విధులు సక్రమంగా నిర్వహించని వారి వివరాలు తెలియజేయండి
ఈ-చలానా తొలగించేది లేదు...
అభ్యంతరాలపై డీసీపీని కలవాలి
ఆటోలు నిబంధనలు పాటించక తప్పదు
‘ఓపెన్ హౌస్’లో సీపీ
విజయవాడ సిటీ : ‘కీలక జంక్షన్లలో సిబ్బంది బాధ్యతారహితంగా విధులు నిర్వహిస్తే ఫొటోలు తీసి పోలీసు వెబ్‌సైట్‌కు గానీ, ఫేస్‌బుక్ లేదా ఈ-మెయిల్ ద్వారా కానీ పంపితే చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ విభాగంలో 26 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. అందువల్ల జంక్షన్ల వద్ద పర్య వేక్షణ తక్కువగా ఉంటుంది. పౌరులు భాగస్వాములై జంక్షన్లలో ట్రాఫిక్ నియంత్రణను పర్యవేక్షించాలి. అప్పుడే సమస్య పరిష్కారమవుతుంది...’ అని నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దేందుకు పౌరుల నుంచి సలహాలు, సూచనల కోసం శనివారం కమిషనరేట్‌లో ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించారు. బెంజిసర్కిల్ సహా పలు జంక్షన్లలో సిబ్బంది విధులు నిర్వహించకుండా కాలక్షేపం చేస్తున్నారని సామాజిక కార్యకర్త కొల్లూరి వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా సీపీ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో మాదిరి తరచూ ట్రాఫిక్ సమస్యపై సమావేశాలు నిర్వహించి సలహాలు స్వీకరించాలని కోరారు. ట్రాఫిక్ విభాగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందించేందుకు పౌరులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీనిపై సీపీ స్పందిస్తూ నగరంలో 500 కీలక జంక్షన్లు ఉండగా, 86 చోట్ల మాత్రమే ట్రాఫిక్ సిబ్బందిని నియమించగలుగుతున్నామని చెప్పారు. ట్రాఫిక్ విభాగంలో 350 మంది ఉంటే అధికారులు, ఇతర విధుల నిమిత్తం కొందరు సిబ్బంది వెళ్లగా కేవలం 250 మంది మాత్రమే ఉంటున్నారని, వీరితోనే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయాల్సి వస్తుందని చెప్పారు.
వీరితో 8 గంటలు కచ్చితంగా పని చేయించడం తమకు సవాల్‌గా మారిందని, పని చేయని సిబ్బందిని గుర్తించి పౌరులు తమకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులు, ఆటోల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలని పాతబస్తీకి చెందిన ఒక యువకుడు కోరారు. ఈ-చలానా నుంచి మినహాయించాలని ఆటోడ్రైవర్లు విజ్ఞప్తి చేశారు. ఆటోలను అద్దెకు తీసుకున్న డ్రైవర్లు తప్పు చేస్తే యజమాని జరిమానా కట్టాల్సి వస్తోందని ఆటో యూనియన్ నేత రూబేన్ చెప్పారు. దీనిపై సీపీ స్పందిస్తూ ఆటోలను ఈ-చలానా నుంచి మినహాయించేది లేదని స్పష్టంచేశారు. పోలీసు సిబ్బంది అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఈ-చలానా విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ-చలానా జారీలో పొరపాట్లు చోటుచేసుకున్నా, పోలీసుల చర్యను సవాల్ చేయదలుచుకున్నా డీసీపీ (పరిపాలన) జీవీజీ అశోక్ కుమార్‌ను కలవాలని, ఇందుకోసం ఆయన్ను ప్రత్యేక అధికారిగా నియమిసున్నామని వివరించారు. ఆటో డ్రైవర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ-చలానా సిద్ధం చేసిన 24 గంటల్లోపు ఆటో యజమానికి ఎస్‌ఎంఎస్ రూపంలో తెలియజేస్తామని చెప్పారు.
ప్రజల ఆలోచనల్లో మార్పుతోనే సాధ్యం
పౌరుల ఆలోచనలు, వాహనం నడిపే విధానంలో మార్పు వచ్చినప్పుడే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సీపీ చెప్పారు. ట్రాఫిక్ నిర్వహణలో పౌరుల పాత్ర తర్వాతనే పోలీసు, మౌలిక సదుపాయాల పాత్ర ఉంటుందన్నారు. రాజధాని నేపథ్యంలో పెరిగిన వాహనాలను దృష్టిలో పెట్టుకుని కొంత ముందుగా బయలుదేరితే బాగుంటుందని చెప్పారు. పౌరుల ఆలోచనలో మార్పు రానంత వరకు వేల మంది పోలీసులను పెట్టినా సమస్య పరిష్కారం కాదన్నారు. సామాజిక స్పృహతో వాహనాలు నడిపితే సమస్య ఉండదని, బెంగళూరు, హైదరాబాద్ నగరాలతో పోల్చితే ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు తక్కువని గుర్తుంచుకోవాలని చెప్పారు.
సమన్వయంతోనే సాధ్యం
ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేసినప్పుడే మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ సాధ్యమని డీసీపీ జీవీజీ అశోక్‌కుమార్ చెప్పారు. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో నగరంలో 300 నుంచి 400 మంది వరకు మరణిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ(ట్రాపిక్) టీవీ నాగరాజు, ఏసీపీలు ఎం.చిదానందరెడ్డి, డి.శ్రావణ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్లు, ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
ఆర్థిక ఇబ్బందులున్నా ప్రత్యామ్నాయ మార్గాల్లో వనరులు సమకూర్చుకొని అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి ట్రాఫిక్ ఇబ్బందులను నిలువరిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ చెప్పారు. ఇప్పటికే పోలీసులతోపాటు ఇతర శాఖల సమన్వయంతో మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
ప్రజల భాగస్వామ్యంతోనే ట్రాఫిక్ సమస్యకు చెక్
Published Sun, Mar 1 2015 12:32 AM | Last Updated on Tue, Aug 21 2018 8:06 PM
Advertisement
Advertisement