కనిపించిన నెలవంక
సాక్షి, కర్నూలు(కల్చరల్) : ఆకాశంలో రంజాన్ నెలవంక కనిపించింది..ముస్లిం కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. నెల రోజులుగా సహేరీ, ఇఫ్తార్‌లతో సందడి సందడిగా సాగిన ఉపవాసాల ప్రతిఫలంగా ఈదుల్ ఫితర్ వచ్చేసింది. ముస్లిం కుటుంబాల నిండా ఆనందోత్సాహాల కెరటాలు ఉప్పొంగుతున్నాయి. నూతన దుస్తులు, అత్తర్ల ఘుమఘుమలు, దూద్ సేమియాలు, బిర్యానీల గుబాళింపులు, ఈద్ ముబారక్‌ల కరచాలనాలతో సందడి చేసుకునే పండుగ ముస్లిం ఇంటి గుమ్మాలలో ఆనంద తోరణాలు కడుతోంది. కర్నూలుతోపాటు నంద్యాల, ఆదోని, ఆత్మకూరు పట్టణాల్లో శుక్రవారం సాయంత్రం ముస్లింలు రంజాన్ నెలవంకను దర్శించారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల సమీపంలోని మైదానంలో రంజాన్ మాసపు చిట్టచివరి ఔట్ పేలింది. ఈదుల్ ఫితర్ పండుగకు సంబంధించిన సందేశాలు మసీదుల నుంచి ముస్లింలందరికీ మతపెద్దలు అందించారు.
సిద్ధమైన ఈద్గాలు...
నగరంలోని పాత ఈద్గా, కొత్త ఈద్గాల వద్ద ఈదుల్ ఫితర్ నమాజుకు సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. కొత్తబస్టాండ్ సమీపంలోని పాత ఈద్గాలో ఉదయం 9 గంటలకే నమాజు ప్రారంభమవుతుంది. సంతోష్‌నగర్‌లోని కొత్త ఈద్గాలోనూ ఈదుల్ ఫితర్ నమాజుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఈద్గాల వద్ద ముస్లిం సోదరులను ఆహ్వానించే ఫ్లెక్సీలు వెలిశాయి. కొత్త ఈద్గాలో ఉదయం 10 గంటలకు ఈదుల్ ఫితర్ నమాజు ప్రారంభం కానున్నది. జొహరాపురం, గడ్డ ఈద్గాలలో ఉదయం 7 గంటలకే నమాజు జరగనున్నది.
పండుగ కోలాహలం...
రంజాన్ పండగ కోసం ముస్లిం కుటుంబాలు చేసే కొనుగోళ్లతో కర్నూలులోని పాతబస్తీ సందడి సందడిగా కనిపించింది. శుక్రవారం సాయంత్రం బండిమెట్ట, పూలబజార్, వన్‌టౌన్, చిన్నమార్కెట్, పెద్దమార్కెట్ ప్రాంతాలు రంజాన్ పండుగ వంటకాల కోసం అమ్మే దినుసుల దుకాణాల వద్ద కోలాహలం కనిపించింది. ముస్లిం కుటుంబాలు బారులు తీరి దుకాణాల వద్ద సేమియాలు, పండుగ సామగ్రి కొనుగోలు చేశారు. కిడ్స్ వరల్డ్ సమీపంలో, అబ్దుల్లాఖాన్ ఎస్టేట్‌లోని దుకాణాల వద్ద బారులు తీరి జనం దుస్తులు కొనుగోలు చేయడం కనిపించింది.
గుడ్‌బై టు హలీమ్...
కర్నూలు నగరంలో రంజాన్ మాసం మొదలైనప్పటినుంచి మే 16వ తేదీ నుంచి వివిధ ప్రాంతాల్లో హలీమ్ అమ్మకాల జోరు కొనసాగింది. ప్రత్యేక సేమియానాలు వేసి సాయంత్రాలు హలీమ్ సెంటర్ల వద్ద సందడి కనిపించేది. శనివారం సాయంత్రం చివరిసారిగా వన్‌టౌన్, గడియారం ఆసుపత్రి, యుకాన్ ప్లాజా, మౌర్యా ఇన్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో ముస్లిం సోదరులు హలీమ్ సేవిస్తూ దానికి గుడ్‌బై చెప్పారు.
నమాజ్ వేళల్లో ట్రాఫిక్ నియంత్రణ...
నగరంలోని పాత ఈద్గాలో ఉదయం 9 గంటలకే నమాజు ప్రారంభం కానుండటంతో ఆనంద్ కాంప్లెక్స్, రాజ్‌విహార్ మీదుగా వెళ్లే బస్సులను దారి మళ్లించారు. నేషనల్ హైవే వైపుగా వాహనాలను నడిపే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను నగర పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఈద్గాలను పరిశుభ్రం చేసి మంచినీళ్ల ఏర్పాటును నగర మున్సిపల్ కార్పొరేషన్ వారు పర్యవేక్షిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో నగరంలో ఈదుల్ ఫితర్ పండుగ చేసుకునేందుకు పోలీసులు, పురపాలక శాఖ ఏర్పాట్లను చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment