కాలుష్యాన్ని తరిమితేనే.. స్మార్ట్
ట్రాఫిక్ నియంత్రణ మెరుగుపడాలి
పారిశుధ్యం అధ్వానం
స్మార్ట్ సర్వేలో నెటిజన్ల వాణి
విశాఖపట్నం సిటీ: జీవీఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌సిటీ సర్వేలో ‘కాలుష్యాన్ని తరిమికొట్టండి మహాప్రభో’ అంటూ ఎక్కువమంది నెటిజనులు సూచించారు. విశాఖ నగరంలో ఏమేం సదుపాయాలు కావాలో వివరించాలని మైగావ్.ఇన్ వెబ్‌సైట్‌లో జీవీఎంసీ కోరడంతో 2023మంది తమ ప్రాధాన్యాలను తెలిపారు. 25 శాతంమంది కాలుష్యం నుంచి విశాఖను రక్షించాలని ప్రాధేయపడ్డారంటే నగర ప్రజలు ఈ సమస్యతో ఎంతగా సతమతమవుతున్నారో అర్థమవుతోంది. స్మార్ట్‌సిటీపై సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు వివిధ రూపాల్లో ప్రజల అభిప్రాయాలను జీవీఎంసీ సేకరించింది. గరిష్టంగా 5 లక్షలమంది నుంచి అభిప్రాయాలు తీసుకోవాలన్నది లక్ష్యం కాగా దాదాపు 3 లక్షలమంది సర్వే పత్రాల ద్వారా, 2,023మంది వెబ్‌సైట్ ద్వారా సర్వేలో పాల్గొన్నారు. ముందుగా నెటిజన్ల అభిప్రాయాలను క్రోడీకరించి కంప్యూటర్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఆన్ లైన్ డేటా మేరకు ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.
కాలుష్యం
మహా నగరంలో కాలుష్యం విపరీతంగా ఉందని 25 శాతం మంది అభిప్రాయపడ్డారు. గాలి, నీరు, శబ్ద కాలుష్యాలు తట్టుకోలేని విధంగా ఉన్నాయన్నారు. స్మార్ట్ సిటీలో మొదటి ప్రాధాన్యతగా కాలుష్యాన్ని తుదముట్టించాలని వారు సూచించారు.
పరిశుభ్రత దారుణం
నగరంలో పారిశుధ్య నిర్వహణ ఏ మాత్రం బాగులేదని 14 శాతం అభిప్రాయపడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్య పనులను మెరుగుపరచాలని కోరారు.
ట్రాఫిక్/పార్కింగ్ అస్తవ్యస్తం
మహా నగరంగా అభివృద్ధి చెందిన తర్వాత ట్రాఫిక్ నిర్వహణ అసలేం బాగోలేదని 13 శాతం మంది అభిప్రాయపడ్డారు. సిగ్నల్ పడినా అధిగమించి వెళ్లే బైక్‌లే అధికంగా ఉంటున్నా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు రూట్ మార్చడం వంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు.
ప్రజా భద్రత/రక్షణ ఏదీ
నగరంలో ప్రజలకు భద్రత, రక్షణ లేదని 9 శాతంమంది అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మహిళలపై దాడులు జరుగుతున్నాయని పే ర్కొన్నారు. ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్‌స్నాచింగ్‌లకు పూనుకుంటున్నారని, ఇలాంటి వారిని అరికట్టేందుకు రక్షణ బృందాల అవసరం వుం దని అభిప్రాయపడ్డారు.
వైఫై/ఇంటర్‌నెట్
నగరం నలుమూలలా ఇంటర్‌నె ట్, వైఫై కావాలని 6 శాతం మం ది ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నట్టు ఈ సూచనను బట్టి తెలుస్తోంది.
విద్య
విద్యాలయాల్లో సదుపాయాలు కల్పించాలని 5 శాతం మంది కోరారు. నగరంలోని దాదాపు అన్ని విద్యాలయాల్లోనూ ఒకే రీతిన సమస్యలున్నాయని ఏకరువు పెట్టారు.
ఆరోగ్యం వదిలేశారు
20 లక్షల మంది జనాభా ఉన్న నగరంలో ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేశారని 4 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. వ్యాధుల బారిన పడ్డ వారికి ప్రాథమిక చికిత్స అందించే సాయం కూడా జీవీఎంసీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా రవాణా మెరుగుపడాలి
ప్రజా రవాణా తగినంతగా లేదని 4 శాతంమంది అభిప్రాయపడ్డా రు. రక్షిత మంచినీరు కరువైందని 4 శాతం మంది పేర్కొన్నారు.
విద్యుత్/పార్కులు/ఇ గవర్నెన్స్: 24/7 విద్యుత్‌ను 3 శాతంమంది కావాలన్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్, పార్కుల నిర్వహణ అ ధ్వానంగా ఉందని 3 శాతం మం ది అభిప్రాయపడ్డారు. ఇ-గవర్నె న్స్ అమలు చేయాలని 2 శాతం మంది కోరుకున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరులు కావాలని 1 శాతంమంది కోరారు.