నిఘా నీడ
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రజలను బెంబేలెత్తిస్తూ ఓ వైపు వరుస చోరీలు.. చైన్ స్నాచింగ్‌లు, మరో వైపు గ్రామాల్లో వర్గ కక్షలతో జిల్లా నిత్యం అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో పోలీసు స్టేషన్లో నమోదైన కేసులు త్వరితగతిన పరిష్కారమైతేనే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేసే వాతావరణం ఉన్నప్పుడే పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకం పెరుగుతుంది. ఆ దిశగా చర్యలన్నిటినీ వేగంగా తీసుకుంటున్నారు జిల్లా ఎస్పీ సూరపునేని వెంకట రాజశేఖర్‌బాబు.
దొంగల అరెస్టు, ప్రాపర్టీ రికవరీ, ఫ్యాక్షన్ నిర్మూలన.. ఇలా ప్రతీ అంశంపై ప్రత్యేక చొరవ చూపిస్తూ ఫలితాలు సాధిస్తున్నారు. నేరస్థులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ఉపక్రమించారు. ‘ప్రజల కోసం రౌండ్ దిక్లాక్ కృషి చేస్తున్నాం.. ఒక్క ఎస్ఎంఎస్ పెట్టండి.. నేర తీవ్రతను బట్టి వెంటనే స్పందిస్తా’మంటున్న ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబుతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ..
సాక్షి: నాలుగు నెలల పనితీరు ఎలా ఉంది?
ఎస్పీ: సంతోషంగానే ఉంది. 2004కు ముందు, ఆ తర్వాత అనంతపురానికి చాలా తేడా ఉంది. ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టింది. కాబట్టి ఇతర అంశాలపై దృష్టి సారిస్తున్నాం.
సాక్షి: ఇటీవల జిల్లాలో ఆరు హత్యలు జరిగాయి. తాడిపత్రి పరిధిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ పరిస్థితిలో ఫ్యాక్షన్ తగ్గిందంటారా?
ఎస్పీ: తాడిపత్రి డివిజన్లో ఆ ఛాయలు ఇంకా ఉన్నాయి. ధర్మవరం పరిధిలో కూడా. ‘ఎన్నికల ఇయర్’ కావడంతో భావోద్వేగాలు ఉంటాయి. వీరాపురం ఘటన బాధిస్తోంది. అవత లి వ్యక్తి తమను ఏదైనా చేస్తారనే భయంతో ముందే ప్రత్యర్థి వర్గంపై దాడులకు తెగిస్తున్నారు. ఫ్యాక్షన్ ఘటనలపై తీవ్రంగా స్పందిస్తున్నాం. చిన్న ఘటనను కూడా పెద్దగా తీసుకుంటున్నాం. తాడిపత్రిలో హత్యకు గురైన సాధిక్ వల్లీది ఫ్యాక్షన్ హత్య కాదు. అతను రౌడీషీటర్. పాతకక్షలతోనే హత్య జరిగింది.
ఫ్యాక్షనిస్టులకు కౌన్సిలింగ్ ప్రారంభిస్తాం. పల్లెనిద్ర కూడా చేస్తున్నాం.
సాక్షి: పల్లె నిద్ర ఫలితాలిస్తోందా?
ఎస్పీ: కచ్చితంగా. ఎస్ఐలు వారానికి, సీఐలు 15రోజులు, డీఎస్పీ నెలకోసారి కచ్చితంగా పల్లె నిద్ర చేయాల్సిందే. ‘గ్రామీణ పోలీసు వ్యవస్థ’ పేరుతో ఒక్కో గ్రామం బాధ్యత ఓ పోలీసుకు అప్పగిస్తున్నాం. సెలవులో ఉన్నా సరే.. రోజూ గ్రామంలోని రెండు వర్గాలను సంప్రదించి ఎప్పటికప్పుడు వివరాలు స్టేషన్‌కు చేర్చాలి. నేరస్తులు, సమస్యాత్మక వ్యక్తులతో పాటు గ్రామానికి సంబంధించిన చిట్టా మొత్తం సేకరిస్తున్నాం.
సాక్షి: దొంగతనాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి? నివారణ చర్యలు ఫలితం ఇస్తున్నాయూ?
ఎస్పీ: దొంగతనాల నివారణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. జిల్లాలో 3 వేల మంది దొంగలను గుర్తించాం. పోలీసులు 4 వేల మంది ఉన్నారు. ‘ఓ దొంగ.. ఓ పోలీసు’ పేరుతో ప్రతీ దొంగ బాధ్యత ఓ పోలీసుకు అప్పగిస్తాం. ఆ దొంగపై పూర్తిగా నిఘా పెట్టే బాధ్యత ఆ పోలీసుదే. దొంగ ఏం చేస్తున్నాడు.. రోజూ ఎక్కడికి వెళుతున్నాడు.. ఇలా ప్రతీ అంశాన్ని సునిశితంగా పరిశీలించి నిఘా పెట్టే బాధ్యత ఆ పోలీసుదే.
సాక్షి: ‘దొంగ-పోలీసు’ వ్యవస్థ ద్వారా నేరాలు అదుపులోకి వస్తాయనుకుంటున్నారా?
ఎస్పీ: కచ్చితంగా వస్తాయి. దీంతో పాటు పెట్రోల్ బంకులు, బస్టాండ్లు, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బ్యాంకులు, కాలేజీలు ఇలా ప్రతీ చోటా లోపలే కాకుండా బయటి ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 300 సీసీ కెమెరాలను అమర్చాం. ‘అనంత’ను పూర్తిగా నిఘా నీడలో పెడుతున్నాం. తద్వారా నేరస్తులను సులువుగా గుర్తించవచ్చు.
సాక్షి: బంగారు, డబ్బు చోరికి గురైతే కేసు నమోదు చేస్తున్నారు. కేవలం కేసు మాత్రమేనా? న్యాయం జరుగుతోందా?
ఎస్పీ: దొంగతనం కేసు నమోదైతే, వారికి కచ్చితంగా ప్రాపర్టీని రికవరీ చేసేలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. నెలలో కోటి రూపాయలు రికవరీ చేశాం. కాస్త అటు.. ఇటు అయినా అందరికీ న్యాయం చేస్తున్నాం. పోయిన డబ్బు, బంగారం తిరిగి ఇస్తేనే నమోదైన కేసుకు ఫలితం ఉంటుంది. ప్రజలు సంతోషిస్తారు. అదే దారిలో ముందుకు వెళుతున్నాం.
సాక్షి: డ్రంక్ అండ్ డ్రైవ్ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.. దీనివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి..
ఎస్పీ: డ్రంక్ అండ్ డ్రైవ్‌ను అరికట్టాలని మాకు గట్టి పట్టుదలే ఉంది. బ్రీత్ అనలైజర్ పరీక్షలో పట్టుబడిన వారిపై కేసు నమోదు చేయాలి. అతన్ని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలి. నగరంలో మనకు మెజి్రస్ట్రేట్ లేరు. దీంతో జాప్యం జరుగుతోంది. ఇకపై రోజూ బ్రీత్ అనలైజింగ్ చేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం. డాబాలు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు అర్ధరాత్రి వరకూ నడపకుండా చర్యలు తీసుకుంటాం.
సాక్షి: డయల్ 100కు కాల్స్ వస్తే స్పందిస్తున్నారా?
ఎస్పీ: తప్పకుండా.. రోజూ 70-100 కాల్స్ వస్తున్నాయి. అలాగే కొందరు నా నెంబరుకు ఫోన్ చేస్తున్నారు. మీటింగ్‌లో ఉన్నపుడు కాల్స్ స్వీకరించలేను. ఎస్ఎంఎస్ (9440796800) పెట్టండి. 24 గంటల్లో ఎప్పుడైనా సరే.. తక్షణం స్పందిస్తా.
సాక్షి: పోలీసుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఎస్పీ: రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా పోలీసుల సంక్షేమం కోసం ‘అనంత’లో చర్యలు తీసుకుంటున్నాం. ఆస్పిటల్, ఆలయాలు, కళ్యాణమంటపం, మినరల్ వాటర్ అన్ని సౌకర్యాలు కల్పించాం. స్కాలర్షిప్లు ఇస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకు పరిహారం, లోన్లు.. ఇలా ప్రతీ అంశంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం.