- తుడా పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు రూ.225 కోట్లతో ప్రణాళిక
- 450 బస్సులు కొనుగోలు చేయాలని ప్రతిపాదించిన అధికారులు
- జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్రం
- నిధులు విడుదల చేయకపోవడంతో ప్రాజెక్టు అమలుకు గ్రహణం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ.. ప్రమాదాలకు చెక్ పెట్టడం.. మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించడం కోసం రూ.225 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు కింద 450 బస్సులు కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. జేఎన్‌ఎన్‌ఆర్‌ఎం(జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్) కింద ఆ ప్రాజెక్టు అమలుకు కేంద్రం అంగీకరించింది.
2012-13లో 15 బస్సుల కొనుగోలుకు రూ.7.50 కోట్లు, 2014-15లో 25 బస్సుల కొనుగోలుకు రూ.12.50 కోట్లు మంజూరు చేసింది. నిధుల మంజూరులో కేంద్రం పిసినారితనం ప్రదర్శిస్తుండడంతో ప్రాజెక్టు అమలు బాలారిష్టాలను అధిగమించలేకపోతోంది. తిరుపతి నగరంతోపాటు తుడా పరిధిలోని శ్రీకాళహస్తి, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లోని గ్రామాలు, పట్టణాల్లో జనాభా నానాటికీ అధికమవుతోంది. జనాభా పెరిగిపోతున్న మేరకు రవాణా సదుపాయాలు అభివృద్ధి చెందడం లేదు.
తుడా పరిధిలో అవసరమైన మేరకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో అధికశాతం మంది ప్రజలు ఎక్కడికైనా వెళ్లడానికి ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలపై ఆధారపడుతున్నారు. తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, అప్పలాయగుంటకు భక్తుల తాకిడి నానాటికీ అధికమవుతోంది. ఇది తుడా పరిధిలో ట్రాఫిక్ సమస్య ఏర్పడటానికి దారితీస్తోంది. ట్రాఫిక్ అధికం కావడం వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి.
ప్రమాదాల్లో మరణాల సంఖ్య కూడా రెట్టింపవుతూ వస్తోంది. తుడా పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం.. ప్రమాదాల నివారణ కోసం 2011-12లో రూ.225 కోట్లతో ఓ ప్రణాళికను రూపొందించారు. లక్ష జనాభాకు కనీసం 50 బస్సులు అందుబాటులో ఉంచగలిగితే ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చునని తుడా అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు 450 బస్సులు కొనుగోలు చేస్తే తుడా పరిధిలో ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించవచ్చునని భావించారు. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.
ఈ ప్రతిపాదనలపై 2012-13లో కేంద్రం ఆమోదముద్ర వేసింది. 2012-16 మధ్య కాలంలో 225 బస్సుల కొనుగోలు కోసం రూ.112.50 కోట్లు, 2017-2021 మధ్య కాలంలో 113 బస్సుల ఒకనుగోలుకు రూ.56.25 కోట్లు, 2022-31 మధ్య కాలంలో 112 బస్సుల కొనుగోలుకు రూ.56.25 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ఆ మేరకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద నిధులు మంజూరు చేస్తామని కేంద్రం పేర్కొంది. కానీ.. నిధుల విడుదలలో మాత్రం పిసినారితనాన్ని ప్రదర్శిస్తోంది.
2012-13లో బస్సుల కొనుగోలుకు కేవలం రూ.7.50 కోట్లను మాత్రమే మంజూరు చేసింది. ఆ నిధులతో 15 బస్సులను కొనుగోలు చేశారు. 2014-15లో 25 బస్సుల కొనుగోలుకు రూ.12.50 కోట్లను ఇటీవల విడుదల చేసింది. మరో రెండేళ్లలో 180 బస్సుల కొనుగోలుకు రూ.90 కోట్లను విడుదల చేయాల్సి ఉంది. కానీ.. ఆ మేరకు నిధులు విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదని తుడా అధికారవర్గాలు వెల్లడించాయి. బస్సుల కొనుగోలుకు నిధులు విడుదల చేయాలని కేంద్రానికి పదే పదే లేఖలు రాసినా ప్రయోజనం కన్పించడం లేదని అధికారులు చెబుతుండడం గమనార్హం.