అగ్ని పరీక్షకు సన్నద్దం
‘ఐఎఫ్‌ఆర్’కు పకడ్బందీ ఏర్పాట్లు
బయట నుంచి 17 వేల మంది పోలీసులు
ట్రాఫిక్ నియంత్రణకు విస్తృత చర్యలు
శాంతి భద్రతల పరిరక్షణకు {పత్యేక బృందాలు
విశాఖపట్నం : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ నగరం ప్రతిష్టాత్మక స్థాయిలో ఆతిథ్యం ఇవ్వనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) పోలీసులకు ఓ సవాలు కానుంది. దాదాపు 70 దేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారు. మరో వైపు ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించేందుకు 1.5 లక్షల మంది ప్రజలు రానున్నారని అంచనా వేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ నిర్వహణ పెద్ద సమస్యగా మారనుంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రముఖుల భద్రతకు భారీ బలగాలను రప్పిస్తోంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్ల ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థను ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగించుకోనుంది.
దేశంలోనే రెండోసారి, రాష్ట్రంలో మొదటిసారి జరుగనున్న ఐఎఫ్‌ఆర్‌కు ప్రధాన మంత్రితో పాటు దేశ ముఖ్య నేతలు, ఇతర దేశాల ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. వీరందరికీ రక్షణ కల్పించడమనేది అధికారుల ముందున్న పెద్ద సవాలు. అయితే త్రివిధ దళాలు ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటున్నందున కాస్త వెసులుబాటు కలుగుతుంది. సివిల్ పోలీసులు, ఆర్మ్‌డ్ రిజర్వ్, ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ వంటి ప్రత్యేక బలగాలు క్షేత్రస్థాయిలో భద్రత ఏర్పాట్లు చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగర కమిషనరేట్ పరిధిలో 2,800 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వారితో పాటు 16 వేల నుంచి 17వేల మందిని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరనున్నారు. అయితే వచ్చే సిబ్బందికి వసతి ఏర్పాట్లు చేయడం కూడా ముఖ్యం. దీనిపై కూడా కసరత్తు పూర్తయ్యింది. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఉన్నందున పాఠశాలలను విడిచిపెట్టి కళాశాలల్లో పోలీసు సిబ్బందికి వసతి కల్పించనున్నారు. పోలీసు అధికారులకు స్టీల్‌ప్లాంట్, ఎన్టీపీసీ, గీతం, ఏయూతో పాటు పలు సంస్థలు, ప్రైవేటు భవనాలను ఏర్పాటు చేస్తున్నారు.
బారికేడ్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై పోలీసులు ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చారు. ప్రముఖులకు, సాధారణ ప్రజలకు వేరు వేరుగా పార్కింగ్ ప్రాంతాలను కేటాయించనున్నారు. నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన 160 ప్రదేశాలను గుర్తించారు. అదే విధంగా ఐఎఫ్‌ఆర్ సమయంలో సెల్‌ఫోన్ల ద్వారా బల్క్ మెసేజ్‌లు అనుమతించకూడదనుకుంటున్నారు. దీనిపై మొబైల్ నెట్‌వర్క్ ప్రొవైడర్లతో చర్చించారు. కొత్తగా సెల్‌టవర్లు ఏర్పాటు చేయమని వారిని కోరారు. ట్రాఫిక్ అప్‌డేట్స్‌ను ఎస్‌ఎంఎస్ అలెర్ట్స్ రూపంలో అన్ని మొబైల్ నెట్‌వర్క్స్ అందించనున్నాయి. అయితే ఆ మెసేజ్‌లు పోలీసుల నుంచే వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవస్థను పర్యవేక్షించడానికి ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
సిద్ధమవుతున్నాం
ఐఎఫ్‌ఆర్ నిర్వహణ మా ముందున్న పెద్ద బాధ్యత. దానిని విజయవంతం చేయడానికి మూడు నెలల నుంచే కసరత్తు ప్రారంభించాం. 16వేల నుంచి 17 వేల మంది పోలీసు బలగాలు అవసరమవుతారని నిర్ధారణకు వచ్చాం. మావోయిస్టులు, టైస్టుల కార్యకలాపాలను అడ్డుకునే కౌంటర్ పార్టీలు అవసరమవుతాయి. బలగాలను ఇతర జిల్లాల నుంచి ఇప్పించాల్సిందిగా డీజీపీని కోరనున్నాం. వచ్చిన వారికి వసతి కల్పించడం కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేశాం. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ నిర్వాహకులతో చర్చించాం. భద్రత ఏర్పాట్లపై జాగ్రత్త అవసరమని సూచించాం.
- అమిత్‌గార్గ్, పోలీస్ కమిషనర్,
విశాఖ సిటీ