నోయిడా: మీ ఫోన్‌లో ఫేస్‌బుక్ ఉంటే చాలు.. ట్రాఫిక్ సమస్యల నుంచి తప్పించుకోవడం సులువవుతుందని నోయిడా పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ జామ్, సిగ్నల్ పనిచేయకపోవడం వంటి సమస్యల గురించి ట్రాఫిక్ విభాగానికి సందేశం పంపిస్తే వెంటనే స్పందిస్తామని అధికారులు అంటున్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్ తమ పేజీని నిర్వహించడానికి ప్రత్యేకంగా కొందరు అధికారులను నియమించాలని నోయిడా ట్రాఫిక్ విభాగం నిర్ణయించింది. నగర ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది చాలా తక్కువగా ఉండడంతో ఆన్‌లైన్ సదుపాయాన్ని కూడా వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల తక్కువ మందితోనే ట్రాఫిక్‌ను పర్యవేక్షించవచ్చు.
తమకు అవసరమైన సిబ్బందిలో 20 శాతం మందినే మాత్రమే కేటాయించడంతో చాలా సమస్యలు ఎదురవుతున్నాయని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. నోయిడాకు దాదాపు 685 మంది అవసరం కాగా, ప్రస్తుతం ఒక ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్, నలుగురు ఎస్సైలు, 137 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. వాహన సంచారాన్ని మరింత సమర్థంగా నిర్వహించడానికి ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు ప్రస్తుతం శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. నోయిడా ట్రాఫిక్ విభాగం ఫేస్‌బుక్ పేజీకి ఇదివరకే 2,250 మంది సభ్యులు ఉన్నారు. ‘ఈ పేజీని నవీకరించేందుకు త్వరలోనే కొందరు అధికారులను నియమిస్తాం. వీళ్లు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమాచారాన్ని ఫేస్‌బుక్ పేజీలో పొందుపరుస్తారు. నగర ట్రాఫిక్‌పై వాహనదారులు ఫేస్‌బుక్ ద్వారా అందించే సలహాలు, ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటాం.
ఫిర్యాదు నిజమని తేలితే తక్షణం సంబంధిత అధికారానికి ఘటనాస్థలానికి పంపించి పరిష్కారానికి ప్రయత్నిస్తాం. నగరంలో కొందరు మైనర్లు ఆటోలు నడుపుతున్నట్టు ఇటీవల నాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నోయిడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్, మమూరాచౌక్ ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి మైనర్ డ్రైవర్లకు చలానాలు విధించాం’ అని నోయిడా ట్రాఫిక్ విభాగం ఎస్పీ రాజీవ్ నారాయణ్ మిశ్రా వివరించారు. ట్రాఫిక్ సిగ్నళ్లు పనిచేయడం లేదని తేలితే, తక్షణం మరమ్మతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. మైనర్లు వాహనాలు నడిపినట్టు తేలితే మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఎస్పీ హెచ్చరించారు.
ఫేస్‌బుక్‌తో ట్రాఫిక్ నియంత్రణ
Published Thu, Jul 24 2014 10:17 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM
Advertisement
Advertisement