వెనక కూర్చున్నా హెల్మెట్ ఉండాల్సిందే | Helmet Mandatory | Sakshi
Sakshi News home page

వెనక కూర్చున్నా హెల్మెట్ ఉండాల్సిందే

Published Tue, Jan 5 2016 3:20 AM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM

వెనక కూర్చున్నా హెల్మెట్ ఉండాల్సిందే

వెనక కూర్చున్నా హెల్మెట్ ఉండాల్సిందే

♦ హైదరాబాద్‌లో త్వరలో అమలు
♦ ఢిల్లీ, కేరళ, కర్ణాటకలను అనుసరిస్తున్న అధికారులు
♦ పాటించని వాహనాల తాత్కాలిక జప్తు యోచన
 
 సాక్షి, హైదరాబాద్: ద్విచక్రవాహన చోదకులతోపాటు వెనక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. లేదంటే ఫైన్ కట్టాల్సిందే. మొండికేస్తే వాహనం తాత్కాలిక జప్తుకు గురవుతుంది. ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీ సహా కర్ణాటకలోని ప్రధాన నగరాలు, కేరళలో అమలు చేస్తున్న ఈ విధానాన్ని హైదరాబాద్‌లో పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ద్విచక్రవాహనం నడిపే వారితోపాటు వెనక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించాల్సిందేనని రవాణాశాఖ చట్టం చెబుతోంది. కానీ అది అమలు కావటంలేదు.

ప్రమాదాలు పెరిగిపోతుండడంతో ఇటీవల హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో హైదరాబాద్‌లో హెల్మెట్ ధరించే విషయంలో పోలీసు, రవాణాశాఖలు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సిబ్బంది ఎక్కడికక్కడ వాహనదారులను నిలిపి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చట్టంలో ఉన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయనున్నామని, వెంటనే ఇద్దరూ కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేనని పోలీసులు పేర్కొంటున్నారు. హెల్మెట్ లేకుండా పట్టుబడితే రూ.200 ఫైన్ కట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.  

 వినకుంటే తాత్కాలిక జప్తు
 హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు రూ.200  జరిమానా విధించే వెసులుబాటు తెలంగాణ రవాణా శాఖ చట్టం 129/177 సెక్షన్‌లో ఉంది. దాదాపు పదేళ్ల క్రితం నగరంలో హెల్మెట్ ధారణ తప్పనిసరి చేస్తూ ముమ్మరంగా పోలీసులు డ్రైవ్ నిర్వహించారు. అప్పట్లో మూడొంతుల మంది హెల్మెట్ ధరించటం ప్రారంభించినా పోలీసుల తీరుపై వ్యతిరేకత రావటంతో అది మెల్లిగా నీరుగారింది. ఇప్పుడు మళ్లీ చర్యలు ప్రారంభించారు. నిబంధనలను ఉల్లంఘించేవారి వాహనాలను తాత్కాలికంగా జప్తు చేసే అంశాన్ని రవాణాశాఖ పరిశీలిస్తోంది. హెల్మెట్ ధరించనివారిని నిలిపి గంట, రెండు గంటలపాటు వారి వాహనాన్ని జప్తు చేయాలని భావిస్తోంది. అయితే దానివల్ల ట్రాఫిక్ చిక్కులు తలెత్తుతాయా, అదనపు సిబ్బంది అవసరమైతే ఏం చేయాలనే అంశాలపై రవాణాశాఖ, పోలీసు శాఖ అధికారులు త్వరలో భేటీ అయి నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement