రక్తకన్నీరు | Not restricted to road accidents | Sakshi
Sakshi News home page

రక్తకన్నీరు

Published Fri, Jan 24 2014 1:21 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

రక్తకన్నీరు - Sakshi

రక్తకన్నీరు

  • కట్టడి లేని రోడ్డు ప్రమాదాలు  
  •  ఏటా వందల్లో మృత్యువాత..క్షతగాత్రులు వేలల్లోనే...
  •  అనాథగా మారుతున్న కుటుంబాలు
  •  పాఠం నేర్చుకోని ప్రజలు, అధికారులు
  •  
     భర్తను కోల్పోయిన భార్య.. తల్లిని పోగొట్టుకొని తల్లడిల్లుతున్న పిల్లలు.. తీవ్రంగా గాయపడి అంగవైకల్యంతో జీవచ్ఛవాల్లా బతుకుతున్న అభాగ్యులు.. ప్రతి నిత్యం ప్రమాదాలే! రక్తం పారని రహదారి లేదు.. కన్నీరు ఆగిన రోజు లేదు. రోడ్డుమీదకెళితే క్షేమంగా తిరిగొస్తామన్న భరోసా లేదు. అతి వేగం, ట్రాఫిక్ నియంత్రణ లోపం, రవాణా శాఖ నిర్లక్ష్యం తదితర కారణాలతో రహదారులపై రక్తపుటేరులు పారుతున్నాయి. ఎన్నో కుటుంబాలు దిక్కులేనివవుతున్నాయి. ఈ పరిణామాలతో ప్రజలు, అధికారులు గుణపాఠం నేర్వకపోవడమే అసలైన విషాదం.    
     
     విశాఖ నగర పరిధిలో 43 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. అత్యధిక ప్రమాదాలు ఇక్కడే నమోదవుతున్నాయి. ఒక్క 2013లోనే 1184 రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో సగానికిపైగా జాతీయ రహదారిమీదే కావడం గమనార్హం. మొత్తం 398 మంది మృత్యువాడ పడగా,అందులో 130మంది వరకు హైవేపైనే ప్రాణాలు వదిలారు. హైవే రోడ్లు చక్కగా ఉండడంతో వాహనాలను అతి వేగంగా నడిపి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ప్రాణాలు పోతున్నా గుణపాఠం నేర్వడం లేదు.
         
     ప్రమాదాలపై పోలీసు శాఖ పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదు. రద్దీ సెంటర్లలో సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాల్సివున్నా పూర్తి స్థాయిలో అమలవలేదు. విశాఖలో 91 ప్రదేశాల్లో కొత్తగా సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ తలపెట్టింది. వీటికి అనుసంధానంగా సీసీ కెమెరాలు కూడా బిగించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రయత్నం ఏడాదిన్నర నుంచీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మారింది. జీవీఎంసీ సిగ్నల్ స్తంభాల  ఏర్పాటులో జాప్యం చేయడంతో పని అడుగు కూడా ముందుకు పడడంలేదు. ముఖ్యంగా డాబాగార్డెన్స్, డైమండ్ పార్క్, సిరిపురం, మర్రిపాలెం తదితర ప్రాంతాల్లో సిగ్నల్స్ సరిపడినన్ని లేక నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది.
         
     సంఘటన స్థలానికి తక్షణమే 108 వాహనం చేరుకునే వీలులేక చాలామంది క్షతగాత్రులు మధ్యలోనే మృత్యువాత పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోని ఖాళీ అంబులెన్స్‌లను రద్దీ ప్రాంతాల్లో ఉంచేలా పోలీసులు ప్రయత్నాలు చేసినా పెద్దగా అమల్లోకి రాలేదు.
         
     జాతీయ రహదారిపై లారీలు సహా భారీ వాహనాలు నడిపే డ్రైవర్లలో చాలామందికి కంటిచూపు సమస్య ఉందని, అందువల్ల వాహన వేగాన్ని నియంత్రించడంలో విఫలమై రోడ్డుప్రమాదా లు పెరుగుతున్నాయని ఒక అధ్యయనంలో తేలింది. అయినప్పటికీ వీరికి ప్రత్యేక శిబిరాల ద్వారా కంటి పరీక్షలు, లేదా హెచ్చరికలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
         
     రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయమై మృతి చెందుతున్నవారే ఎక్కువ. మిగతా అవయవాలు చితికిపోయి, వాటిని పోగొట్టుకుని జిల్లాలో వేలాదిమంది నిత్యం ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు.
         
     జిల్లాతోపాటు సిటీలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలు చాలావరకు మైనర్లు, డ్రైవింగ్ లెసైన్స్ లేని వారి చేతుల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. వీరికి వాహనం నడపడంలో అవగాహన లేక అనేక నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. పోలీసులు ఇటువంటి వారి నుంచి కేవలం చలానాలు వసూలు చేయడం వరకే పరిమితమవుతున్నారు. నగరంలో అయితే కేవలం వీరిని స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించి వదిలేస్తున్నారు.
         
     కండిషన్‌లో లేని కాలం చెల్లిన వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. చాలా ప్రమాదాలకు ఇవి కూడా కారణంగా నిలుస్తున్నా రవాణా,పోలీసు శాఖలు మనకెందుకులే అనే ధోరణితో వ్యవహరిస్తుండడం పరిస్థితి నానాటికీ దిగజారేలా చేస్తోంది.
     
     జీవచ్ఛవాల్లా బతుకుతున్నాం

     మా ఇద్దరు కుమారుల్లో చిన్నోడు ఎర్నిబాబుకు సేవాభావం ఎక్కువ. ఏటా ఆగస్టు 15కు పిల్లలకు బహుమతులు ఇచ్చేవాడు. గతేడాది కూడా పిల్లలకు వస్తువులు కొనడానికి వెళ్ళి వస్తూ రోడ్డుప్రమాదానికి గురై పుత్రశోకం మిగిల్చాడు. చిన్న వయస్సులోనే మా కోడలు తన భర్తను  కోల్పోయింది. నా బిడ్డ మరణించాక జీవచ్ఛవాల్లా బతుకుతున్నాం.    
     - గంగమ్మ, పురుషోత్తపురం, విశాఖ
     
     ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు

     రోడ్డు ప్రమాదాలు కొంతవరకు పెరుగుతున్నమాట వాస్తవమే. ఇవి మాకు కూడా కలవరం కలిగిస్తున్నాయి. 2014 నుంచి సిటీలో రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మార్చినాటికి 98 చోట్ల సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేస్తాం. రద్దీ ప్రాంతాల్లో పోలీసులతోపాటు వలంటీర్లను కూడా ఉపయోగించి వారి సాయంతో ట్రాఫిక్ రద్దీని నివారిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే తక్షణం వైద్య సాయం అందక మరణిస్తున్నవారు అధికంగా ఉంటున్నారు. అందుకోసం నగరంలోని అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖాళీగా ఉంటున్న అంబులెన్స్‌లను ప్రమాదాలు ఎక్కువగా జరిగే హైవే, ఇతర ప్రాంతాల్లో ఉంచేలా ప్రయత్నాలు చేస్తున్నాం.       
     - శివధరరెడ్డి, నగర పోలీస్ కమిషనర్
     
     తండ్రి మరణంతో ఛిన్నాభిన్నం

     మా నాన్న పోకూరి సత్య కొండలరావు గత ఏడాది జూలై 19వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన పాన్‌షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. నాన్న మరణించడంతో పూట గడవడం కష్టంగా మారింది. అన్నయ్య సాయి రవితేజ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతని చదువు పాడవకూడదని కుటుంబ పోషణ భారం నేను తీసుకున్నాను. పాన్ షాపు నడుపుతూ.. కుటుంబ పోషణతోపాటు అన్నయ్యను చదివించే బాధ్యతను నెరవేరుస్తున్నాను. పదో తరగతి వరకు చదువుకున్న నేను నేవల్‌కు తర్ఫీదు పొందుతూ ఈ పని చేస్తున్నాను.
     - సాయి భువనచంద్ర, బర్మా కాలనీ, అనకాపల్లి
     
     రోడ్డునపడ్డాం
     నా భార్య రాములమ్మ మృతితో సర్వం కోల్పోయా. ఇద్దరం కలకాలం కష్టాలు లేకుండా జీవితాన్ని సాగించాలనుకున్నాం. జీపు రూపంలో వచ్చిన మృత్యువు మా కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. నేను చదువుకోకపోయినా నా భార్యను బాగా చదివించాను. ఆమెకు ఉద్యోగం వస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయనుకున్నాం. కాని ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తున్న నా భార్యను జీపు ఢీకొనడంతో మృతి చెందింది. ఆమె మృతితో దిక్కులేనివాడినయ్యా. నా కుటుంబం రోడ్డున పడింది.     
     - జంపా రాజుబాబు, మల్లవరం, కొయ్యూరు మండలం
     
     బిడ్డను పోగొట్టుకున్నాం..
     మా చిన్నబ్బాయి సురేష్‌కుమార్‌ను అల్లారుముద్దుగా పెంచుకున్నాం. మొన్న సం క్రాంతి పండగనాడు కోడలికి (పెద్ద కుమారుడి భార్య)ఆరోగ్యం బాగులేక, ఆమెను ఆస్పత్రికి తరలించి తిరిగి వస్తుంటే మా చిన్న కొడుకుని రోడ్డు ప్రమాదం బలిగొంది. ఒక విధానం అంటూ లేకుండా నిర్మించిన  బీఆర్‌టీఎస్ రహదారి కడుపుకోత మిగిల్చింది. పండగనాడు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. త్వరలో పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేద్దామనే ఆలోచనలో ఉండగా ఈ ఘోరం జరిగిపోయింది. చేతికందిన బిడ్డ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కోలుకోలేకపోతున్నాం. ఏ తల్లిదండ్రులకీ ఇలాంటి కష్టం రాకూడదు.              
     - భాస్కరరావు, భాగ్యలక్ష్మి, సుజాతనగర్, పెందుర్తి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement