దొంగలయ్యారు’ -
నెలవంక కనిపించె.. ఆనందం వెల్లివిరిసె
సాక్షి, కర్నూలు(కల్చరల్) : ఆకాశంలో రంజాన్ నెలవంక కనిపించింది..ముస్లిం కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. నెల రోజులుగా సహేరీ, ఇఫ్తార్లతో సందడి సందడిగా సాగిన ఉపవాసాల ప్రతిఫలంగా ఈదుల్ ఫితర్ వచ్చేసింది. ముస్లిం కుటుంబాల నిండా ఆనందోత్సాహాల కెరటాలు ఉప్పొంగుతున్నాయి. నూతన దుస్తులు, అత్తర్ల ఘుమఘుమలు, దూద్ సేమియాలు, బిర్యానీల గుబాళింపులు, ఈద్ ముబారక్‌ల కరచాలనాలతో సందడి చేసుకునే పండుగ ముస్లిం ఇంటి గుమ్మాలలో ఆనంద తోరణాలు కడుతోంది. కర్నూలుతోపాటు నంద్యాల, ఆదోని, ఆత్మకూరు పట్టణాల్లో శుక్రవారం సాయంత్రం ముస్లింలు రంజాన్ నెలవంకను దర్శించారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల సమీపంలోని మైదానంలో రంజాన్ మాసపు చిట్టచివరి ఔట్ పేలింది. ఈదుల్ ఫితర్ పండుగకు సంబంధించిన సందేశాలు మసీదుల నుంచి ముస్లింలందరికీ మతపెద్దలు అందించారు. సిద్ధమైన ఈద్గాలు... నగరంలోని పాత ఈద్గా, కొత్త ఈద్గాల వద్ద ఈదుల్ ఫితర్ నమాజుకు సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. కొత్తబస్టాండ్ సమీపంలోని పాత ఈద్గాలో ఉదయం 9 గంటలకే నమాజు ప్రారంభమవుతుంది. సంతోష్‌నగర్‌లోని కొత్త ఈద్గాలోనూ ఈదుల్ ఫితర్ నమాజుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఈద్గాల వద్ద ముస్లిం సోదరులను ఆహ్వానించే ఫ్లెక్సీలు వెలిశాయి. కొత్త ఈద్గాలో ఉదయం 10 గంటలకు ఈదుల్ ఫితర్ నమాజు ప్రారంభం కానున్నది. జొహరాపురం, గడ్డ ఈద్గాలలో ఉదయం 7 గంటలకే నమాజు జరగనున్నది. పండుగ కోలాహలం... రంజాన్ పండగ కోసం ముస్లిం కుటుంబాలు చేసే కొనుగోళ్లతో కర్నూలులోని పాతబస్తీ సందడి సందడిగా కనిపించింది. శుక్రవారం సాయంత్రం బండిమెట్ట, పూలబజార్, వన్‌టౌన్, చిన్నమార్కెట్, పెద్దమార్కెట్ ప్రాంతాలు రంజాన్ పండుగ వంటకాల కోసం అమ్మే దినుసుల దుకాణాల వద్ద కోలాహలం కనిపించింది. ముస్లిం కుటుంబాలు బారులు తీరి దుకాణాల వద్ద సేమియాలు, పండుగ సామగ్రి కొనుగోలు చేశారు. కిడ్స్ వరల్డ్ సమీపంలో, అబ్దుల్లాఖాన్ ఎస్టేట్‌లోని దుకాణాల వద్ద బారులు తీరి జనం దుస్తులు కొనుగోలు చేయడం కనిపించింది. గుడ్‌బై టు హలీమ్... కర్నూలు నగరంలో రంజాన్ మాసం మొదలైనప్పటినుంచి మే 16వ తేదీ నుంచి వివిధ ప్రాంతాల్లో హలీమ్ అమ్మకాల జోరు కొనసాగింది. ప్రత్యేక సేమియానాలు వేసి సాయంత్రాలు హలీమ్ సెంటర్ల వద్ద సందడి కనిపించేది. శనివారం సాయంత్రం చివరిసారిగా వన్‌టౌన్, గడియారం ఆసుపత్రి, యుకాన్ ప్లాజా, మౌర్యా ఇన్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో ముస్లిం సోదరులు హలీమ్ సేవిస్తూ దానికి గుడ్‌బై చెప్పారు. నమాజ్ వేళల్లో ట్రాఫిక్ నియంత్రణ... నగరంలోని పాత ఈద్గాలో ఉదయం 9 గంటలకే నమాజు ప్రారంభం కానుండటంతో ఆనంద్ కాంప్లెక్స్, రాజ్‌విహార్ మీదుగా వెళ్లే బస్సులను దారి మళ్లించారు. నేషనల్ హైవే వైపుగా వాహనాలను నడిపే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను నగర పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఈద్గాలను పరిశుభ్రం చేసి మంచినీళ్ల ఏర్పాటును నగర మున్సిపల్ కార్పొరేషన్ వారు పర్యవేక్షిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో నగరంలో ఈదుల్ ఫితర్ పండుగ చేసుకునేందుకు పోలీసులు, పురపాలక శాఖ ఏర్పాట్లను చేస్తున్నారు. -
ఇక జిల్లాల్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్
సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీతో శాంతి భద్రతల పర్యవేక్షణ సులభతరం చేసిన పోలీస్ శాఖ, ఇప్పుడు ట్రాఫిక్ మేనేజ్మెంట్పై దృష్టి సారించింది. హైదరాబాద్ కమిషనరేట్‌లో పూర్తి స్థాయిలో ఈ–చలాన్ వ్యవస్థ, ట్రాఫిక్ పోలీసులకు బాడీ వార్మ్డ్ కెమెరాలు, ఆన్లైన్ ద్వారా జరిమానాల చెల్లింపు, మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘిస్తే పాయింట్ల విధానం, తదితరాలన్నింటిని అమలుచేసి సక్సెస్ అయ్యింది. ఇదే తరహాలో 60 శాతం మేర సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోనూ టెక్నాలజీ వినియోగాన్ని తీసుకువచ్చారు. ఇప్పుడిదే తరహా ఆధునీకరణ చర్యలను అన్ని జిల్లాల్లోని పోలీస్ విభాగాల్లో ప్రవేశపెట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. క్యాష్‌లెస్ విధానంలో... రాజధాని ట్రాఫిక్ పోలీసులు ఎక్కడా కూడా నేరుగా జరిమానాలు స్వీకరించడం లేదు. ఈ–సేవ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిమానాల చెల్లింపులు స్వీకరిస్తున్నారు. దీని ద్వారా ట్రాఫిక్ పోలీసులపై వచ్చే అవినీతి ఆరోపణలకు చెక్పెట్టినట్టయ్యింది. ఇదే రీతిలో జిల్లాల్లోని అర్బన్ ప్రాంతాల్లో ముందుగా ఈ–చలాన్ విధానం, క్యాష్‌లెస్ చలాన్లను అమలు చేయాలని భావిస్తున్నారు. ఇందుకుగాను అర్బన్ ప్రాంతాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక సిగ్నల్ వ్యవస్థ, సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. ప్రతిజిల్లాకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మేర నిధులు కేటాయించి ఈ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌లో ప్రవేశపెట్టిన బాడీ వార్మ్డ్ కెమెరాలను జిల్లాలోని ట్రాఫిక్ అధికారులకు కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే వారి డ్రైవింగ్ లైసెన్స్‌పై పాయింట్ల విధానం ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్‌లో అమల్లో ఉంది. దీన్ని జిల్లాల్లో కూడా అమలు చేసే ఆలోచన ఉంది. ఇందుకుగాను ప్రతీ జిల్లాల్లోని రవాణా శాఖ డేటాబేస్‌ను పోలీస్ శాఖ డేటాబేస్కు అనుసంధానించేలా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని ఆయా జిల్లాల ఎస్పీలను రాష్ట్ర పోలీస్ శాఖ ఆదేశించినట్టు తెలుస్తోంది. డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు సైతం ప్రతి గురు, శుక్ర, శనివారాలు తప్పనిసరిగా నిర్వహించేలా పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేయబోతోంది. దీని కోసం అత్యాధునిక బ్రీత్ అనలైజర్లు, ఇతర సామగ్రిని కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ప్రతి జిల్లాలో శాంతి భద్రతల విభాగానికి ఉన్నట్టుగానే ప్రత్యేకంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం కంట్రోల్ సెంటర్లను ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. దీని ద్వారా సీసీ కెమెరాల ద్వారా ఆటోమేటిక్ చలాన్ జనరేటింగ్, నిబంధనలు ఉల్లంఘించేవారి జాబితా ఆన్లైన్లోనే రూపొందించడం సులభతరమవుతుంది. అదే విధంగా అర్బన్ ప్రాంతాల్లో రోడ్లపై జరిగే నేరనియంత్రణ కూడా సులభమవుతుందని పోలీస్ శాఖ భావిస్తోంది. -
ఔటర్‌పై స్పీడుకు బ్రేక్!
వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ నిర్ణయం రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి.. గీత దాటితే జరిమానా ఉమ్టా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: పరిధులు దాటి దూసుకుపోతున్న వాహనాలు... నిత్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఔటర్ రింగ్‌రోడ్డుపై వేగానికి కళ్లెం పడింది. ప్రస్తుతమున్న 120 కిలోమీటర్ల అత్యధిక వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నిర్ణయం తీసుకుంది. దీన్ని ఉల్లంఘించిన వాహనాలకు చలాన్లు జారీ చేయాలని నిర్ణయించారు. ఔటర్‌పై 208 కి.మీ. వేగంతో వాహనాలు వెళుతున్నాయన్న విస్మయకర వాస్తవాన్ని ఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గుర్తించిన నేపథ్యంలో హెచ్ఎండీఏ ఈ మేరకు బ్రేకులు వేసింది. దీంతో పాటు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవల్సిన చర్యలపై సీఎస్ ఎస్పీ సింగ్ అధ్యక్షతన హెచ్ఎండీఏ, రాచకొండ, సైబరాబాద్, నగర పోలీసు కమిషనరేట్లు, ఎండీహెచ్ఎంఆర్ఎల్, రవాణా, ఆర్ అండ్ బీ అధికారులతో సచివాలయంలో యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఉమ్టా) సమావేశం జరిగింది. 2041 నాటికి ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (సీటీఎస్)లో భాగంగా నగరంలో ఎన్ని కిలో మీటర్లలో రోడ్లు అభివృద్ధి చేయాలి, ఎంఎంటీఎస్, మెట్రో రైలును ఎలా అనుసంధానించాలి తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సదుపాయాల కల్పనకు దాదాపు రూ.1.53 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. అలాగే ఓఆర్ఆర్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఐటీసీ)లో భాగంగా అమలుచేయనున్న హైవే మేనేజ్మెంట్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌లో రహదారి పొడవునా సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ ట్రాఫిక్ క్లాసిఫైర్ కౌంట్స్ (ఏ రకపు వాహనాలు వస్తున్నాయో కనిపెడుతుంది), ఎమర్జెన్సీ కాల్ బాక్స్, ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్, సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నట్టు హెచ్ఎండీఏ అధికారులు సీఎస్‌కు వివరించారు. వరద అంచనాకు ‘ఫ్లడ్ సెన్సార్’లు... వానలకు నగరంలోని రోడ్లు జలమయమవుతున్నాయి. ఆ సమయంలో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. ఈ ఇబ్బందులను గుర్తించేందుకు ఎక్కువగా నీరు నిలిచే ప్రాంతాల్లో ఫ్లడ్ సెన్సార్ల ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. వివిధ ప్రాంతాల్లో కాలుష్య స్థాయిని తెలుసుకునేందుకు పొల్యూషన్ సెన్సార్ల ఏర్పాటు అవసరమని అభిప్రాయపడ్డారు. సిటీ ఐటీఎస్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకొనేందుకు బస్సుల్లో జీపీఎస్‌లు అమర్చనున్నారు. దీనికి సంబంధించిన యాప్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. పార్కింగ్ వెతలపై దృష్టి... నగరంలో మరో పెద్ద సమస్య పార్కింగ్. దీనికి చెక్ పెట్టేందుకు నో పార్కింగ్, పార్కింగ్ రోడ్ల జాబితా ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులను సీఎస్ ఆదేశించారు. అలాగే కొత్తగా మల్టీ లెవల్, ఓపెన్ ల్యాండ్ పార్కింగ్‌ల ఏర్పాటుకు సాధ్యసాధ్యాలపై దృష్టి సారించాలని కాంప్రహెన్సివ్ ట్రాన్స్‌పోర్టేషన్ స్టడీ (సీటీఎస్) సిబ్బందికి సూచించారు. సమావేశంలో హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు సందీప్ శాండిల్యా, మహేష్ భగవత్, నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్‌టీఎస్‌తో మేలు అహ్మదాబాద్‌లో విజయవంతంగా అమలవుతున్న బస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ (బీఆర్టీఎస్)ను అధ్యయనం చేసిన హెచ్ఎండీఏ అధికారులు... నగరంలో దీని అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బీఆర్టీఎస్ బస్సుల కోసం డివైడర్‌కు రెండు వైపులా 3.5 మీటర్ల చొప్పున ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తారు. ఈ లైన్లలోకి ఇతర వాహనాలు రాకుండా చూడటం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పి, బస్సుల వేగం పెరుగుతుంది. -
పోలీసులకు యువత సాయం
ఏడాదికి ఓసారి వచ్చే గణేష్ నిమజ్జనంలో ఎంజాయ్ చేయడమే కాదు... పోలీసులకు సహకరిస్తామంటూ ముందుకు వచ్చారు గడ్డిఅన్నారం ప్రాంతానికి చెందిన బాడీబిల్డర్స్. సైబరాబాద్ ఈస్ట్ పోలీసులు ఇచ్చిన స్ఫూర్తితో ‘ది ఇండియన్ జిమ్’ నిర్వాహకుడు కె.రవీందర్‌రెడ్డి స్థానిక యువతను కూడగట్టారు. ఆయన నేతృత్వంలో 40 మంది యువకులు నిమజ్జనం నేపథ్యంలో పోలీసులకు సహకరించడానికి ముందుకు వచ్చారు. వీరికి ప్రత్యేక పాస్‌లు జారీ చేసిన పోలీసులు సరూర్‌నగర్ ట్యాంక్ వద్ద సేవలకు వినియోగించారు. ప్రధాన నిమజ్జనానికి రెండు రోజుల ముందు నుంచీ పోలీసులతో పాటు డ్యూటీ చేసిన ఈ యూత్ గురువారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ట్రాఫిక్ నియంత్రణ, విగ్రహాలను లారీల నుంచి దింపి క్రేన్లలోకి ఎక్కించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకూ తోడ్పడ్డారు. రవీందర్‌రెడ్డి సారథ్యంలో ఆరేళ్ల నుంచి ప్రతిసారీ నిమజ్జనం నేపథ్యంలో ఈ తరహా విధుల్లో పాలుపంచుకుంటున్నాయి. -
పకడ్బందీగా వాహనాల మళ్లింపు
భూత్పూర్: కృష్ణ పుష్కరాల సందర్భంగా మండల కేంద్రం శివారులో పోలీసులు కృష్ణపుష్కరాలకు వెళ్లే వాహనాల మళ్లింపును పకడ్బందీగా చేపడుతున్నారు. కృష్ణపుష్కరాలకు వెళ్లే భక్తులు వారు వెళ్లాల్సిన ఘాట్లను బట్టి పోలీసులు వాహనాలను మళ్లిస్తున్నారు. శుక్రవారం డీఎస్పీ రవీందర్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు వాహనాలను దారి మళ్లింపు చర్యలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు వెళ్లే భక్తులు వారు వెళ్లాల్సిన ఘాట్లను బట్టి వాహనాలను మళ్లించాలని సూచించారు. ప్రయాణికులకు ఆటంకాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ నర్సిములు తదితరులు పాల్గోన్నారు. -
సిద్దిపేటలో ట్రా‘ఫికర్’
పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు ఆరు జంక్షన్లు, రెండు వన్‌వే రహదారులు, మూడు ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పట్టణంలో డీఐజీ పర్యటన సిద్దిపేట రూరల్: సిద్దిపేట పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టనుంది. వాహనదారులు ఇక పట్టణంలో ఎలాంటి ట్రా‘ఫికర్’ లేకుండా సాఫీగా వెళ్లిపోవచ్చు. పట్టణంలో నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసేందుకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో శనివారం డీఐజీ అకున్ సబర్వాల్ పట్టణంలో పర్యటించారు. పట్టణంలోని పలు రహదారుల్లో తిరిగి పరిశీలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్న ప్రదేశాలను గుర్తించారు. ఈ సందర్భంగా సమగ్ర పట్టణాభివృద్ధితో పాటు పలు చోట్ల జంక్షన్ల అభివృద్ధి చేపట్టేందుకు కావాల్సిన ప్రణాళికను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 23న మున్సిపల్, పోలీసు, రవాణా శాఖ ఉన్నతాధికారుల బృందం పర్యటించన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా కానున్న నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల భద్రత, వాహనదారులు, పాదాచారుల సౌకర్యం తదితర అంశాలపై డీఐజీతో పాటు ట్రాఫిక్ సీఐ వెంకటేశం, టౌన్ సీఐ సురేందర్‌రెడ్డిలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. దీనిపై ‘సాక్షి’ కథనం... ఆరు జంక్షన్లు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ఆరు జంక్షన్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమైంది. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్, రూరల్ పోలీసు స్టేషన్ సర్కిల్, వేములవాడ కమాన్ సర్కిల్, కాంచీట్ సర్కిల్, నర్సాపూర్ సర్కిల్, విక్టరీ టాకీస్ సర్కిళ్లను విస్తరించనున్నారు. అలాగే ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా సిగ్నళ్లు ఉన్న చోట ఫ్రీలెఫ్ట్, యూటర్న్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఏ కూడలి వద్ద నేరుగా వాహనాలు రోడ్డు దాటే అవకాశం ఉండదు. నిబంధనల ప్రకారం కొంత దూరం వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం జంక్షన్ల వద్ద డివైడర్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సెంట్రల్ మీడియన్ల ఎత్తు పెంపు చేపడుతున్నారు. పట్టణంలో పాదాచారులకు, వాహనదారుల సౌకర్యార్థం లైన్ మార్కింగ్‌లు, ఫుట్‌పాత్ తదితర పనులు చేపట్టనున్నారు. అదే విధంగా పట్టణంలోని సుభాష్రోడ్డును, కాంఛీట్ చౌరస్తా నుంచి వీరసావర్కర్ వరకు వన్‌వే కానుంది. మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు పట్టణంలో ఉన్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టిందుకు కార్యచరణ రూపొందించారు. హైదారాబాద్ తరహాలో వీటి నిర్మాణాలు జరగనున్నాయి. రద్దీ ప్రాంతాల్లో రోడ్డు దాటేందుకు మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా ఫుట్ఓవర్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. ఇందు కోసం పట్టణంలోని పాత బస్టాండ్-అంబేద్కర్ సర్కిల్, హైదారాబాద్ రోడ్డులో, మెదక్ రోడ్డులోని మల్టీ పర్పస్ హైస్కూల్ సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరగనుంది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పాదాచారులు రోడ్డు దాటేందుకు వీలుంటుంది. ఎంక్రోచ్మెంచ్ రోడ్ మార్కింగ్ పట్టణ అవసరాలకు అనుగుణంగా జంక్షన్ విస్తరణ, యూటర్న్లు, రోడ్ మార్కింగ్‌లు, ఫ్రీకాస్ట్ డివైడర్ల ఏర్పాటు, సెంట్రల్ మీడియన్ల ఎత్తు అవసరాల తగ్గట్టు పెంచడం, విద్యుత్ స్తంబాల వంటివి అడ్డుగా ఉంటే వాటిని పక్కకు తరలించడం, థర్మో పాస్టిక్ పెంయింటింగ్ వేయడం, ఫుట్‌పాత్ అభివృద్ధి తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రత్యేకించి రద్ధీగా ఉండే సుభాష్‌రోడ్‌లో పార్కింగ్ సదుపాయం కల్పించేలా చర్యలు, రోడ్ మార్కింగ్, బస్సు ఆపే ప్రదేశాలు, కార్లు నిలపే ప్రదేశాలు, ఆటో స్టాండ్లు తదితరు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అవసరమైన మేర క్రమబద్దీకరణ చేపట్టనున్నారు. 20 యాక్సీడెంట్ జోన్లు సిద్దిపేట పట్టణ శివారు రహదారుల్లో 20 ప్రాంతాలు యాక్సీడెంట్ జోన్లుగా గుర్తించారు. పొన్నాల దాబాల చౌరస్తా, రంగీలా దాబా చౌరస్తా, రంగధాంపల్లి చౌరస్తా, నాగదేవత గుడి సమీపంతో పాటు తదితర ప్రాంతాలు ప్రమాదాలకు నెలవుగా మారాయి. ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా నియంత్రించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏర్పాటు చేయనున్నారు. -
ఓఆర్ఆర్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు
♦ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగం ♦ పారిశ్రామిక, రీజినల్, ఐటీ రోడ్లను నిర్మిస్తాం ♦ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ♦ రెండో దశ ఔటర్ రింగ్‌రోడ్డు ప్రారంభం ఘట్కేసర్: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. శుక్రవారం ఘట్కేసర్ నుంచి మేడ్చల్ వైపు సుతారిగూడ వరకు ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ రోడ్డును ఆయన రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఓఆర్ఆర్ చుట్టూ ఏర్పాటు చేసే టౌన్‌షిప్‌లలో విద్య, వైద్య అవసరాలు ఉండేలా చూస్తామన్నారు. ఈ రోడ్లపై వాహనాల వేగాన్ని నియంత్రించే ఏర్పాట్లు చేస్తామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఔటర్ వల్ల హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. మరిన్ని ఐటీ, ఇతర పరిశ్రమలు రావడానికి అవకాశం ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి ఔటర్ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రారంభానికి భారీ ఏర్పాట్లు ఔటర్ రింగ్ రోడ్డు ప్రారంభానికి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. మంత్రి వచ్చే మార్గంలో రంగురంగుల జెండాలు, తోరణాలను అలంకరించారు. వాహనాల పార్కింగ్ కోసం బారికేడ్లు ఏర్పాటు చేశారు. టోల్‌ప్లాజాను బెలూన్లతో అలంకరించారు. మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, నగర మేయర్ రామ్మోహన్ తదితరులు వచ్చి ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వచ్చి రిబ్బన్ కట్‌చేసి రోడ్డును ప్రారంభించారు. రెండు గంటల ఆలస్యం ఔటర్ ప్రారంభోత్సవానికి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు 12 గంటలకు విచ్చేస్తారని అధికారులు ముందుగా తెలిపారు. అప్పటికే స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అరుుతే, మంత్రి జలమండలి సమావేశంలో ఉండడంతో సమయానికి రాలేకపోయారు. రెండు గంటల ఆలస్యంగా వచ్చిన మంత్రి రోడ్డును ప్రారంభించారు. వేదిక వద్ద అధికారులు ఓఆర్ఆర్కు సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బండారి శ్రీనివాస్, జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి , నాయకులు బైరురాములు, నక్కనరసింహ, జడిగే రమేష్, సారుురెడ్డి, కొండల్‌రెడ్డి, బొక్క ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10సంవత్సరాలు 99 శాతం ఔటర్ రింగ్ రోడ్డును 2006 జపాన్ సంస్థ ఆర్థిక సహకారంతో ప్రారంభించారు. భూసేకరణ, అలైన్మెంట్లలో చోటుచేసుకున్న పలుమార్పులు, అనుమతుల రాకలో జరిగిన ఆలస్యంతో 10 సంవత్సరాలు గడిచింది. అరుు నా 99శాతం మాత్రం పూర్తరుుంది. ఇంకా 1.1 కిలోమీటర్ మేర పనులు జరగాల్సి ఉంది. కోర్టు వివాదాల కారణంగా అది ఆలస్యం అవుతుంది. ఇంకా 9నెలల కాలంలో మిగిలిన మార్గం అందుబాటులోకి రావచ్చని మంత్రి తెలిపారు. గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రులు ఔటర్‌ను వేర్వేరు చోట్ల ప్రారంభిస్తే నాలుగోసారి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గత నెలలోనే నిర్మాణం పూర్తరుునా.. రోడ్డు నిర్మాణానికి ఆర్థిక సహకారం అందజేసిన జపాన్ సంస్థ ప్రతినిధులు కొన్ని కారణాల వల్ల రాకపోవడంతో అప్పట్లో వారుుదా పడింది. -
యాక్షన్ ప్లాన్
పుష్కరాలకు రవాణా శాఖ ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి 7 స్టేషనరీ కంట్రోల్ రూములు, 5 మొబైల్ కంట్రోల్ టీముల ఏర్పాటు ఇతర జిల్లాల నుంచి 147 మంది సిబ్బంది కేటాయింపు తెలంగాణ ఎంట్రీ పాయింట్ల వద్ద ప్రత్యేక బృందాలు విజయవాడ : కృష్ణా పుష్కరాలకు జిల్లా రవాణా శాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఉన్నతాధికారులతోనూ ఆమోదముద్ర వేయించుకుంది. ట్రాఫిక్ నియంత్రణపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించింది. వాహనాల ఓవర్‌లోడ్, మితిమీరిన వేగం నియంత్రణకు మొబైల్ కంట్రోల్ టీములను ఏర్పాటు చేయనుంది. జిల్లాలో మంగినపూడి బీచ్, అవనిగడ్డ, చెవిటికల్లు, గన్నవరం, ఈడ్పుగల్లు, ఆర్టీసీ బస్టాండ్, విజయవాడ రైల్వేస్టేషన్లో స్టేషనరీ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పుష్కర ఘాట్ల వద్ద ట్రాఫిక్, ఇతర ఇబ్బందులను ఇక్కడి సిబ్బంది పర్యవేక్షిస్తారు. ప్రతి కంట్రోల్ రూమ్‌లో ఒక అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు లేదా హోంగార్డులు విధుల్లో ఉంటారు. ప్రతి 8 గంటలకు ఒక షిఫ్టు చొప్పున రోజుకు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తారు. ప్రతి రూమ్‌ను ఒక ఎంవీఐ, వీటన్నింటినీ ఆర్టీవో పురేంద్ర పర్యవేక్షిస్తారు. ఐదు మొబైల్ టీంలు... వాహనాల వేగం నియంత్రణకు, కీలక రహదారుల్లో ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షించటానికి, ఇబ్బందికర మార్గాల్లో ప్రత్యేక చర్యల పర్యవేక్షణకు ఐదు మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కరకట్ట మార్గంలో కృష్ణలంక నుంచి మోపిదేవి వరకు, వేదాద్రి నుంచి ముక్తేశ్వరం, పులిచింతల మీదుగా జగ్గయ్యపేట వరకు, అవనిగడ్డ నుంచి ఉయ్యూరు రోడ్డు వరకు, గుడిమెట్ల నుంచి వావిరాల మీదుగా చందర్లపాడు వరకు, ఇబ్రహీంపట్నం నుంచి భవానీపురం మీదుగా విజయవాడ నగరం వరకు ఒక్కొక్క టీమ్ చొప్పున పర్యవేక్షణ చేస్తాయి. ప్రతి టీమ్‌లో ఒక ఎంవీఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ లేదా హోంగాార్డు ఉంటారు. వీటిని ఆర్ర్టీవోలు డీఎస్ఎన్ మూర్తి, ఎస్.వెంకటేశ్వరరావు పర్యవేక్షిస్తారు. జిల్లాలోని సిబ్బంది కాకుండా బయటి జిల్లాల నుంచి 147 మంది కానిస్టేబుళ్లు, ఎంవీఐల నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారుల వరకు పుష్కర విధులకు రానున్నారు. వీరంతా ఆగస్టు 10 నాటికి విధులకు హాజరవుతారు. వీరికి బస ఏర్పాటు కోసం 60 గదులు కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. జిల్లా పరిధిలోని సిబ్బందితో తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జగ్గయ్యపేటలోని గరికపాడు చెక్‌పోస్ట్, తిరువూరు సమీపంలో మరోటి ఏర్పాటు చేసి వాహనాల నుంచి పన్నులు వసూలు చేయాలని నిర్ణయించారు. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ మీరా ప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇప్పటికే పుష్కరాల అంశంపై యాక్షన్ ప్లాన్‌పై చర్చించామన్నారు. -
స్మార్ట్ యాప్‌తో ట్రాఫిక్ నియంత్రణ
- ఏపీ డీజీపీ జేవీ రాముడు పుట్టపర్తి టౌన్ (అనంతపురం) హైదరాబాద్ తరహాలో స్మార్ట్ యాప్ ద్వారా రాష్ట్రంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకొంటున్నామని రాష్ట్ర డిజిపి జెవి.రాముడు పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తో పాటు.. జిల్లాలో పర్యటించిన ఆయన తన స్వగ్రామం అయిన నార్సింపల్లి లో చేపట్టనున్న అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ట్రాఫిక్ నియంత్రణకు స్మార్ట్ యాప్‌ను ప్రవేశ పెట్ట నున్నట్లు వివరించారు. పైలట్ ప్రాజెక్ట్ క్రింద అనంతపురంను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. -
అగ్ని పరీక్షకు సన్నద్దం
‘ఐఎఫ్ఆర్’కు పకడ్బందీ ఏర్పాట్లు బయట నుంచి 17 వేల మంది పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు విస్తృత చర్యలు శాంతి భద్రతల పరిరక్షణకు {పత్యేక బృందాలు విశాఖపట్నం : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ నగరం ప్రతిష్టాత్మక స్థాయిలో ఆతిథ్యం ఇవ్వనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) పోలీసులకు ఓ సవాలు కానుంది. దాదాపు 70 దేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారు. మరో వైపు ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించేందుకు 1.5 లక్షల మంది ప్రజలు రానున్నారని అంచనా వేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ నిర్వహణ పెద్ద సమస్యగా మారనుంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రముఖుల భద్రతకు భారీ బలగాలను రప్పిస్తోంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్ల ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థను ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగించుకోనుంది. దేశంలోనే రెండోసారి, రాష్ట్రంలో మొదటిసారి జరుగనున్న ఐఎఫ్ఆర్కు ప్రధాన మంత్రితో పాటు దేశ ముఖ్య నేతలు, ఇతర దేశాల ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. వీరందరికీ రక్షణ కల్పించడమనేది అధికారుల ముందున్న పెద్ద సవాలు. అయితే త్రివిధ దళాలు ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటున్నందున కాస్త వెసులుబాటు కలుగుతుంది. సివిల్ పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వ్, ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ వంటి ప్రత్యేక బలగాలు క్షేత్రస్థాయిలో భద్రత ఏర్పాట్లు చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగర కమిషనరేట్ పరిధిలో 2,800 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వారితో పాటు 16 వేల నుంచి 17వేల మందిని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరనున్నారు. అయితే వచ్చే సిబ్బందికి వసతి ఏర్పాట్లు చేయడం కూడా ముఖ్యం. దీనిపై కూడా కసరత్తు పూర్తయ్యింది. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఉన్నందున పాఠశాలలను విడిచిపెట్టి కళాశాలల్లో పోలీసు సిబ్బందికి వసతి కల్పించనున్నారు. పోలీసు అధికారులకు స్టీల్‌ప్లాంట్, ఎన్టీపీసీ, గీతం, ఏయూతో పాటు పలు సంస్థలు, ప్రైవేటు భవనాలను ఏర్పాటు చేస్తున్నారు. బారికేడ్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై పోలీసులు ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చారు. ప్రముఖులకు, సాధారణ ప్రజలకు వేరు వేరుగా పార్కింగ్ ప్రాంతాలను కేటాయించనున్నారు. నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన 160 ప్రదేశాలను గుర్తించారు. అదే విధంగా ఐఎఫ్ఆర్ సమయంలో సెల్ఫోన్ల ద్వారా బల్క్ మెసేజ్‌లు అనుమతించకూడదనుకుంటున్నారు. దీనిపై మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్లతో చర్చించారు. కొత్తగా సెల్‌టవర్లు ఏర్పాటు చేయమని వారిని కోరారు. ట్రాఫిక్ అప్డేట్స్ను ఎస్ఎంఎస్ అలెర్ట్స్ రూపంలో అన్ని మొబైల్ నెట్వర్క్స్ అందించనున్నాయి. అయితే ఆ మెసేజ్‌లు పోలీసుల నుంచే వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవస్థను పర్యవేక్షించడానికి ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. సిద్ధమవుతున్నాం ఐఎఫ్ఆర్ నిర్వహణ మా ముందున్న పెద్ద బాధ్యత. దానిని విజయవంతం చేయడానికి మూడు నెలల నుంచే కసరత్తు ప్రారంభించాం. 16వేల నుంచి 17 వేల మంది పోలీసు బలగాలు అవసరమవుతారని నిర్ధారణకు వచ్చాం. మావోయిస్టులు, టైస్టుల కార్యకలాపాలను అడ్డుకునే కౌంటర్ పార్టీలు అవసరమవుతాయి. బలగాలను ఇతర జిల్లాల నుంచి ఇప్పించాల్సిందిగా డీజీపీని కోరనున్నాం. వచ్చిన వారికి వసతి కల్పించడం కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేశాం. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ నిర్వాహకులతో చర్చించాం. భద్రత ఏర్పాట్లపై జాగ్రత్త అవసరమని సూచించాం. - అమిత్‌గార్గ్, పోలీస్ కమిషనర్, విశాఖ సిటీ -
కాలుష్యాన్ని తరిమితేనే.. స్మార్ట్
ట్రాఫిక్ నియంత్రణ మెరుగుపడాలి పారిశుధ్యం అధ్వానం స్మార్ట్ సర్వేలో నెటిజన్ల వాణి విశాఖపట్నం సిటీ: జీవీఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌సిటీ సర్వేలో ‘కాలుష్యాన్ని తరిమికొట్టండి మహాప్రభో’ అంటూ ఎక్కువమంది నెటిజనులు సూచించారు. విశాఖ నగరంలో ఏమేం సదుపాయాలు కావాలో వివరించాలని మైగావ్.ఇన్ వెబ్సైట్లో జీవీఎంసీ కోరడంతో 2023మంది తమ ప్రాధాన్యాలను తెలిపారు. 25 శాతంమంది కాలుష్యం నుంచి విశాఖను రక్షించాలని ప్రాధేయపడ్డారంటే నగర ప్రజలు ఈ సమస్యతో ఎంతగా సతమతమవుతున్నారో అర్థమవుతోంది. స్మార్ట్సిటీపై సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు వివిధ రూపాల్లో ప్రజల అభిప్రాయాలను జీవీఎంసీ సేకరించింది. గరిష్టంగా 5 లక్షలమంది నుంచి అభిప్రాయాలు తీసుకోవాలన్నది లక్ష్యం కాగా దాదాపు 3 లక్షలమంది సర్వే పత్రాల ద్వారా, 2,023మంది వెబ్సైట్ ద్వారా సర్వేలో పాల్గొన్నారు. ముందుగా నెటిజన్ల అభిప్రాయాలను క్రోడీకరించి కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఆన్ లైన్ డేటా మేరకు ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం. కాలుష్యం మహా నగరంలో కాలుష్యం విపరీతంగా ఉందని 25 శాతం మంది అభిప్రాయపడ్డారు. గాలి, నీరు, శబ్ద కాలుష్యాలు తట్టుకోలేని విధంగా ఉన్నాయన్నారు. స్మార్ట్ సిటీలో మొదటి ప్రాధాన్యతగా కాలుష్యాన్ని తుదముట్టించాలని వారు సూచించారు. పరిశుభ్రత దారుణం నగరంలో పారిశుధ్య నిర్వహణ ఏ మాత్రం బాగులేదని 14 శాతం అభిప్రాయపడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్య పనులను మెరుగుపరచాలని కోరారు. ట్రాఫిక్/పార్కింగ్ అస్తవ్యస్తం మహా నగరంగా అభివృద్ధి చెందిన తర్వాత ట్రాఫిక్ నిర్వహణ అసలేం బాగోలేదని 13 శాతం మంది అభిప్రాయపడ్డారు. సిగ్నల్ పడినా అధిగమించి వెళ్లే బైక్‌లే అధికంగా ఉంటున్నా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు రూట్ మార్చడం వంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. ప్రజా భద్రత/రక్షణ ఏదీ నగరంలో ప్రజలకు భద్రత, రక్షణ లేదని 9 శాతంమంది అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మహిళలపై దాడులు జరుగుతున్నాయని పే ర్కొన్నారు. ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్‌స్నాచింగ్‌లకు పూనుకుంటున్నారని, ఇలాంటి వారిని అరికట్టేందుకు రక్షణ బృందాల అవసరం వుం దని అభిప్రాయపడ్డారు. వైఫై/ఇంటర్నెట్ నగరం నలుమూలలా ఇంటర్నె ట్, వైఫై కావాలని 6 శాతం మం ది ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నట్టు ఈ సూచనను బట్టి తెలుస్తోంది. విద్య విద్యాలయాల్లో సదుపాయాలు కల్పించాలని 5 శాతం మంది కోరారు. నగరంలోని దాదాపు అన్ని విద్యాలయాల్లోనూ ఒకే రీతిన సమస్యలున్నాయని ఏకరువు పెట్టారు. ఆరోగ్యం వదిలేశారు 20 లక్షల మంది జనాభా ఉన్న నగరంలో ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేశారని 4 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. వ్యాధుల బారిన పడ్డ వారికి ప్రాథమిక చికిత్స అందించే సాయం కూడా జీవీఎంసీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రవాణా మెరుగుపడాలి ప్రజా రవాణా తగినంతగా లేదని 4 శాతంమంది అభిప్రాయపడ్డా రు. రక్షిత మంచినీరు కరువైందని 4 శాతం మంది పేర్కొన్నారు. విద్యుత్/పార్కులు/ఇ గవర్నెన్స్: 24/7 విద్యుత్‌ను 3 శాతంమంది కావాలన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, పార్కుల నిర్వహణ అ ధ్వానంగా ఉందని 3 శాతం మం ది అభిప్రాయపడ్డారు. ఇ-గవర్నె న్స్ అమలు చేయాలని 2 శాతం మంది కోరుకున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరులు కావాలని 1 శాతంమంది కోరారు. -
ఫ్యాక్షన్‌ను అణచివేస్తాం
ధర్మవరం : ఫ్యాక్షన్‌ను జిల్లాలో లేకుండా సమూలంగా అణిచి వేస్తామని జిల్లా ఎస్పీ ఎస్వి రాజశేఖర్‌బాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన ధర్మవరం రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాంతాల ఫ్యాక్షన్ లీడర్లపై కదలికపై గట్టి నిఘా ఉందన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల వ్యవహారంలో ఇప్పటి దాకా 55 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. అత్యంత ప్రజాదరణ పొందిన పోలీస్ ప్రజా బాట కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా సత్ప్రవర్తన, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉన్న వారిపై రౌడీ షీట్లు డిసెంబర్లో ఎత్తివేస్తామన్నారు. ఆయా సర్కిళ్ల పరిధిలో పనిచేసే సిబ్బందికి క్వార్టర్లు నిర్మించే విధంగా ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. ధర్మవరం పట్టణంలో ఉన్న సీసీ కెమెరాలను వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నామన్నారు. వాహనదారులు హెల్మెట్ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్ వద్ద పోలీస్ సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేసి ర్యాలీ ప్రారంభించారు. -
పుష్కర స్నానాలు@ 66.50 లక్షలు
సాక్షి, కొవ్వూరు : గడచిన ఆరు రోజుల్లో జిల్లాలోని 97 పుష్కర ఘాట్లలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 66.50 లక్షలుగా అధికార యంత్రాంగం గణించింది. ఇదిలావుండగా ఆదివారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు 17,46,217 మంది పుణ్యస్నానాలు ఆచరించారు. కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఘాట్లలో 9,36,292 మంది, నరసాపురం డివిజన్ పరిధిలోని మూడు మండలాల్లో 4,59,925 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ఘాట్లలో 3.50 లక్షల మంది స్నానాలు ఆచరించారు. అత్యధికంగా గోష్పాద క్షేత్రంలో 2.72లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. గోష్పాద క్షేత్రం లోని గాయత్రి ధ్యానమందిరంలో కంచి ఉపపీఠాధిపతి విజయేంద్ర సరస్వతిస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణకు కసరత్తు ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో మొబైల్, స్టేషనరీ టీమ్‌లను ఏర్పాటు చేసి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే వాహనాలను గుండుగొలను, నల్లజర్ల, కొయ్యలగూడెం, దేవరపల్లి మీదుగా వివిధ ఘాట్లకు ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. కొవ్వూరులో ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి ముందస్తుగానే కసరత్తు చేసి తాళ్లపూడి జంక్షన్ సమీపంలో ట్రాఫిక్‌ను పోలవరం, పట్టిసీమకు మళ్లించారు. దాదాపు 50వేల మంది యాత్రికులను ఇతర ఘాట్లకు దారి మళ్లించారు. కలెక్టర్ కాటంనేని భాస్కర్ జిల్లాలో నిరంతర నిఘా కొనసాగించడానికి 142 సీసీ కెమెరాలు , 25 మోనిటరింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో 16 వాచ్ టవర్లను ఏర్పాటు చేశారు. -
పోలీసు ఠాణాలు ఖాళీ
పుష్కరాల బందోబస్తుకు భారీ సంఖ్యలో పోలీసులు రాత్రి గస్తీలు కరువు ఇదే అదనుగా జిల్లాలోకి వస్తున్న తమిళ దొంగలు తిరుపతి: జిల్లాలోని పోలీసు స్టేషన్లు ఖాళీ అయ్యాయి. పుష్కరాల బందోబస్తుకు భారీ సంఖ్యలో పోలీసులు తరలివెళ్లారు. దీంతో రాత్రి గస్తీ, హైవే పెట్రోలింగ్, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ అటకెక్కాయి. ఉన్న అరకొర సిబ్బందికి సైతం అదనపు డ్యూటీలు వేస్తుండడంతో వారు విధులపై శ్రద్ధ చూపలేక పోతున్నారు. ముఖ్యంగా ప్రతి రోజూ తిరుపతి నగరానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్ కేంద్రంగా చేసుకుని జేబు దొంగలు రెచ్చిపోతున్నారు. సెల్ఫోన్లు, విలువైన వస్తువులు, ప్రయాణికుల కళ్లు కప్పి క్షణాల్లో మాయం చేస్తున్నారు. దూర ప్రాంతవాసులు కావడంతో వారు ఫిర్యాదు కూడా చేయకుండానే వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం అరకొర పోలీసులు ఉండడంతో దొంగలు సులువుగా తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇదే అదనుగా తమిళనాడు, నగరి, ఓజీ కుప్పం ప్రాంతాల నుంచి పాత నేరస్తులు నగరానికి చేరుకుని పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసు నిఘా కొరవడంతో భక్తులను టార్గెట్ చేసుకోవడంతోపాటు తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. పుష్కరాలకు తరలిన పోలీసులు తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో ఏడుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు, 200 మంది ఏఎస్ఐలు, 600 మంది కానిస్టేబుళ్లు , 54 మంది హోంగార్డులు పుష్కరాల బందోబస్తుకు తరలివెళ్లారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక ఏఎస్పీ, ఏడుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు, 260 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 800 మంది కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులు, 45 మంది ఏఆర్ బెటాలియన్ సిబ్బంది పుష్కరాలకు తరలి వెళ్లారు. పెరిగిన చోరీలు కర్ణాటక సరిహద్దులోని చీకలబైలు సమీపంలోని పెట్రోలు బంకులో నలుగురు దొంగలు చొరబడి రూ.50 వేలు దోచుకెళ్లారు. ఈ నెల 14 తేదీన నిండ్రలో మూడు చోట్ల దొంగతనాలు జరిగాయి. బంగారం, నగదును దోచుకెళ్లారు. శ్రీనివాసపురంలో పట్టపగలే ఇటీవల దొంగలు పడి నగదును దోచుకెళ్లారు. యూనివర్సిటీల్లో మోటారుసైకిళ్ల చోరీలు పెరిగాయి. పోలీసు షీ టీమ్స్ నిఘా లేకపోవడంతో ఆకతాయిల ఆగడాలు పెచ్చుమీరాయి. మూడు రోజుల క్రితం గేట్ దొంగలు రూ.2 లక్షల నగదును దోచుకెళ్లారు. స్టేషన్‌కు వెళ్లితే సమాధానం చెప్పే నాథుడే కరువయ్యారు. చిన్న చిన్న తగాదాలు, ఏవైనా ఫిర్యాదులు వస్తే విచారించేందుకు పోలీసులు వెళ్లటం లేదు. పుష్కరాల తరువాత రమ్మని చెప్పి పంపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రోటోకాల్ సేవలు అందిస్తున్న ఈస్ట్ సీఐని కూడా బందోబస్తు విధులకు నియమించడం గమనార్హం. తిరుపతి ప్రముఖ పుణ్య క్షేత్రం కావడంతో దేశ విదేశాల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న పోలీసులను పుష్కర సేవలకు వినియోగించడంపై భక్తుల్లో అందోళన నెలకొంది. ఇక్కడ ఉన్న పోలీసులను అదనపు విధులకు వినియోగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ట్రాఫిక్ నియంత్రణకు ఇదీ ప్రణాళిక
రాజమండ్రి క్రైం, పుష్కరాల సందర్భంగా మూడంచెల విధానంలో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టినట్టు పుష్కరాల ప్రత్యేక అధికారి కె. ధనుంజయరెడ్డి , రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ ఎస్.హరికృష్ణ తెలిపారు. ఆదివారం ఆర్అండ్బీ అతిథిగృహంలో వారు విలేకరులకు ఈ సంగతి తెలిపారు. పుష్కరాలకు వచ్చే వాహనాలు నిలిపేందుకు 140 పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేశామన్నారు. విశాఖ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, కార్లను లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ, చౌడేశ్వర నగర్ వద్ద పార్కింగ్ చేయాలి. కాంట్రాక్టు క్యారియర్లను అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని హుందయ్ షోరూమ్ వద్ద గల స్థలంలో ను, ఆటోనగర్, దివాన్ చెరువు వద్ద జేసి పేపర్ మిల్లు ఎదురుగా గల స్థలంలో పార్క్ చేయాలి. కార్లు, జీపులను లాలా చెరువు వద్ద ఉన్న రెడ్డి సైటు, రినోల్ట్ సర్వీసు సెంటర్ పక్కన గల ఖాళీ స్థలంలో, జేఎన్. రోడ్డు వద్ద గల చెరుకూరి కన్వెన్షన్‌హాల్ స్థలం, మోరంపూడి వద్ద గల మహాలక్ష్మి మార్కెట్ స్థలంలో పార్క్ చేసుకోవచ్చు. నగరంలో లాలా చెరువు, జి.ఎన్.టి. రోడ్డు , ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్, లాలా చెరువు నుంచి క్వారీ మార్కెట్ రూట్లో గోవింద క్షేత్రం పక్కన గల స్థలంలో, శశి టెక్నో స్కూల్ వద్ద గల స్థలంలో నిలుపుకోవచ్చని తెలిపారు. ఏవీ అప్పారావు రోడ్డు లోని గెయిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో, గెయిల్ ఆఫీసు పక్కన గల స్థలంలో, మురళీ మేన్షన్ వద్ద గల ఖాళీ జాగాలో, శెట్టిబలిజ రామాలయం వద్ద గల స్థలంలో పార్కింగ్ చేసుకోవచ్చన్నారు. రావులపాలెం నుంచి వచ్చే వాహనాలు ఆర్.టి.సి బస్సులకు మినీవ్యాన్స్, లారీ సప్లై ఆఫీసు వద్ద, ప్రైవేటు బస్సులు, కాంట్రాక్టు క్యారేజీ వాహనాలకు వేమగిరి సదరన్ డ్రగ్స్ పక్కన గల ఖాళీ స్థలంలో, రత్న ప్లాస్టిక్స్ పక్కన గల చెరుకూరి ఖాళీ స్థలంలో, వెలుగుబంటి అచ్యుత రామారావు ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసుకోవచ్చని తెలిపారు. కార్లు జీపులను మోరంపూడి మార్బుల్ ఇండియా పక్కన గల స్థలంలో, వీవీ వినాయక్ ఖాళీ స్థలంలో, సిద్ధార్థ డైరీ, చెరుకూరి స్టోరేజి సైట్ పడాల సత్యనారాయణ సైట్లో పార్కింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి వచ్చే వాహనాలు కార్లు జీపులకు అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఖాళీ స్థలం, షిరిడి సాయి నగర్, దవళేశ్వరం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ లో పార్కింగ్ ఏరియా కేటాయించారు. కోరుకొండ, సీతానగరం, విజయవాడ నుంచి గామన్ బ్రిడ్జి మీదుగా వచ్చే వాహనాలు : ఆర్టీసీ బస్సులకు లూథర్ గిరి, క్వారీ వద్ద శివాలయం, గామన్ బ్రిడ్జి వద్ద గల ఆర్.ఎస్.ఆర్. ఖాళీ స్థలంలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రైవేటు బస్సులు, కాంట్రాక్టు క్యారేజీ వాహనాలకు శానిటోరియం వద్ద డెంటల్ కాలేజీ, శానిటోరియం, కాతేరు వద్ద గల తిరుమల స్కూల్, కొంతమూరు చౌదరి సైట్ లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. కార్లు, జీపుల కోసం లూథర్ గిరి, మార్కెట్ యార్డు, మున్సిపల్ కాలనీ గ్రౌండ్స్, క్వారీ శివాలయం వెనుక, కొంతమూరు ఈఏఆర్ ఎయిడెడ్ హై స్కూల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. నిత్యావసర వస్తువులతో వచ్చే వాహనాలను రాత్రి 9గంటలనుంచి 12 గంటల వరకూ అనుమతిస్తారని, వీటిని హైవేపై నక్కల బాబూరావు (వేమగిరి) ఖాళీ స్థలంలో ఆపాలని వివరించారు. వన్‌వేలు... డైవర్షన్లు 17 వన్‌వే రోడ్లు.. నగరంలో 17 రోడ్లను వన్‌వే చేశామని తెలిపారు. రాజమండ్రిని 9 జోన్లు, 18 సెక్టార్లుగా విభజించి బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. వాహనాలు చెడిపోయి ఆగిపోయిన సందర్భాల్లో వెంటన తొలగించేందుకు క్రేన్లు, టాక్ అండ్ టౌ వాహనాలు ఉంచుతున్నామన్నారు. నగరంలో ట్రాఫిక్ పర్యవేక్షణకు 31 మోటారు పెట్రోలింగ్ టీమ్‌లు, 6 హైవే మొబైల్ వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ మళ్లింపులు విశాఖపట్నం నుంచి విజయవాడ ైవె పు వెళ్లే భారీ, ఇతర వాహనాలను దివాన్ చెరువు వద్ద గామన్ బ్రిడ్జి మీదుగా కొవ్వూరు పైపు మళ్లిస్తామన్నారు. చెన్నై , గుంటూరు, విజయవాడ వైపునుంచి విశాఖ వైపు వెళ్లే భారీ, ఇతర వాహనాలను కొవ్వూరు నుంచి గామన్ బ్రిడ్జి మీదుగా దారి మళ్ళించి దివాన్ చెరువు నుంచి విశాఖ పైపు పంపుతామన్నారు. రావులపాలెం నుంచి కాకినాడ, విశాఖ పైపు వెళ్లే ఇతర వాహనాలను జొన్నాడ వద్ద దారి మళ్లించి, మండపేట, రామచంద్రపురం మీదుగా కాకినాడ మళ్లిస్తారన్నారు. హైదరాబాద్, ఖమ్మం, అశ్వారావు పేట మీదుగా విశాఖ వెళ్లే వాహనాలను కొవ్వూరు నుంచి గామన్ బ్రిడ్జి నుంచి విశాఖ వైపు మళ్లిస్తారన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే ట్రాఫిక్ సమస్యకు చెక్
విధులు సక్రమంగా నిర్వహించని వారి వివరాలు తెలియజేయండి ఈ-చలానా తొలగించేది లేదు... అభ్యంతరాలపై డీసీపీని కలవాలి ఆటోలు నిబంధనలు పాటించక తప్పదు ‘ఓపెన్ హౌస్’లో సీపీ విజయవాడ సిటీ : ‘కీలక జంక్షన్లలో సిబ్బంది బాధ్యతారహితంగా విధులు నిర్వహిస్తే ఫొటోలు తీసి పోలీసు వెబ్‌సైట్‌కు గానీ, ఫేస్బుక్ లేదా ఈ-మెయిల్ ద్వారా కానీ పంపితే చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ విభాగంలో 26 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. అందువల్ల జంక్షన్ల వద్ద పర్య వేక్షణ తక్కువగా ఉంటుంది. పౌరులు భాగస్వాములై జంక్షన్లలో ట్రాఫిక్ నియంత్రణను పర్యవేక్షించాలి. అప్పుడే సమస్య పరిష్కారమవుతుంది...’ అని నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దేందుకు పౌరుల నుంచి సలహాలు, సూచనల కోసం శనివారం కమిషనరేట్‌లో ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించారు. బెంజిసర్కిల్ సహా పలు జంక్షన్లలో సిబ్బంది విధులు నిర్వహించకుండా కాలక్షేపం చేస్తున్నారని సామాజిక కార్యకర్త కొల్లూరి వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా సీపీ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో మాదిరి తరచూ ట్రాఫిక్ సమస్యపై సమావేశాలు నిర్వహించి సలహాలు స్వీకరించాలని కోరారు. ట్రాఫిక్ విభాగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందించేందుకు పౌరులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీనిపై సీపీ స్పందిస్తూ నగరంలో 500 కీలక జంక్షన్లు ఉండగా, 86 చోట్ల మాత్రమే ట్రాఫిక్ సిబ్బందిని నియమించగలుగుతున్నామని చెప్పారు. ట్రాఫిక్ విభాగంలో 350 మంది ఉంటే అధికారులు, ఇతర విధుల నిమిత్తం కొందరు సిబ్బంది వెళ్లగా కేవలం 250 మంది మాత్రమే ఉంటున్నారని, వీరితోనే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయాల్సి వస్తుందని చెప్పారు. వీరితో 8 గంటలు కచ్చితంగా పని చేయించడం తమకు సవాల్‌గా మారిందని, పని చేయని సిబ్బందిని గుర్తించి పౌరులు తమకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు, ఆటోల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలని పాతబస్తీకి చెందిన ఒక యువకుడు కోరారు. ఈ-చలానా నుంచి మినహాయించాలని ఆటోడ్రైవర్లు విజ్ఞప్తి చేశారు. ఆటోలను అద్దెకు తీసుకున్న డ్రైవర్లు తప్పు చేస్తే యజమాని జరిమానా కట్టాల్సి వస్తోందని ఆటో యూనియన్ నేత రూబేన్ చెప్పారు. దీనిపై సీపీ స్పందిస్తూ ఆటోలను ఈ-చలానా నుంచి మినహాయించేది లేదని స్పష్టంచేశారు. పోలీసు సిబ్బంది అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఈ-చలానా విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ-చలానా జారీలో పొరపాట్లు చోటుచేసుకున్నా, పోలీసుల చర్యను సవాల్ చేయదలుచుకున్నా డీసీపీ (పరిపాలన) జీవీజీ అశోక్ కుమార్‌ను కలవాలని, ఇందుకోసం ఆయన్ను ప్రత్యేక అధికారిగా నియమిసున్నామని వివరించారు. ఆటో డ్రైవర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ-చలానా సిద్ధం చేసిన 24 గంటల్లోపు ఆటో యజమానికి ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేస్తామని చెప్పారు. ప్రజల ఆలోచనల్లో మార్పుతోనే సాధ్యం పౌరుల ఆలోచనలు, వాహనం నడిపే విధానంలో మార్పు వచ్చినప్పుడే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీపీ చెప్పారు. ట్రాఫిక్ నిర్వహణలో పౌరుల పాత్ర తర్వాతనే పోలీసు, మౌలిక సదుపాయాల పాత్ర ఉంటుందన్నారు. రాజధాని నేపథ్యంలో పెరిగిన వాహనాలను దృష్టిలో పెట్టుకుని కొంత ముందుగా బయలుదేరితే బాగుంటుందని చెప్పారు. పౌరుల ఆలోచనలో మార్పు రానంత వరకు వేల మంది పోలీసులను పెట్టినా సమస్య పరిష్కారం కాదన్నారు. సామాజిక స్పృహతో వాహనాలు నడిపితే సమస్య ఉండదని, బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో పోల్చితే ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు తక్కువని గుర్తుంచుకోవాలని చెప్పారు. సమన్వయంతోనే సాధ్యం ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేసినప్పుడే మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ సాధ్యమని డీసీపీ జీవీజీ అశోక్‌కుమార్ చెప్పారు. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో నగరంలో 300 నుంచి 400 మంది వరకు మరణిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ(ట్రాపిక్) టీవీ నాగరాజు, ఏసీపీలు ఎం.చిదానందరెడ్డి, డి.శ్రావణ్‌కుమార్, ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తాం ఆర్థిక ఇబ్బందులున్నా ప్రత్యామ్నాయ మార్గాల్లో వనరులు సమకూర్చుకొని అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి ట్రాఫిక్ ఇబ్బందులను నిలువరిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ చెప్పారు. ఇప్పటికే పోలీసులతోపాటు ఇతర శాఖల సమన్వయంతో మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. -
మద్యం తాగి వాహనం నడిపితే జైలే!
ట్రాఫిక్ నియంత్రణపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సంగారెడ్డి క్రైం : జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణపై ఎస్పీ సుమతి ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించినా, మద్యం తాగి వాహనాలు నడిపినా జైలుకు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంగా స్పెషల్‌డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, జోగిపేట, పటాన్చెరు, జహీరాబాద్, గజ్వేల్, తూప్రాన్, నారాయణఖేడ్, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో వాహన తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. అంతేగాక అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడిపే వాహనాలను సీజ్ చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోయిన దృష్ట్యా ఎస్పీ సుమతి ప్రత్యేక దృష్టి సారించి వాటి ని అరికట్టేందుకు విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. భారీ వాహనాల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటలకు సంగారెడ్డి పట్టణంలోకి భారీ వాహనాలను, ట్రాక్టర్లను అనుమతించడం లేదు. అంతేగాక పాతబస్టాండ్, కొత్తబస్టాండ్, ఐబీ, ఐటీఐ, పోతిరెడ్డిపల్లి చౌరస్తా ప్రాంతాల్లో పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. లెసైన్సులు, వాహన ధ్రువపత్రాలు లేకుండా నడిపే వాహనాలను సీజ్ చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. 2013, 2014 రెండేళ్లలో నమోదైన కేసులు ఇలా ఉన్నాయి. 2013లో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన వారిపై ట్రాఫిక్ పోలీసులు జిల్లా వ్యాప్తంగా 1,13,795 కేసులు నమోదు చేయగా వారి నుంచి రూ. 2,65,31,710 జరిమానా రూపంలో వసూలు చేశారు. 2014లో 1,11,587 కేసులు నమోదు చేయగా, రూ. 2,06,44,635 జరిమానా రూపంలో వసూలు చేశారు. 2014 సంవత్సరంలో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై జిల్లా వ్యాప్తంగా 1112 కేసులు నమోదు చేశారు. డ్రైవర్లకు ప్రతినెలా అవగాహన సదస్సులు జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య దృష్ట్యా ప్రతినెలా ఆటో డ్రైవర్లకు, వాహన చోదకులకు సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, పటాన్చెరు, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో వాహన చోదకులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. సంగారెడ్డి పట్టణంలోని పాతబస్టాండ్ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు ట్రాఫిక్ తీవ్రంగా వున్న కారణంగా వాహన చోదకులు అవగాహనతో మెలగాలి. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారముంటుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితమైన ప్రయాణం చేయాలి. - సుమతి, ఎస్పీ, మెదక్ తప్పతాగి పోలీసులకు చిక్కిన ఆటో డ్రైవర్ సంగారెడ్డి పట్టణంలో ఓ ఆటో డ్రైవర్ పట్టపగలు పీకల దాకా మద్యం సేవించి ఆటో నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. సంగారెడ్డి పట్టణంలో ఆటో డ్రైవర్ ఎండీ యూసుఫ్ మద్యం సేవించి సోమవారం మధ్యాహ్నం పట్టణంలోని ఐబీ వద్ద మంజీరానగర్‌లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్‌డ్రైవ్‌లో భాగంగా వాహన తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డాడు. అతడిని తనిఖీ చేయగా 210 శాతం మద్యం సేవించినట్లు తేలింది. ఈ మేరకు అతడిని ట్రాఫిక్ సీఐ లింగేశ్వర్‌రావు ఆదేశాల మేరకు ఎస్ఐ శ్రీనివాస్ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
తుడా ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్ !
తుడా పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు రూ.225 కోట్లతో ప్రణాళిక 450 బస్సులు కొనుగోలు చేయాలని ప్రతిపాదించిన అధికారులు జేఎన్ఎన్యూఆర్ఎం కింద ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్రం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు అమలుకు గ్రహణం సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ.. ప్రమాదాలకు చెక్ పెట్టడం.. మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించడం కోసం రూ.225 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు కింద 450 బస్సులు కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. జేఎన్ఎన్ఆర్ఎం(జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్) కింద ఆ ప్రాజెక్టు అమలుకు కేంద్రం అంగీకరించింది. 2012-13లో 15 బస్సుల కొనుగోలుకు రూ.7.50 కోట్లు, 2014-15లో 25 బస్సుల కొనుగోలుకు రూ.12.50 కోట్లు మంజూరు చేసింది. నిధుల మంజూరులో కేంద్రం పిసినారితనం ప్రదర్శిస్తుండడంతో ప్రాజెక్టు అమలు బాలారిష్టాలను అధిగమించలేకపోతోంది. తిరుపతి నగరంతోపాటు తుడా పరిధిలోని శ్రీకాళహస్తి, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లోని గ్రామాలు, పట్టణాల్లో జనాభా నానాటికీ అధికమవుతోంది. జనాభా పెరిగిపోతున్న మేరకు రవాణా సదుపాయాలు అభివృద్ధి చెందడం లేదు. తుడా పరిధిలో అవసరమైన మేరకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో అధికశాతం మంది ప్రజలు ఎక్కడికైనా వెళ్లడానికి ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలపై ఆధారపడుతున్నారు. తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, అప్పలాయగుంటకు భక్తుల తాకిడి నానాటికీ అధికమవుతోంది. ఇది తుడా పరిధిలో ట్రాఫిక్ సమస్య ఏర్పడటానికి దారితీస్తోంది. ట్రాఫిక్ అధికం కావడం వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రమాదాల్లో మరణాల సంఖ్య కూడా రెట్టింపవుతూ వస్తోంది. తుడా పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం.. ప్రమాదాల నివారణ కోసం 2011-12లో రూ.225 కోట్లతో ఓ ప్రణాళికను రూపొందించారు. లక్ష జనాభాకు కనీసం 50 బస్సులు అందుబాటులో ఉంచగలిగితే ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చునని తుడా అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు 450 బస్సులు కొనుగోలు చేస్తే తుడా పరిధిలో ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించవచ్చునని భావించారు. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలపై 2012-13లో కేంద్రం ఆమోదముద్ర వేసింది. 2012-16 మధ్య కాలంలో 225 బస్సుల కొనుగోలు కోసం రూ.112.50 కోట్లు, 2017-2021 మధ్య కాలంలో 113 బస్సుల ఒకనుగోలుకు రూ.56.25 కోట్లు, 2022-31 మధ్య కాలంలో 112 బస్సుల కొనుగోలుకు రూ.56.25 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ఆ మేరకు జేఎన్ఎన్యూఆర్ఎం కింద నిధులు మంజూరు చేస్తామని కేంద్రం పేర్కొంది. కానీ.. నిధుల విడుదలలో మాత్రం పిసినారితనాన్ని ప్రదర్శిస్తోంది. 2012-13లో బస్సుల కొనుగోలుకు కేవలం రూ.7.50 కోట్లను మాత్రమే మంజూరు చేసింది. ఆ నిధులతో 15 బస్సులను కొనుగోలు చేశారు. 2014-15లో 25 బస్సుల కొనుగోలుకు రూ.12.50 కోట్లను ఇటీవల విడుదల చేసింది. మరో రెండేళ్లలో 180 బస్సుల కొనుగోలుకు రూ.90 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. కానీ.. ఆ మేరకు నిధులు విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదని తుడా అధికారవర్గాలు వెల్లడించాయి. బస్సుల కొనుగోలుకు నిధులు విడుదల చేయాలని కేంద్రానికి పదే పదే లేఖలు రాసినా ప్రయోజనం కన్పించడం లేదని అధికారులు చెబుతుండడం గమనార్హం. -
ట్రాఫిక్ నియంత్రణలో ‘కమ్యూనిటీ పోలీస్’
సాక్షి, ముంబై: నగరంలో ఉగ్రరూపం దాల్చిన ట్రాఫిక్ జాం సమస్యను కొంతమేర పరిష్కరించేందుకు ‘కమ్యూనిటీ పోలీసు’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో పాల్గొనే వారికి ట్రాఫిక్ శాఖ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుంది. వారంలో ఒక రోజు, ఏదో ఒక జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేసే అవకాశం కల్పించనున్నారు. ఇలాంటి కార్యక్రమం చేపట్టడం రాష్ట్ర పోలీసు శాఖలో ఇదే ప్రథమం. నిత్యం ట్రాఫిక్ జాంలు.. నగర రహదారులపై విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. రోజు దాదాపు 450కి పైగా కొత్త వాహనాలు ఆర్టీఓలో రిజిస్ట్రేషన్ చేసుకుని రోడ్లపైకి వస్తున్నాయి. ఇలా పెరిగిపోతున్న వాహనాల సంఖ్యతో పోలిస్తే నగర రహదారులు ఎటూ సరిపోవడం లేదు. ఎక్కడ చూసిన ట్రాఫిక్ జాం సమస్య కనిపిస్తోంది. దక్షిణ, మధ్య, ఉత్తర ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించడం లేదు. పట్టుకుంటే ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. పోలీసులనే కొట్టి పారిపోయిన సంఘటనలూ ఉన్నాయి. ప్రత్యేక శిక్షణ ట్రాఫిక్ పోలీసులపై దాడులను తీవ్రంగా పరిగణించిన నగర ట్రాఫిక్ శాఖ ‘కమ్యూనిటీ పోలీసు’ పేరుతో పథకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. స్థానికంగా ఉంటున్న ప్రజలు, రాజకీయ నాయకులు, సామాజిక సేవా సంస్థల సాయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) బి.కే.ఉపాధ్యాయ అన్నారు. ఇందులో పనిచేసే వారికి రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఫుటేజ్‌లు చూపించి, రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పించనున్నామన్నారు. వాహనాలను ఎలా అదుపు చేయాలి, ఎలా దారిమళ్లించాలి అనేక ట్రాఫిక్ నియమాలను కమ్యూనిటీ పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని వివరిస్తారు. ఇలా చేయడం వల్ల నగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టడమేకాకుండా ట్రాఫిక్ జాం సమస్య పరిష్కారం కానుందని ఉపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు.