మద్యం తాగి వాహనం నడిపితే జైలే!
ట్రాఫిక్ నియంత్రణపై ఎస్పీ ప్రత్యేక దృష్టి
సంగారెడ్డి క్రైం : జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణపై ఎస్పీ సుమతి ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించినా, మద్యం తాగి వాహనాలు నడిపినా జైలుకు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంగా స్పెషల్‌డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, జోగిపేట, పటాన్‌చెరు, జహీరాబాద్, గజ్వేల్, తూప్రాన్, నారాయణఖేడ్, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో వాహన తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు.
అంతేగాక అతివేగంగా, అజాగ్రత్తగా వాహనాలు నడిపే వాహనాలను సీజ్ చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోయిన దృష్ట్యా ఎస్పీ సుమతి ప్రత్యేక దృష్టి సారించి వాటి ని అరికట్టేందుకు విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. భారీ వాహనాల కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటలకు సంగారెడ్డి పట్టణంలోకి భారీ వాహనాలను, ట్రాక్టర్లను అనుమతించడం లేదు. అంతేగాక పాతబస్టాండ్, కొత్తబస్టాండ్, ఐబీ, ఐటీఐ, పోతిరెడ్డిపల్లి చౌరస్తా ప్రాంతాల్లో పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. లెసైన్సులు, వాహన ధ్రువపత్రాలు లేకుండా నడిపే వాహనాలను సీజ్ చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.
2013, 2014 రెండేళ్లలో నమోదైన కేసులు ఇలా ఉన్నాయి. 2013లో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన వారిపై ట్రాఫిక్ పోలీసులు జిల్లా వ్యాప్తంగా 1,13,795 కేసులు నమోదు చేయగా వారి నుంచి రూ. 2,65,31,710 జరిమానా రూపంలో వసూలు చేశారు. 2014లో 1,11,587 కేసులు నమోదు చేయగా, రూ. 2,06,44,635 జరిమానా రూపంలో వసూలు చేశారు. 2014 సంవత్సరంలో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై జిల్లా వ్యాప్తంగా 1112 కేసులు నమోదు చేశారు.
డ్రైవర్లకు ప్రతినెలా అవగాహన సదస్సులు
జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య దృష్ట్యా ప్రతినెలా ఆటో డ్రైవర్లకు, వాహన చోదకులకు సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో వాహన చోదకులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. సంగారెడ్డి పట్టణంలోని పాతబస్టాండ్ నుంచి పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు ట్రాఫిక్ తీవ్రంగా వున్న కారణంగా వాహన చోదకులు అవగాహనతో మెలగాలి. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారముంటుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితమైన ప్రయాణం చేయాలి.
- సుమతి, ఎస్పీ, మెదక్
తప్పతాగి పోలీసులకు చిక్కిన ఆటో డ్రైవర్
సంగారెడ్డి పట్టణంలో ఓ ఆటో డ్రైవర్ పట్టపగలు పీకల దాకా మద్యం సేవించి ఆటో నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. సంగారెడ్డి పట్టణంలో ఆటో డ్రైవర్ ఎండీ యూసుఫ్ మద్యం సేవించి సోమవారం మధ్యాహ్నం పట్టణంలోని ఐబీ వద్ద మంజీరానగర్‌లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్‌డ్రైవ్‌లో భాగంగా వాహన తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డాడు. అతడిని తనిఖీ చేయగా 210 శాతం మద్యం సేవించినట్లు తేలింది. ఈ మేరకు అతడిని ట్రాఫిక్ సీఐ లింగేశ్వర్‌రావు ఆదేశాల మేరకు ఎస్‌ఐ శ్రీనివాస్ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.