
సాక్షి, విశాఖపట్నం: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి అధికారులను కోరారు. విశాఖ ట్రాఫిక్ నియంత్రణ అంశంపై సీఐఐ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. సమావేశంలో, అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ నగరంలో విపరీతంగా పెరిగిన సరకు రవాణా, ప్రజారవాణా వాహనాల క్రమబద్ధీకరణపై దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని కోరారు.
విశాఖపట్నం–భోగాపురం ఆరులేన్ల రోడ్డు నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి కొంతమేర తగ్గుతుందని చెప్పారు. షీలానగర్–సబ్బవరం రోడ్డు పూర్తయితే నగరంపై ట్రాఫిక్ ప్రభావం తగ్గుతుందని చెప్పారు. విశాఖ నగరం మీదుగా వెళ్లే హైవే–16పై వివిధ ప్రాంతాల్లో 12 ఫ్లై ఓవర్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. ప్రధాన జంక్షన్లలో వ్యాపారులకు ప్రత్యామ్నాయస్థలాలు చూపి, జంక్షన్లను అభివృద్ధి చేయాలని కోరారు. అగనంపూడి టోల్‌గేట్ అంశంపై అవసరమైతే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తామన్నారు.
ఎన్‌ఏడీ, హనుమంతవాక జంక్షన్ల విస్తరణకు, నగరంలో ట్రక్ పార్కింగ్‌తో పాటు బస్ పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ విశాఖ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి వీలుపడదని, అర్థచంద్రాకారంలోనైనా రింగ్‌రోడ్డు నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నరసింహనగర్‌లో కొండ తొలిచి అక్కడినుంచి హెల్త్ సిటీలో ఉన్న బీఎస్సార్ బీఆర్‌టీఎస్ టన్నెల్ నిర్మించే అంశమూ పరిశీలనలో ఉందన్నారు. నగరంలో ట్రాక్టర్ టెర్మినల్స్ ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలొస్తాయన్నారు.
విశాఖ నుంచి పాలన కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం
దసరా నుంచి విశాఖ నుంచే పాలన సాగించాలని భావించామని, కానీ మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. పరిపాలన రాజధాని వసతులపై సీఎం వైఎస్ జగన్ వేసిన కమిటీ డిపార్ట్‌మెంట్ భవనాలు ఫైనలైజ్ చేసేవరకు సీఎం రావడం ఆలస్యమవుతుందన్నారు.
టీడీపీ నేతలు చెబుతున్నట్టుగా తాము దొడ్డిదారిన వైజాగ్ రావల్సిన అవసరం లేదన్నారు. రైట్‌గా, రాయల్‌గా విశాఖకు వచ్చి ఇక్కడినుంచే తమ నాయకుడు పరిపాలన అందిస్తారని తెలిపారు. సమావేశంలో మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పార్టీ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు కోలా గురువులు, దామా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment