‘గ్రేటర్’లో వలంటీర్లుగా నియమించాలని సీఎం ఆదేశం
వారికి ఆర్థిక భరోసాతోపాటు సమాజంలో గౌరవం లభిస్తుందని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్‌జెండర్లను వలంటీర్లుగా నియమించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోంగార్డ్స్ ప్రస్తుతం ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డ్స్ తరహాలోనే ట్రాన్స్‌జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఆర్థిక భరోసా.. సమాజంలో గౌరవం
వలంటీర్లుగా పనిచేసే ట్రాన్స్‌జెండర్లకు ప్రతినెలా కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి ఆర్థికంగా భరోసా కలి్పంచడంతో పాటు సమాజంలో గౌరవస్థానం కల్పించవచ్చునని సీఎం పేర్కొన్నారు. ఆసక్తిగా ఉన్న ట్రాన్స్‌జెండర్ల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వారం, పది రోజులపాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని, విధుల్లో ఉండే ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండాలని అధికారులకు సూచించారు.
శుక్రవారం సచివాలయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ఇతర అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం ఈ విషయం వెల్లడించారు. సీఎం నిర్ణయంతో ఈ కార్యక్రమం విజయవంతమైతే దేశంలో ఇతర నగరాలు కూడా దీనిని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. అడిషనల్ కమిషనర్లందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, ఘనవ్యర్థాల నిర్వహణ మెరుగుపడాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment