సిరిసిల్లకు ఆధునిక హంగులు | modern arrangements to sircilla | Sakshi
Sakshi News home page

సిరిసిల్లకు ఆధునిక హంగులు

Published Sun, Jul 20 2014 2:03 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

సిరిసిల్లకు ఆధునిక హంగులు - Sakshi

సిరిసిల్లకు ఆధునిక హంగులు

- వైఫై కనెక్టివిటీ.. సీసీ కెమెరాలు   
- ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నలింగ్ ఏర్పాటు
- ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక టీంలు  
- తొలిసారిగా సిరిసిల్లలో పెలైట్ ప్రాజెక్ట్

సిరిసిల్ల పట్టణానికి ఆధునిక హంగులు దరిచేరుతున్నాయి. లక్ష జనాభాతో విస్తరించిన కార్మిక క్షేత్రంలో టెక్నాలజీ సేవలు విస్తరిస్తున్నాయి. పోలీసు శాఖ సిరిసిల్ల పట్టణాన్ని వైఫై(వైర్‌లెస్ ఫెడిలిటీ) సేవలతోపాటు ట్రాఫిక్ నియంత్రణకు సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఇంజినీరింగ్ విద్యార్థులతో సర్వేలు పూర్తిచేసింది. సిరిసిల్లను పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలతో నిఘా నేత్రంలోకి తీసుకొచ్చేందుకు పెలైట్ ప్రాజెక్ట్‌గా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
 - సిరిసిల్ల
 
సీసీ కెమెరాలతో శ్రీకారం..
సిరిసిల్ల ప్రధాన కూడళ్లలో తొలిదశలో సీసీ కెమెరాలు అమర్చి నిరంతరం నిఘా పెట్టేందుకు ఏర్పాటుచేస్తున్నారు. ప్రధాన రోడ్ల వెంట ట్రాఫిక్ నియంత్రించేందుకు బ్లూకోల్డ్ విధానం ఇప్పటికే అమలు చేస్తుండగా, పూర్తిస్థాయిలో విజిబుల్ పోలీసు వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నారు. దీంతో నేరాలు, దొంగతనాలు జరగకుండా కట్టడి చేయనున్నారు. రోడ్ల వెంట నిర్ధిష్ట పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటుచేస్తున్నారు. రోడ్లపై మార్కింగ్ ఏర్పాటుచేసి ఆ ప్రాంతంలోని వాహనాలను పార్కింగ్ చేసేలా సూచనలిస్తున్నారు. సిరిసిల్ల గాంధీచౌక్, అంబేద్కర్‌చౌరస్తా, పాతబస్టాండ్, కొత్తబస్టాండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నారు. ఆటో అడ్డాలు, ఫోర్‌వీల్ వాహనాల పార్కింగ్ స్థలాలను కేటాయించనున్నారు.

ఇందుకోసం సిరిసిల్ల టౌన్ సీఐ విజయ్‌కుమార్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. సిరిసిల్ల శివారుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి వాహన తనిఖీలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలోకి భారీ వాహనాలు రాకుండా బారికేడ్లను నిర్మించనున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు భారీ వాహనాలు రోడ్లపై నిలపకుండా నిలువరించేందుకు నిర్ధిష్ట వేళలను నియమించనున్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న సిమెంట్ గోదాంలను పట్టణ శివారుల్లోకి తరలించనున్నారు.
 
కూరగాయల మార్కెట్ విస్తరణ

సిరిసిల్లలో ఒకేచోట కూరగాయల మార్కెట్, చేపలు, మటన్ మార్కెట్ ఉండడంతో రద్దీగా ఉంటోంది. పట్టణ నడిబొడ్డున పండుగ వేళల్లో ట్రాఫిక్ సమస్య ఇబ్బందిగా ఉంది. దీన్ని అధిగమించేందుకు మున్సిపల్ అధికారుల సహకారంతో కొత్తబస్టాండ్, శివనగర్, శాంతినగర్, వెంకంపేట ప్రాంతాల్లో మినీమార్కెట్లను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నారు. ఈ విధానంతో ఒకే ప్రాంతంలో రద్దీ తగ్గడంతో పాటు కూరగాయల వ్యాపారులు సైతం రోడ్డుపైకి రాకుండా ఉంటుంది. అనువైన స్థలాలను మున్సిపల్ అధికారులతో చర్చించి మినీ మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నారు.
 
హైటెక్ హంగులు
సిరిసిల్లలో వైఫై సేవలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించడంతో పట్టణాన్ని ఆధునీకరించడంలో భాగంగా వైఫై సేవలు ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైఫై ద్వారా ఇంటర్‌నెట్ సౌకర్యం అందరికీ అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్ తరహాలో ముఖ్య కూడళ్లలో వైఫై కనెక్టివిటీ ఉంటుంది. ఇప్పటికే పోలీసుశాఖ ఇందుకోసం కసరత్తులు చేస్తుండగా.. సిరిసిల్ల పట్టణానికి ఆధునిక హంగులు దరి చేరనున్నాయి. సిరిసిల్లలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోనే సిరిసిల్లను పెలైట్ ప్రాజెక్ట్‌గా ఆధునీకరించేందుకు తొలిదశలో ఎంపిక చేసినట్లు సమాచారం.
 
రూ.15కోట్లతో ఫోర్‌లేన్..
నాలుగులైన్ల రహదారిగా వేములవాడ- సిరిసిల్ల రహదారిని విస్తరించేందుకు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శని వారం పనులు ప్రారంభించారు. మొత్తం 7 కిలోమీటర్ల ఈ రహ దారి రూ.15 కోట్లతో రూపుదిద్దుకోనుంది. రహదారి పొడవునా సెంట్రల్ లైటింగ్ సిస్టంతో అధునీకరించనున్నారు.   దీంతో రోడ్డు శోభాయామనంగా మారనుంది. సిరిసిల్ల చుట్టూ ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
 
పలు అంశాలను ప్రతిపాదించాం
 సిరిసిల్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు వంటివి ప్రతిపాదించాం. పట్టణంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు పలు అంశాలను పరిశీలిస్తున్నాం. ఇంజినీరింగ్ విద్యార్థులతో సర్వేలు చేశాం. సిరిసిల్లలో పూర్తిస్థాయిలో రక్షణ కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్ తరహాలో ఆధునీకరించేందుకు ప్రతిపాదించాం.
 - దామెర నర్సయ్య, డీఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement