ఫ్యాక్షన్‌ను అణచివేస్తాం
ధర్మవరం : ఫ్యాక్షన్‌ను జిల్లాలో లేకుండా సమూలంగా అణిచి వేస్తామని జిల్లా ఎస్పీ ఎస్‌వి రాజశేఖర్‌బాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన ధర్మవరం రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాంతాల ఫ్యాక్షన్ లీడర్లపై కదలికపై గట్టి నిఘా ఉందన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల వ్యవహారంలో ఇప్పటి దాకా 55 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. అత్యంత ప్రజాదరణ పొందిన పోలీస్ ప్రజా బాట కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా సత్ప్రవర్తన, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉన్న వారిపై రౌడీ షీట్లు డిసెంబర్‌లో ఎత్తివేస్తామన్నారు.
ఆయా సర్కిళ్ల పరిధిలో పనిచేసే సిబ్బందికి క్వార్టర్లు నిర్మించే విధంగా ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. ధర్మవరం పట్టణంలో ఉన్న సీసీ కెమెరాలను వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నామన్నారు. వాహనదారులు హెల్మెట్ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్ వద్ద పోలీస్ సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేసి ర్యాలీ ప్రారంభించారు.