![Justice Alok Aradhe: Live streaming services in 29 court hall - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/21/judge.jpg.webp?itok=E6l304zF)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో కేసుల విచారణకు సంబంధించి ఆన్‌లైన్ లైవ్ ప్రసారాలను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రారంభించనున్నారు. ఉదయం 10.15 గంటలకు హైకోర్టులోని 29 హాళ్లలో విచారణల లైవ్ ప్రసార సేవలను ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత 10.30 గంటల నుంచి లైవ్ ప్రసారాలు ప్రారంభం అవుతాయి.
ఇప్పటికే మొదటి కోర్టు హాల్‌లో లైవ్ ప్రసార సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కొన్ని నెలలుగా ఈ సేవలు న్యాయవాదులకు, ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇకపై మిగతా కోర్టుల్లో జరిగే విచారణలను కూడా వీక్షించే వీలు కలగనుంది. దీనితో న్యాయవాదులకు కూడా ఆన్‌లైన్ ద్వారా వాదనలు వినిపించే అవకాశం లభిస్తుంది. భవిష్యత్‌లో న్యాయవాదులే కాకుండా వాదప్రతివాదుల నుంచి న్యాయమూర్తులు ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లో వివరాలు తెలుసుకోవచ్చు.
అన్ని కోర్టులను ఆన్‌లైన్ లైవ్ పరిధిలోకి తీసుకొచ్చి న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువచేస్తామని సుప్రీంకోర్టు పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్‌లైన్ లైవ్ ప్రసారాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. లైవ్ ప్రసారాలతో పెండింగ్ కేసులు తగ్గే అవకాశం ఉందని, కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని కోర్టు వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు లైవ్ ప్రసారాలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment