మణిపూర్‌లో శాంతి భద్రతలను పునరుద్ధరించాలి
ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టండి
అధికారులకు అమిత్ షా ఆదేశం
న్యూఢిల్లీ/ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ, ప్రజల భద్రత, తాజా పరిణామాలపై కేంద్ర హోంశాఖ అమిత్ షా వరుసగా రెండో రోజు సోమవారం సైతం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మణిపూర్ అధికారులతోపాటు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సాధ్యమైనంత త్వరగా శాంతి భద్రతలను పునరుద్ధరించాలని, ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని అమిత్ షా ఈ సందర్భంగా ఆదేశించారు.
మణిపూర్‌లో కేంద్ర బలగాల మోహరింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాతుల మధ్య ఘర్షణలతో మణిపూర్ గత ఏడాదిన్నర కాలంగా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. మైతేయి, కుకీ వర్గాల మధ్య హింసాకాండలో ఇప్పటిదాకా 220 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
మణిపూర్‌కు 50 కంపెనీల బలగాలు
మణిపూర్‌కు అదనంగా 50 కంపెనీల సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్సెస్(సీఏపీఎఫ్) బలగాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బలగాల్లో 5,000 మందికిపైగా సిబ్బంది ఉంటారని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. రాష్ట్రంలో భద్రతా పరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి, శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి అదనపు బలగాలను రంగంలోకి దించాలని నిర్ణయించినట్లు తెలియజేశాయి. కేంద్ర హోంశాఖ ఇప్పటికే 20 అదనపు సీఏపీఎఫ్ కంపెనీలను మణిపూర్‌కు పంపించింది. ఇందులో 15 సీఆర్‌పీఎఫ్, ఐదు బీఎస్‌ఎఫ్ కంపెనీలు ఉన్నాయి. మరో వారం రోజుల్లోగా అదనంగా 50 కంపెనీలను పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు
మణిపూర్ సమగ్రతపై ఏర్పాటైన సమన్వయ కమిటీ(కోకోమీ) నేతృత్వంలో నిరసనకారులు కర్ఫ్యూ నిబంధనలను ధిక్కరిస్తూ సోమవారం ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. జిరిబామ్‌లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల హత్యకు నిరసనగా వారు తాళాలు వేసే కార్యక్రమం చేపట్టారు. కోకోమీకి మైతేయిల్లో బలమైన పట్టుంది. రాష్ట్రంలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలను మరో రెండు రోజులపాటు నిలిపివేస్తూ మణిపూర్ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది.
మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం
మణిపూర్ పరిణామాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ సోమవారం సాయంత్రం మంత్రులు, ఎన్డీయే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. శాంతి భద్రతలపై సమీక్షించారు. మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పారీ్ట(ఎన్‌పీపీ) మద్దతు ఉపసంహరించిన సంగతి తెలిసిందే. 60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో ఎన్‌పీపీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్‌పీపీ మద్దతు ఉపసంహరించినప్పటికీ ప్రభుత్వానికి వచి్చన ముప్పేమీ లేదు. బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, జేడీ(యూ)కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment