తణుకు : సుక్కేసి.. ఎంచక్కా వాహనంపై చెక్కేసేవారికి ‘సుక్క’లు కనబడతాయని అధికా రులు హెచ్చరిస్తున్నారు. జరిమానా, జైలు శిక్షతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకూ వెనుకాడబోమని స్పష్టం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు చేపట్టారు.
పెరుగుతున్న కేసులు
జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరుగుతున్నాయి. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. పోలీసులు, రవాణాశాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నా మందుబాబులు మాత్రం తగ్గడంలేదు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చేసుకున్న ప్రభుత్వం కూడా కఠిన చర్యలకు పూనుకోవడంలేదు. వెరసి విలువైన ప్రజల జీవితాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంతో సుప్రీంకోర్టు పోలీసులకు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది.
దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా ట్రాఫిక్, సాధారణ పోలీసులు, రవాణాశాఖ అధికారుల సమన్వయంతో వాహనాలపై ప్రయాణించే వారిని పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే మూడునెలలపాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేసేందుకూ అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితో జరిమానా వేసి వదిలేసేవారు. కోర్టులో హాజరు పరిస్తే ఒకటి నుంచి 15 రోజుల వరకూ జైలు శిక్ష విధించేవారు.
బీకేర్ ఫుల్..!
ఇప్పుడు ట్రాఫిక్ నిబంధనలను అధికారులు మరింత కఠినతరం చేశారు. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎంవీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసేవారు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలకు కారకులై బాధితుడి మృతికి కారణమైన డ్రైవర్లపై 304 పార్ట్ 2, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలు శిక్షలు పడేలా చట్టాలకు పదును పెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా వచ్చిన నిబంధనల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే మూడు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేస్తున్నారు. ఒక వేళ పట్టుబడిన సమయంలో డ్రైవింగ్ లైసెన్సు లేదని తప్పుడు సమాచారం ఇస్తే ఆధార్ నంబరు ఆధారంగా లైసెన్సు గుర్తించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్సులన్నీ ఆధార్‌తో అనుసంధానం చేశారు.
మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన సమయంలో సంబంధిత వాహన పత్రాలను పరిశీలించి లోపాలుంటే జైలు శిక్ష, అదనంగా రూ.5 వేలు నుంచి రూ. 10 వేలు వరకు రవాణాశాఖ అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 6,169 కేసులు నమోదు చేయగా వీరిలో 401 మందికి జైలు శిక్ష విధించి మొత్తం రూ. 41.16 లక్షలు జరిమానాల రూపంలో వసూలు చేశారు. ఇలా ఒక్కసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే మొత్తమ్మీద రూ.10 వేల జరిమానాతోపాటు జైలు శిక్ష, మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దు ఎదుర్కొనక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
నిబంధనలు ఇవీ...!
వాహనదారుల రక్తంలో ప్రతి 100 మిల్లీలీటర్లకు ఆల్కహాల్ శాతం 30 ఎంజీ ఉంటే నేరంగా పరిగణిస్తారు. అయితే కొత్త చట్టం ప్రకారం దీన్ని 20 ఎంజీకి తగ్గించారు. జిల్లాలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన మందుబాబులను కోర్టులో ప్రవేశపెడితే తీవ్రతను బట్టి జరిమానా, జైలుశిక్ష విధిస్తున్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదం చేసి బాధితుడి మృతికి కారణమైనా, రాంగ్ రూట్‌లో అధిక వేగంగా వాహనం నడిపి రోడ్డు ప్రమాదాలు చేసినా, రోడ్డు ప్రమాదం చేసిన వెంటనే బాధితుణ్ని దగ్గరలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చి వైద్యం సహాయం అందించకుండా పారిపోయి అతడి మృతికి కారణమైనా శిక్షార్హులవుతారు.
అలాగే ఓవర్ లోడింగ్‌తో డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదం చేసి బాధితుడి మరణానికి కారణమైనా, వస్తు రవాణా వాహనాల్లో ప్రయాణికులను ఎక్కిం చుకున్నా, పాసింజర్ వాహనాల్లో అనుమతి ఇవ్వబడిన దానికంటే అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకుని రోడ్డు ప్రమాదాలు చేసి మరణానికి కారణమైనా, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా బాధితుల మరణానికి కారణమైనా శిక్షార్హులు అవుతారు. సెక్షన్ 279 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు
మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. మద్యం తాగినప్పుడు స్వయంగా వాహనాలు నడపకుండా జగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. నిబంధనలు ఉల్లంఘించి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే ఇప్పటి వరకు జైలుశిక్షతోపాటు జరిమానా విధించేవారు. ఇకపై డ్రైవింగ్ లైసెన్సునూ మూడు నెలల పాటు రద్దు చేస్తాం.
– ఎన్‌యూఎన్‌ఎస్ శ్రీనివాస్, ఎంవీఐ, తణుకు
Comments
Please login to add a commentAdd a comment