రేపు కట్టుదిట్టమైన భద్రత | Tomorrow tight security | Sakshi
Sakshi News home page

రేపు కట్టుదిట్టమైన భద్రత

Published Sat, Jun 7 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

Tomorrow tight security

  • చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో...
  •  హనుమాన్‌జంక్షన్ నుంచి వాహనాల మళ్లింపు
  •  ఎస్పీ జె.ప్రభాకరరావు
  •  నూజివీడు, న్యూస్‌లైన్ :  కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం సందర్భంగా చెన్నై-కోల్‌కత్తా జాతీయరహదారిపై హనుమాన్‌జంక్షన్ వద్ద నుంచి విజయవాడ వైపునకు ఎలాంటి వాహనాలను అనుమతించబోమని   జిల్లా ఎస్పీ జే ప్రభాకరరావు అన్నారు. పట్టణంలోని  ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నూజివీడు సబ్‌డివిజన్లోని డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలతో శుక్రవారం  ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాణ స్వీకారానికి వెళ్లేవాహనాలను, బస్సులను, గన్నవరం విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను, అత్యవసర చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. వీవీఐపీల రాకపోకలుంటాయి కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసేందుకే ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టామన్నారు.

    ఇప్పటికే కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ , నాలుగైదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారన్న సమాచారమున్న  నేపథ్యంలో హనుమాన్‌జంక్షన్ నుంచి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే ప్రాంతం వరకు అడుగడుగునా పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. మధ్యాహ్నం 12గంటల తరువాత వాహనాలను విజయవాడ వైపు వెళ్లకుండా పూర్తిగా నిలిపేస్తామన్నారు. హైవే మొబైల్స్ పార్టీలు, రూట్ మొబైల్స్ పార్టీలు పర్యవేక్షిస్తాయని, క్రేన్‌లు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచామన్నారు.
     
    శ్రీకాకుళం జిల్లా నుంచే  ట్రాఫిక్ నియంత్రణ...
     
    చంద్రబాబు ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఆదివారం   శ్రీకాకుళం జిల్లా నుంచే ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నామని ఎస్పీ చెప్పారు. రాజమండ్రి వైపు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలన్నింటినీ కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి, ఖమ్మం  మీదుగా హైదరాబాద్‌కు మళ్లిస్తున్నామన్నారు.

    అలాగే రావులపాలెం హైవే మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలను తాడేపల్లిగూడెం, నల్లజర్ల, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, అశ్వరావుపేట, సత్తుపల్లి, ఖమ్మం  మీదుగా మళ్లిస్తున్నామన్నాని తెలిపారు. ఏలూరుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను హనుమాన్‌జంక్షన్, నూజివీడు, మైలవరం, జీ కొండూరు, ఇబ్రహీంపట్నం  మీదుగా మళ్లిస్తున్నామని చెప్పారు. అలాగే హైదరాబాద్ నుంచి రాజమండ్రి, ఏలూరు, విశాఖపట్నం వెల్లే వాహనాలను కూడా సూర్యాపేట వద్ద మళ్లించి ఖమ్మం, సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం  మీదుగా మళ్లిస్తున్నామన్నారు.

    కొన్ని వాహనాలను ఇబ్రహీంపట్నం వద్ద నుంచి జీ కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్‌జంక్షన్‌ల మీదుగా రాజమండ్రి, విశాఖపట్నంకు మళ్లిస్తున్నామని తెలిపారు. అలాగే కోల్‌కత్తా  నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్‌జంక్షన్ నుంచి గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, రేపల్లే,  బాపట్ల , చీరాల, ఒంగోలుల మీదుగా మళ్లిస్తున్నామని చెప్పారు. అయితే భారీ వాహనాలను ఎక్కడికక్కడే ఆ ఒక్కరోజు నిలిపివేస్తామన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యాపారులు, వ్యక్తులు ఆ రోజున ఎలాంటి లోడింగ్‌ను చేపట్టకుండా ఒక రోజు పాటు వాయిదా వేసుకోవాలని ఎస్పీ ప్రభాకర్‌రావు కోరారు.
     
    నూజివీడు పట్టణంపై ట్రాఫిక్ తాకిడి...
     
    నూజివీడు పట్టణంపై ట్రాఫిక్ తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ కే సూర్యచంద్రరావును ఆదేశించారు. జీ  కొండూరు నుంచి హనుమాన్‌జంక్షన్ వరకు ఇరుకు రోడ్లు  ఉంటే అక్కడ భారీ వాహనాల వల్ల  ట్రాఫిక్‌జాం ఏర్పడకుండా పోలీసు సిబ్బందిని నియమించి వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.   సమావేశంలో నూజివీడు, హనుమాన్‌జంక్షన్, తిరువూరు, మైలవరం సీఐలు కేవీ సత్యన్నారాయణ, వైవీ రమణ, ఎం.శ్యామ్‌కుమార్, టీ రామమోహన్‌రెడ్డి, నూజివీడు పోలీసు సబ్‌డివిజన్‌లోని  ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement