Helmet Mandatory
-
హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా: మీ పిల్లలకు ఇతన్ని చూపండి
కుర్రాళ్లు వినరు. బైక్ ఎక్కి తుర్రుమంటారు. భర్తలకు నిర్లక్ష్యం. హెల్మెట్ లేకుండానే బయలుదేరుతారు. ఇంటి మగవారి అసురక్షిత ప్రయాణం స్త్రీలకు ఎప్పుడూ ఆందోళనకరమే. ప్రతి ఇంట్లోని స్త్రీలు ఆ ఇంటి మగవారికి రాఘవేంద్ర కుమార్‌ను చూపాలి. స్నేహితుణ్ణి ప్రమాదంలో కోల్పోయిన అతను సొంత డబ్బుతో ఇప్పటికి 56,000 హెల్మెట్లు పంచాడు. పురుషులైనా స్త్రీలైనా హెల్మెట్ లేకుండా బండెక్కారంటే ఇంటి మీదకు ముప్పు తెచ్చినట్టే అంటాడు రాఘవేంద్ర. అతను చెప్పేది వినండి. ‘ఒంటి మీద ఎక్కడా దెబ్బ లేదు. తల ఒక్క దానికే తగిలింది’ అని అయినవారిని కోల్పోయి ఏడ్చేవారు ఎందరో ఉన్నారు. ఆ తలకు దెబ్బ తగలని రీతిలో జాగ్రత్త తీసుకుని ఉంటే వారంతా బతికేవారు. హెల్మెట్ వాడితే బతికేవారు. చట్టాలు ఎన్ని చెప్పినా, నిబంధనలు విధించినా జీవితాన్ని సీరియస్‌గా తీసుకోని వారు ఎప్పుడూ ఉంటారు. వారు ఎక్కడో వేరే కుటుంబాలలో ఉంటారనుకోవద్దు. మన కుటుంబాల్లో కూడా ఉంటారు. కాలేజీకి వచ్చిన కొడుకు, ఉద్యోగానికి వెళ్లే భర్త, ట్రయినింగ్లో ఉన్న కూతురు.. వీరు కూడా ‘ఆ.. ఏముందిలే’ అనుకుని హెల్మెట్ వాడకుండా ఉండొచ్చు. అలాంటి వారు తన కంట పడితే ఊరుకోడు రాఘవేంద్ర కుమార్ (36). ఇతణ్ణి అందరూ ఇప్పుడు ‘హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అంటారు. నోయిడాలో నివాసం ఉండే ఇతను ఉద్యోగం వదిలేశాడు. ఇతర పనులు మానేశాడు. కేవలం హెల్మెట్‌కు సంబంధించిన చైతన్యం కోసం పని చేస్తున్నాడు. అతడు రోజూ చేసే పని కారు వేసుకుని, అందులో కొన్ని హెల్మెట్లు పడేసుకుని నోయిడా ఆగ్రాల మధ్య ఉండే ఆరు లేన్ల యమునా ఎక్స్‌ప్రెస్‌కు చేరుకుంటాడు. ఆ దారి మీద బైక్ వేసుకుని హెల్మెట్ లేకుండా ఎవరైనా వెళుతుంటే వారిని వెంబడించి ఆపుతాడు. హెల్మెట్ వాడకపోతే ఉండే ప్రమాదం గురించి చెప్పి ఉచితంగా హెల్మెట్ ఇచ్చి పంపుతాడు. ‘2014 నుంచి నుంచి నేను హెల్మెట్లు పంచుతున్నాను. ఇప్పటికి 56 వేల హెల్మెట్లు పంచాను. నేను పంచిన రోజునో ఆ తర్వాత ఐదారు రోజుల్లోనో ప్రమాదానికి గురై నేనిచ్చిన హెల్మెట్ వల్లప్రాణాలు కాపాడుకున్న వారు 30 మంది ఉన్నారు. వారంతా ఎంతో సంతోషంతో కృతజ్ఞతతో నాకు ఫోన్ చేసి తాముప్రాణాలతో ఉండటానికి కారణం నేనేనని చెబుతారు. చాలామందికి భారీ యాక్సిడెంట్లు అయ్యి కాళ్లు చేతులు విరిగినా తల మాత్రం ఏమీ కాకపోవడంతో బతికిపోయారు’ అంటాడు రాఘవేంద్ర కుమార్. అయితే అతనికి కూడా హెల్మెట్ విలువప్రాణ స్నేహితుడు మరణించాకే తెలిసింది. బిహార్‌కు చెందిన రాఘవేంద్ర కుమార్ 2009లో నోయిడా వచ్చి లా కోర్సులో చేరాడు. అదే బిహార్ నుంచి ఇంజినీరీంగ్ చేయడానికి వచ్చి కృష్ణకుమార్ అతని రూమ్మేట్ అయ్యారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు అయ్యారు. కాని 2014లో కొత్తగా వేసిన యమున ఎక్స్‌ప్రెస్ వే మీద హెల్మెట్ లేకుండా వెళుతూ కృష్ణకుమార్ యాక్సిడెంట్‌కు లోనయ్యాడు. ఒంటి మీద ఒక్క దెబ్బ లేదు. తలకే తగిలింది. మరణించాడు. ‘ వాళ్లింట్లో వాళ్లకి నా స్నేహితుడు ఒక్కగానొక్క కొడుకు కావడంతో వాడి అమ్మా నాన్నల గుండెలు పగిలిపోయాయి. హెల్మెట్ ఉంటే బతికేవాడు కదా అన్న బాధ ఇప్పటికీ వదల్లేదు నన్ను’ అంటాడు రాఘవేంద్ర. అప్పటి నుంచి అతడు ఒక ఉద్యమంగా హెల్మెట్లు పంచుతున్నాడు. భార్య కొత్తల్లో సహకరించింది. కాని రాఘవేంద్ర కుమార్ దాదాపు తన ఆస్తులన్నీ అమ్మి ఇప్పటికి రెండు కోట్ల వరకు ఖర్చు చేసి హెల్మెట్లు పంచాడు. ‘ఉన్నదంతా ఊడ్చేశాను. పర్వాలేదు. బిహార్‌లోని నా సొంత పల్లెకు వెళ్లిపోతాను’ అని ఇటీవల అతను ప్రకటించాడు. కాని అది పైమాటే. తనకు సరైన ప్రోత్సాహం లభిస్తే దేశంలో హెల్మెట్ల బ్యాంకులు తెరవాలని ఎవరైనా సరే అరువు తీసుకుని వెళ్లి వాడుకునేలా హెల్మెట్లు అందుబాటులో ఉంచాలని అతని కోరిక. ‘4 ఏళ్లు పైబడిన పిల్లలకు హెల్మెట్లు తప్పనిసరి చేయాలని నేను సుప్రీం కోర్టులో పిల్ వేశాను. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిశాను’ అంటాడు రాఘవేంద్ర. ‘ప్రాణం పోతే ఏం చేసినా తిరిగి రాదు’ అంటాడు. హెల్మెట్‌ను వాడటానికి ఇష్టపడని ప్రతి ఒక్కరికి రాఘవేంద్ర చెబుతున్న విషయం అర్థం కావాలి. ప్రాణం ఉంటే లోకం ఉంటుంది. -
ద్విచక్ర వాహన దారులకు అలర్ట్.. కేంద్రం మరో కొత్త రూల్!
ద్విచక్ర వాహనదారులకు ముఖ్య గమనిక. కేంద్రం మరో కొత్త రూల్ అమలులోకి తీసుకొని వచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం.. ఇక నుంచి బండి మీద 9 నెలల నుంచి 4 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలను తీసుకెళ్తున్నప్పుడు వారు కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. తాజాగా కేంద్ర రోడ్డు, రవాణా శాఖ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం 9 నెలల నుంచి 4 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు కూడా ద్విచక్ర వాహనంపై ప్రయాణించే సమయంలో వారికి సరిపడే హెల్మెట్‌ను ధరించాలి. లేకపోతే రూ.1,000 జరిమానా లేదా డ్రైవర్ లైసెన్స్'ను మూడు నెలల వరకు సస్పెన్షన్ చేయనున్నారు. సెంట్రల్ మోటార్ వేహికల్స్ రూల్స్, 1989కు సవరణ చేసి ఈ కొత్త నిబంధనలను కేంద్రం తీసుకొచ్చింది. నాలుగు సంవత్సరాల వయస్సు వరకు పిల్లలను ద్విచక్ర వాహనం మీద తీసుకొని వెళ్తున్నప్పుడు వాహనం గంటకు గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది అని కూడా పేర్కొంది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నప్పుడు పిల్లల భద్రత దృష్ట్యా హార్నెస్, హెల్మెట్ ఉపయోగించడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు ప్రతిపాదించింది. ఈ విషయంపై పౌరుల అభిప్రాయాన్ని అడగడానికి అక్టోబర్ 2021లో ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. .@MORTHIndia issues notification for safety measures for children below four years of age, riding or being carried on a motorcycle It specifies use of a safety harness and crash helmet and also restricts speed of such motorcycles to 40 kmphhttps://t.co/rAMr9lMCuc pic.twitter.com/4rnwcAxMVL — PIB India (@PIB_India) February 16, 2022 ద్విచక్ర వాహనంపై పిల్లలను తీసుకెళ్లే తల్లిదండ్రులు వారి భద్రత కోసం ఈ మార్గదర్శకాలను తప్పక పాటించాలని మంత్రిత్వశాఖ పేర్కొంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై పిల్లల్ని తీసుకువెళ్లాలంటే వారికి సేఫ్టీ బెల్ట్ తప్పనిసరిగా ఉండాలి. అది కూడా చాలా తక్కువ బరువుతో వాటర్ ప్రూఫ్ అయి ఉండాలి. 30 కేజీల బరువును మోసే సామర్థ్యం దీనికి ఉండాలి. ఈ నియమాన్ని అతిక్రమిస్తే చలానా వేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అలానే పిల్లల హెల్మెట్ల విషయానికి వస్తే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్(బీఐఎస్) త్వరలోనే ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అప్పటివరకు సైకిల్ హెల్మెట్లను వినియోగించాలని ప్రభుత్వం తెలిపింది. (చదవండి: వారెవ్వా! అదిరిపోయిన ఎలన్ మస్క్ మార్స్ విజన్ వీడియో..!) -
ఎవరికి హెల్మెట్ లేకున్నా.. లైసెన్సు రద్దు
సాక్షి, హైదరాబాద్: మీరు హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తున్నారా.. మీ వెనకాల కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ లేదా.. ఇలా తొలిసారిగా ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే మూడు నెలల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. ఇక రెండోసారి దొరికితే మీకు హెల్మెట్ ఉన్నా, లేకున్నా.. పిలియన్ రైడర్ ధరించకపోతే మాత్రం శాశ్వతంగా మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అంశాన్ని అమలు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు రవాణా శాఖ అధికారులకు లేఖలు రాసేందుకు సమాయత్తం అవుతున్నారు. దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చే ముందు మోటార్ వెహికల్ సవరణల చట్టం–2019, సెక్షన్ 206 (4) ద్వారా హెల్మెట్ లేని వాహనదారులపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారో అవగాహన కలిగించేలా వీడియో చిత్రాలు చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. అలాగే వాహనాలు ఎక్కువగా ఆగే ట్రాఫిక్ జంక్షన్లలో మైక్ ద్వారా ప్రచారం నిర్వహించి జాగృతం చేస్తున్నారు. భారీగా ఈ–చలాన్లు.. గతేడాది హెల్మెట్ లేని 18,50,000 మంది (వాహనదారులు, పిలియన్ రైడర్లు)కి ఈ–చలాన్లు జారీ చేశారు. గతేడాది జరిగిన 625 రోడ్డు ప్రమాదాల్లో 663 మంది మృతి చెందారు. అత్యధిక శాతం హెల్మెట్ ధరించకపోవడంతోనే మరణించారని ట్రాఫిక్ గణాంకాలు చెబుతున్నాయి. మృతుల్లో చాలామంది పిలియన్ రైడర్లే ఉండటంతో హెల్మెట్ ధరించే అంశాన్ని కఠినంగా అమలు చేయాలని సైబరాబాద్ పోలీసు అధికారులు నిర్ణయించారు. సీపీ సజ్జనార్ మార్గదర్శనంలో ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ ఇప్పటికే పిలియన్ రైడర్లకు హెల్మెట్ లేకున్నా ఈ–చలాన్లు విధిస్తున్నారు. ఆ తర్వాత కూడా హెల్మెట్ లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అంశంపై తొలుత అవగాహన కలిగించి.. అమలు చేసే యోచనలో ఉన్నారు. మరికొన్ని రోజుల పాటు విస్తృత స్థాయిలో అవగాహన కలిగించిన తర్వాతే లైసెన్స్ రద్దుపై రవాణా శాఖకు లేఖలు రాస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: (కొత్త సచివాలయం ముందు 2 భారీ ఫౌంటెయిన్లు) (10,673 టీచర్ పోస్టులు ఖాళీ) -
జూన్ 1నుంచి బీఐఎస్ హెల్మెట్స్ తప్పనిసరి
న్యూఢిల్లీ, సాక్షి: వచ్చే ఏడాది(2021) జూన్ 1నుంచి దేశంలో బీఐఎస్ ప్రమాణాలు లేని హెల్మెట్ల తయారీ, విక్రయాలను నిషేధిస్తూ కేంద్ర రోడ్ రవాణా శాఖ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. ద్విచక్ర వాహనదారులను కొంతమేర ప్రమాదాల నుంచి రక్షించే యోచనలో భాగంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్నేళ్లుగా ఇందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చినట్లు పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. దేశంలో వార్షికంగా 1.7 కోట్ల ద్విచక్ర వాహనాలు తయారవుతున్నట్లు ఆటో రంగ విశ్లేషకులు ఈ సందర్భంగా తెలియజేశారు. కాగా.. దేశీ పరిస్థితులకు అనుగుణంగా బీఐఎస్ ప్రమాణాలతో తేలికపాటి హెల్మెట్ల తయారీ, వినియోగానికి అనుమతించినట్లు నిపుణులు పేర్కొన్నారు. తలకు తగిలే గాయాలు రోడ్డు ప్రమాదాలలో 45 శాతం తలకు గాయాలవుతుంటాయని ఎయిమ్స్ ట్రౌమా సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ అమిత్ గుప్తా పేర్కొంటున్నారు. వీటిలో 30 శాతం తీవ్రంగా గాయపడిన సందర్భాలుంటాయని తెలియజేశారు. దేశీయంగా హెల్మెట్లకు బీఐఎస్ సర్టిఫెకెట్(ఐఎస్ఐ మార్క్)ను తప్పనిసరి చేయాలని కొంతకాలంగా రోడ్ రవాణా శాఖ ప్రయత్నిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సుమారు 44,000-56,000 మంది హెల్మెట్లను ధరించకపోవడంతో మరణించినట్లు అనధికార లెక్కలున్నట్లు ఈ సందర్భంగా నిపుణులు ప్రస్తావిస్తున్నారు. దేశీయంగా రోజూ 2 లక్షల హెల్మెట్లు విక్రయమవుతాయని ద్విచక్ర వాహన హెల్మెట్ల తయారీదారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజీవ్ కపూర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే వీటిలో అత్యధికం ప్రమాణాలులేనివే ఉంటాయని తెలియజేశారు. ప్రభుత్వం తీసుకురానున్న నిబంధనలతో వేలమంది ప్రాణాలకు రక్షణ లభించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. -
హెల్మెట్ వాడకం తప్పనిసరి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ వాడకం తప్పనిసరని జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి అన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జిల్లాలోని అన్ని రహదారుల్లో దీని వాడకాన్ని కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాస్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే జాతీయ రహదారిపై హెల్మెట్ వాడకం నిబంధన అమలు జరుగుతోందన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఈ నెల 15వ తేదీ నుంచి కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ పదో తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కొంత వెసులుబాటు ఇచ్చామన్నారు. పరీక్షలు పూర్తయిన అనంతరం నిబంధన కఠినంగా అమలు చేసేందుకు సమావేశం నిర్ణయించింది. హెల్మెట్ వినియోగం విషయంలో సుప్రీంకోర్టు సైతం మార్గదర్శకాలు జారీ చేసిందని కలెక్టర్ చెప్పారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం స్పష్టమైన నిర్దేశాలు జారీ చేసిందన్నారు. ప్రతి ప్రాణం విలువైనదేనని... స్వయం రక్షణ కోసం హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. రూ. 14 లక్షలు మంజూరు ప్రమాదాల నివారణలో భాగంగా రహదారులపై స్టాపర్ బోర్డులు ఏర్పాటుకు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 14 లక్షలు మంజూరు చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు. తక్షణమే స్టాపర్ బోర్డులు ఏర్పాటు చేయాలని రవాణా, పోలీసు శాఖలకు సూచించారు. రహదారులు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖలకు స్పీడ్ బ్రేకర్లు, జీబ్రా క్రాసింగ్స్ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ రద్దీ నివారణకు, వాహనాలు ఆగిపోయినపుడు వాటిని పక్కకు తీసేందుకు, రాంగ్ పార్కింగు వంటి సమయాల్లో త్రోయింగ్ వెహికల్ అవసరమని, దానిని సమకూర్చడం జరుగుతోందన్నారు. ఇప్పటికే నగరపాలకసంస్థ టెండర్లను పిలిచామని సహాయ సిటీ ప్లానర్ వివరించారు. జాతీయ రహదారి పొడవునా రహదారి భద్రతా అంశాలను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జంక్షన్ల వద్ద రంబ్లిక్ స్టిక్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రామాకేర్ కేంద్రం ఏర్పాటుకు రూ. 8 లక్షలు పలాస 50 పడకల ఆస్పత్రిలో ట్రామాకేర్ కేంద్రం ఏర్పాటుకు రూ. 8 లక్షలు కేటాయించినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత సౌకర్యాలు త్వరితగతిన ఏర్పాటు చేయాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి బి.సూర్యారావును ఆదేశించారు. గోల్డెన్ అవర్ సమయంలో ట్రామాకేర్ సేవలు ఎంతో అవసరమన్నారు. ట్రామాకేర్‌కు అవసరమయ్యే ఇతర సదుపాయాలను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధుల నుంచి సమకూర్చాలని ఆదేశించారు. భద్రతపై విస్తృత ప్రచారం: ఎస్పీ జిల్లా ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ మాట్లాడుతూ రహదారి భద్రతపై పోలీసుశాఖ ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టడం జరుగుతోందన్నారు. అవగాహన చర్యలతో ఫిబ్రవరి నెలలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో కేవలం మూడు మరణాలు మాత్రమే సంభవించాయన్నారు. జాతీయ రహదారిపై హెల్మెట్ నిబంధన కచ్చితంగా అమలు చేస్తుండడంతో ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో రాత్రిపూట అవగాహన చర్యలు చేపట్టడమే కాకుండా స్టాప్ అండ్ వాష్ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. 23 నుంచి రహదారి భద్రతా వారోత్సవాలు రవాణాశాఖ ఉప కమిషనర్ సీహెచ్ శ్రీదేవి మాట్లాడుతూ రహదారి భద్రతా చర్యలకు రూ. 50.69 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామన్నారు. ఈ మొత్తంలో రూ. 22.54 లక్షలు విడుదల చేసిందని, మిగిలిన మొత్తంలో రాష్ట్రస్థాయిలో రహదారి భద్రతా పరికరాలు కొనుగోలు చేసి సరఫరా చేస్తారన్నారు. రహదారి భద్రతా వారోత్సవాలను ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రహదారి భద్రతా చర్యలకు కేఆర్ స్టేడియం వద్ద ఉన్న సంస్కార్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం రూ. 2 లక్షలను విరాళంగా అందించిందన్నారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వై.వెంకటేశ్వరరావు, డీఎస్పీలు ఎం. కృష్ణమూర్తినాయుడు, పి. మారావు, జి.స్వరూపారాణి, కె.రాఘవ, రవాణాశాఖ అధికారులు జె.రామ్‌కుమార్, పీవీ రావు పాల్గొన్నారు. -
ఇక తప్పనిసరి
-
విజయవాడ, విశాఖలో హెల్మెట్ తప్పనిసరి
ఈ నెల 24వ తేదీ నుంచి పక్కాగా అమలు సాక్షి, అమరావతి: విజయవాడ, విశాఖపట్నంలో ఈ నెల 24వ తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే. లేకపోతే పోలీసులు భారీగా జరిమానా విధిస్తారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిస్తూ రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు దొరికితే లైసెన్స్ రద్దు చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం రవాణా, పోలీస్ శాఖలకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 8,542 మంది మృతి చెందగా, 30,245 మంది తీవ్రంగా గాయపడ్డారు. 41 శాతం రోడ్డు ప్రమాదాలు ద్విచక్ర వాహనాలు/ఆటోల వల్లే జరిగినట్లు రోడ్ సేఫ్టీ కమిటీ ఇటీవలే నిర్ధారించింది. 35 శాతం రోడ్డు ప్రమాదాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటలలోపు నమోదవుతున్నాయి. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనే అత్యధిక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 14 శాతం రోడ్డు ప్రమాద మరణాలు ఇక్కడే సంభవించినట్లు రవాణా శాఖ తేల్చింది. దీంతో ఈ రెండు నగరాల్లో హెల్మెట్ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని రోడ్ సేఫ్టీ కమిటీ ఇటీవల నిర్ణయించింది. -
రోడ్డు ప్రమాదాలతో కడుపుకోత మిగుల్చొద్దు
వాహనాలను జాగ్రత్తగా నడపాలి వరంగల్ సీపీ సుధీర్‌బాబు పోలీస్ కమిషనరేట్‌లో ‘మీ క్షేమం’ సదస్సు హెల్మెట్ల వినియోగంపై అవగాహన కన్నీటి పర్యంతమైన సీపీ, పలువురు తల్లిదండ్రులు వరంగల్: యువత రోడ్డు ప్రమాదాలకు గురై తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు కోరారు. పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో హెల్మెట్ల వినియోగం, ప్రాముఖ్యతపై వాహనాలు నడిపే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇటీవల రోడ్డు ప్రమాదాలకు గురై మృతిచెందిన కుటుంబసభ్యులకు గురువారం సీపీ కార్యాలయంలోని రాణిరుద్రమదేవి ప్రాంగణంలో ‘మీ క్షేమం’ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బంది రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఛాయా చిత్రాలతో ప్రదర్శన చేపట్టారు. అనంతరం సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ యువకులు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతుండడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి అందివచ్చిన కొడుకులు ప్రమాదాల్లో విగతజీవులుగా మారుతుండడం బాధాకరమన్నారు. కాగా, కొందరు తల్లిదండ్రులు ప్రమాదాల్లో తమ కుమారులు చనిపోయిన సంఘటనలను గుర్తుకు చేసుకుని కన్నీటి పర్యంతమవుతుండగా సీపీ సుధీర్‌బాబు కూడా బోరున విలపించారు. ఈ సందర్భంగా సదస్సును కొనసాగించాలని అధికారులకు సూచించి సీపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సదస్సులో అదనపు డీసీసీ యాదయ్య, ఏసీపీలు శోభన్‌కుమార్, సురేంద్రనాథ్, మహేందర్, ఈశ్వర్రావు, రవీందర్రావు, వెంకటేశ్వర్రావుతో పాటు కమిషనరేట్ పరిధిలోని సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, కాంగ్రెస్ నాయుడు ఈవీ.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల బాధ్యతను వివరించాం : సీపీ సుధీర్‌బాబు మీ క్షేమం సదస్సు ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు తల్లిదండ్రుల బాధ్యతను కూడా గుర్తు చేశామని సీసీ సుధీర్‌బాబు తెలిపారు. సదస్సు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం మన దేశంలో రోజుకు 384 మంది రోడ్డు ప్రమా దాల్లో మృతిచెందుతున్నారన్నారు. ఇందులో 25 శాతం మైనర్ బాలబాలికలు చనిపోతున్నారని, ఎక్కువ మరణాలు హెల్మెట్లు లేకుండా వాహనాలు నడిపినవే ఉంటున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించిప్పుడే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. హెల్మెట్ ధరించి ఉంటే బతికేవాడు పిల్లల ఆనందం కోసం లక్షలు ఖర్చు చేసి బైక్‌లను కొనుగోలు చేసి ఇస్తున్నాం. కానీ.. వారు హెల్మెట్లు పెట్టుకున్నారో లేదో అన్న విషయాలను గమనించకపోవడంతో కడుపుకోత మిగులుతోంది. నా కుమారుడు హెల్మెట్ ధరించి బైక్ నడిపి ఉంటే ఇప్పుడు జీవించి ఉండేవాడు. నాకు జరిగిన నష్టం ఇతర తల్లిదండ్రులకు జరగకూడదు. వరంగల్ పోలీసులు నిర్వహిస్తున్న మీక్షేమం కార్యక్రమం అభినందనీయం. నా కొడుకు విశాల్ జ్ఞాపకార్థం హెల్మెట్ల వాడకం కోసం చేసే ప్రచారానికి నావంతు సహాయ సహకారాలు అందిస్తాను. – నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నిర్లక్ష్యంతో మృతి ఇంజినీరింగ్‌లో జాయిన్ కావడంతో నా కొడుకు కోరిక మేరకు రూ.80 వేలతో బైక్ కొనివ్వడంతో పాటు రూ.16 వేలతో హెల్మెట్ కూడా కొనిచ్చాను. కొద్ది దూరం కదా అనే చిన్న నిర్లక్ష్యంతో హెల్మెట్ లేకుండా రోడ్డు పైకి వెళ్లి కేయూసీ రహదారిపై జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. అదే హెల్మెట్ ధరించి ఉంటే నేను ఇక్కడకు రావాల్సిన అవసరం లేకుండా పోయేది. – ఆకుల నాగరాజు, కాంట్రాక్టర్ భర్తను కోల్పోయాను నేను, నా భర్త కూలీ పనిచేసుకునే వాళ్లం. ఒక రోజున నా భర్త హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడిపాడు. రోడ్డు ప్రమాదంలో తలకు గాయమై మృతి చెందాడు. నా భర్త మరణంతో నేను, ఇద్దరు పిల్లల పరిస్థితి ఆగమైంది. – గుడికందుల లావణ్య, హసన్‌పర్తి తండ్రిని కోల్పోయాను హన్మకొండ అశోకాటాకీస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నేను తండ్రిని కోల్పోయాను. హెల్మెట్ ధరించకపోవడంతోనే మా నాన్న చనిపోయాడు. కుటుంబ పెద్ద చనిపోవడంతో పోషణ భారం, ఇంటి బాధ్యత నాపై పడింది. మా మంచి చెడులు చూసే తండ్రి లేకపోవడం బాధకరం. – అల్వాల సుమంత్‌కుమార్, హన్మకొండ హెల్మెట్ ఇచ్చి ఉంటే నా భర్త ఉండేవాడు ప్రతి రోజు నా భర్త బయటకు పోతుంటే మోటార్ సైకిల్ తాళం ఇచ్చేదాన్ని. అదే హెల్మెట్ ఇచ్చి ఉంటే నేడు ఆయనను కోల్పోయేదాన్ని కాదు. నా భర్త ఎరువుల కొనుగోలు కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. పోలీసులు హెల్మెట్ల వినియోగంపై చేస్తున్న ప్రచారం అభినందనీయం. కాగితాల రమ్య, స్టేషన్‌ఘన్‌పూర్ -
వెనక కూర్చున్నా హెల్మెట్ ఉండాల్సిందే
♦ హైదరాబాద్‌లో త్వరలో అమలు ♦ ఢిల్లీ, కేరళ, కర్ణాటకలను అనుసరిస్తున్న అధికారులు ♦ పాటించని వాహనాల తాత్కాలిక జప్తు యోచన సాక్షి, హైదరాబాద్: ద్విచక్రవాహన చోదకులతోపాటు వెనక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. లేదంటే ఫైన్ కట్టాల్సిందే. మొండికేస్తే వాహనం తాత్కాలిక జప్తుకు గురవుతుంది. ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీ సహా కర్ణాటకలోని ప్రధాన నగరాలు, కేరళలో అమలు చేస్తున్న ఈ విధానాన్ని హైదరాబాద్‌లో పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ద్విచక్రవాహనం నడిపే వారితోపాటు వెనక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించాల్సిందేనని రవాణాశాఖ చట్టం చెబుతోంది. కానీ అది అమలు కావటంలేదు. ప్రమాదాలు పెరిగిపోతుండడంతో ఇటీవల హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీంతో హైదరాబాద్‌లో హెల్మెట్ ధరించే విషయంలో పోలీసు, రవాణాశాఖలు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సిబ్బంది ఎక్కడికక్కడ వాహనదారులను నిలిపి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చట్టంలో ఉన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయనున్నామని, వెంటనే ఇద్దరూ కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేనని పోలీసులు పేర్కొంటున్నారు. హెల్మెట్ లేకుండా పట్టుబడితే రూ.200 ఫైన్ కట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వినకుంటే తాత్కాలిక జప్తు హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు రూ.200 జరిమానా విధించే వెసులుబాటు తెలంగాణ రవాణా శాఖ చట్టం 129/177 సెక్షన్లో ఉంది. దాదాపు పదేళ్ల క్రితం నగరంలో హెల్మెట్ ధారణ తప్పనిసరి చేస్తూ ముమ్మరంగా పోలీసులు డ్రైవ్ నిర్వహించారు. అప్పట్లో మూడొంతుల మంది హెల్మెట్ ధరించటం ప్రారంభించినా పోలీసుల తీరుపై వ్యతిరేకత రావటంతో అది మెల్లిగా నీరుగారింది. ఇప్పుడు మళ్లీ చర్యలు ప్రారంభించారు. నిబంధనలను ఉల్లంఘించేవారి వాహనాలను తాత్కాలికంగా జప్తు చేసే అంశాన్ని రవాణాశాఖ పరిశీలిస్తోంది. హెల్మెట్ ధరించనివారిని నిలిపి గంట, రెండు గంటలపాటు వారి వాహనాన్ని జప్తు చేయాలని భావిస్తోంది. అయితే దానివల్ల ట్రాఫిక్ చిక్కులు తలెత్తుతాయా, అదనపు సిబ్బంది అవసరమైతే ఏం చేయాలనే అంశాలపై రవాణాశాఖ, పోలీసు శాఖ అధికారులు త్వరలో భేటీ అయి నిర్ణయం తీసుకోనున్నారు.