పోలీసు ఠాణాలు ఖాళీ
పుష్కరాల
బందోబస్తుకు భారీ సంఖ్యలో పోలీసులు
రాత్రి గస్తీలు కరువు
ఇదే అదనుగా జిల్లాలోకి వస్తున్న తమిళ దొంగలు
తిరుపతి: జిల్లాలోని పోలీసు స్టేషన్లు ఖాళీ అయ్యాయి. పుష్కరాల బందోబస్తుకు భారీ సంఖ్యలో పోలీసులు తరలివెళ్లారు. దీంతో రాత్రి గస్తీ, హైవే పెట్రోలింగ్, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ అటకెక్కాయి. ఉన్న అరకొర సిబ్బందికి సైతం అదనపు డ్యూటీలు వేస్తుండడంతో వారు విధులపై శ్రద్ధ చూపలేక పోతున్నారు. ముఖ్యంగా ప్రతి రోజూ తిరుపతి నగరానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్ కేంద్రంగా చేసుకుని జేబు దొంగలు రెచ్చిపోతున్నారు. సెల్‌ఫోన్‌లు, విలువైన వస్తువులు, ప్రయాణికుల కళ్లు కప్పి క్షణాల్లో మాయం చేస్తున్నారు. దూర ప్రాంతవాసులు కావడంతో వారు ఫిర్యాదు కూడా చేయకుండానే వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం అరకొర పోలీసులు ఉండడంతో దొంగలు సులువుగా తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇదే అదనుగా తమిళనాడు, నగరి, ఓజీ కుప్పం ప్రాంతాల నుంచి పాత నేరస్తులు నగరానికి చేరుకుని పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసు నిఘా కొరవడంతో భక్తులను టార్గెట్ చేసుకోవడంతోపాటు తాళాలు వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు సమాచారం.
పుష్కరాలకు తరలిన పోలీసులు
తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో ఏడుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 40 మంది ఎస్‌ఐలు, 200 మంది ఏఎస్‌ఐలు, 600 మంది కానిస్టేబుళ్లు , 54 మంది హోంగార్డులు పుష్కరాల బందోబస్తుకు తరలివెళ్లారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక ఏఎస్పీ, ఏడుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 60 మంది ఎస్‌ఐలు, 260 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 800 మంది కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులు, 45 మంది ఏఆర్ బెటాలియన్ సిబ్బంది పుష్కరాలకు తరలి వెళ్లారు.
పెరిగిన చోరీలు
కర్ణాటక సరిహద్దులోని చీకలబైలు సమీపంలోని పెట్రోలు బంకులో నలుగురు దొంగలు చొరబడి రూ.50 వేలు దోచుకెళ్లారు. ఈ నెల 14 తేదీన నిండ్రలో మూడు చోట్ల దొంగతనాలు జరిగాయి. బంగారం, నగదును దోచుకెళ్లారు. శ్రీనివాసపురంలో పట్టపగలే ఇటీవల దొంగలు పడి నగదును దోచుకెళ్లారు. యూనివర్సిటీల్లో మోటారుసైకిళ్ల చోరీలు పెరిగాయి. పోలీసు షీ టీమ్స్ నిఘా లేకపోవడంతో ఆకతాయిల ఆగడాలు పెచ్చుమీరాయి. మూడు రోజుల క్రితం గేట్ దొంగలు రూ.2 లక్షల నగదును దోచుకెళ్లారు. స్టేషన్‌కు వెళ్లితే సమాధానం చెప్పే నాథుడే కరువయ్యారు.
చిన్న చిన్న తగాదాలు, ఏవైనా ఫిర్యాదులు వస్తే విచారించేందుకు పోలీసులు వెళ్లటం లేదు. పుష్కరాల తరువాత రమ్మని చెప్పి పంపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రోటోకాల్ సేవలు అందిస్తున్న ఈస్ట్ సీఐని కూడా బందోబస్తు విధులకు నియమించడం గమనార్హం. తిరుపతి ప్రముఖ పుణ్య క్షేత్రం కావడంతో దేశ విదేశాల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న పోలీసులను పుష్కర సేవలకు వినియోగించడంపై భక్తుల్లో అందోళన నెలకొంది. ఇక్కడ ఉన్న పోలీసులను అదనపు విధులకు వినియోగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.