విజయవాడ, విశాఖలో హెల్మెట్ తప్పనిసరి
ఈ నెల 24వ తేదీ నుంచి పక్కాగా అమలు
సాక్షి, అమరావతి: విజయవాడ, విశాఖపట్నంలో ఈ నెల 24వ తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందే. లేకపోతే పోలీసులు భారీగా జరిమానా విధిస్తారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిస్తూ రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు దొరికితే లైసెన్స్ రద్దు చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం రవాణా, పోలీస్ శాఖలకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 8,542 మంది మృతి చెందగా, 30,245 మంది తీవ్రంగా గాయపడ్డారు. 41 శాతం రోడ్డు ప్రమాదాలు ద్విచక్ర వాహనాలు/ఆటోల వల్లే జరిగినట్లు రోడ్ సేఫ్టీ కమిటీ ఇటీవలే నిర్ధారించింది. 35 శాతం రోడ్డు ప్రమాదాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటలలోపు నమోదవుతున్నాయి. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనే అత్యధిక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 14 శాతం రోడ్డు ప్రమాద మరణాలు ఇక్కడే సంభవించినట్లు రవాణా శాఖ తేల్చింది. దీంతో ఈ రెండు నగరాల్లో హెల్మెట్ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని రోడ్ సేఫ్టీ కమిటీ ఇటీవల నిర్ణయించింది.