కుర్రాళ్లు వినరు. బైక్ ఎక్కి తుర్రుమంటారు. భర్తలకు నిర్లక్ష్యం. హెల్మెట్ లేకుండానే బయలుదేరుతారు. ఇంటి మగవారి అసురక్షిత ప్రయాణం స్త్రీలకు ఎప్పుడూ ఆందోళనకరమే. ప్రతి ఇంట్లోని స్త్రీలు ఆ ఇంటి మగవారికి రాఘవేంద్ర కుమార్‌ను చూపాలి. స్నేహితుణ్ణి ప్రమాదంలో కోల్పోయిన అతను సొంత డబ్బుతో ఇప్పటికి 56,000 హెల్మెట్లు పంచాడు. పురుషులైనా స్త్రీలైనా హెల్మెట్ లేకుండా బండెక్కారంటే ఇంటి మీదకు ముప్పు తెచ్చినట్టే అంటాడు రాఘవేంద్ర. అతను చెప్పేది వినండి.
‘ఒంటి మీద ఎక్కడా దెబ్బ లేదు. తల ఒక్క దానికే తగిలింది’ అని అయినవారిని కోల్పోయి ఏడ్చేవారు ఎందరో ఉన్నారు. ఆ తలకు దెబ్బ తగలని రీతిలో జాగ్రత్త తీసుకుని ఉంటే వారంతా బతికేవారు. హెల్మెట్ వాడితే బతికేవారు.
చట్టాలు ఎన్ని చెప్పినా, నిబంధనలు విధించినా జీవితాన్ని సీరియస్‌గా తీసుకోని వారు ఎప్పుడూ ఉంటారు. వారు ఎక్కడో వేరే కుటుంబాలలో ఉంటారనుకోవద్దు. మన కుటుంబాల్లో కూడా ఉంటారు. కాలేజీకి వచ్చిన కొడుకు, ఉద్యోగానికి వెళ్లే భర్త, ట్రయినింగ్‌లో ఉన్న కూతురు.. వీరు కూడా ‘ఆ.. ఏముందిలే’ అనుకుని హెల్మెట్ వాడకుండా ఉండొచ్చు.
అలాంటి వారు తన కంట పడితే ఊరుకోడు రాఘవేంద్ర కుమార్ (36). ఇతణ్ణి అందరూ ఇప్పుడు ‘హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అంటారు. నోయిడాలో నివాసం ఉండే ఇతను ఉద్యోగం వదిలేశాడు. ఇతర పనులు మానేశాడు. కేవలం హెల్మెట్‌కు సంబంధించిన చైతన్యం కోసం పని చేస్తున్నాడు. అతడు రోజూ చేసే పని కారు వేసుకుని, అందులో కొన్ని హెల్మెట్లు పడేసుకుని నోయిడా ఆగ్రాల మధ్య ఉండే ఆరు లేన్ల యమునా ఎక్స్‌ప్రెస్‌కు చేరుకుంటాడు. ఆ దారి మీద బైక్ వేసుకుని హెల్మెట్ లేకుండా ఎవరైనా వెళుతుంటే వారిని వెంబడించి ఆపుతాడు. హెల్మెట్ వాడకపోతే ఉండే ప్రమాదం గురించి చెప్పి ఉచితంగా హెల్మెట్ ఇచ్చి పంపుతాడు.
‘2014 నుంచి నుంచి నేను హెల్మెట్‌లు పంచుతున్నాను. ఇప్పటికి 56 వేల హెల్మెట్లు పంచాను. నేను పంచిన రోజునో ఆ తర్వాత ఐదారు రోజుల్లోనో ప్రమాదానికి గురై నేనిచ్చిన హెల్మెట్ వల్లప్రాణాలు కాపాడుకున్న వారు 30 మంది ఉన్నారు. వారంతా ఎంతో సంతోషంతో కృతజ్ఞతతో నాకు ఫోన్ చేసి తాముప్రాణాలతో ఉండటానికి కారణం నేనేనని చెబుతారు. చాలామందికి భారీ యాక్సిడెంట్లు అయ్యి కాళ్లు చేతులు విరిగినా తల మాత్రం ఏమీ కాకపోవడంతో బతికిపోయారు’ అంటాడు రాఘవేంద్ర కుమార్.
అయితే అతనికి కూడా హెల్మెట్ విలువప్రాణ స్నేహితుడు మరణించాకే తెలిసింది. బిహార్‌కు చెందిన రాఘవేంద్ర కుమార్ 2009లో నోయిడా వచ్చి లా కోర్సులో చేరాడు. అదే బిహార్ నుంచి ఇంజినీరీంగ్ చేయడానికి వచ్చి కృష్ణకుమార్ అతని రూమ్మేట్ అయ్యారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు అయ్యారు. కాని 2014లో కొత్తగా వేసిన యమున ఎక్స్‌ప్రెస్ వే మీద హెల్మెట్ లేకుండా వెళుతూ కృష్ణకుమార్ యాక్సిడెంట్‌కు లోనయ్యాడు. ఒంటి మీద ఒక్క దెబ్బ లేదు. తలకే తగిలింది. మరణించాడు. ‘ వాళ్లింట్లో వాళ్లకి నా స్నేహితుడు ఒక్కగానొక్క కొడుకు కావడంతో వాడి అమ్మా నాన్నల గుండెలు పగిలిపోయాయి. హెల్మెట్ ఉంటే బతికేవాడు కదా అన్న బాధ ఇప్పటికీ వదల్లేదు నన్ను’ అంటాడు రాఘవేంద్ర.
అప్పటి నుంచి అతడు ఒక ఉద్యమంగా హెల్మెట్లు పంచుతున్నాడు. భార్య కొత్తల్లో సహకరించింది. కాని రాఘవేంద్ర కుమార్ దాదాపు తన ఆస్తులన్నీ అమ్మి ఇప్పటికి రెండు కోట్ల వరకు ఖర్చు చేసి హెల్మెట్లు పంచాడు. ‘ఉన్నదంతా ఊడ్చేశాను. పర్వాలేదు. బిహార్‌లోని నా సొంత పల్లెకు వెళ్లిపోతాను’ అని ఇటీవల అతను ప్రకటించాడు.
కాని అది పైమాటే. తనకు సరైన ప్రోత్సాహం లభిస్తే దేశంలో హెల్మెట్ల బ్యాంకులు తెరవాలని ఎవరైనా సరే అరువు తీసుకుని వెళ్లి వాడుకునేలా హెల్మెట్లు అందుబాటులో ఉంచాలని అతని కోరిక. ‘4 ఏళ్లు పైబడిన పిల్లలకు హెల్మెట్లు తప్పనిసరి చేయాలని నేను సుప్రీం కోర్టులో పిల్ వేశాను. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిశాను’ అంటాడు రాఘవేంద్ర. ‘ప్రాణం పోతే ఏం చేసినా తిరిగి రాదు’ అంటాడు.
హెల్మెట్‌ను వాడటానికి ఇష్టపడని ప్రతి ఒక్కరికి రాఘవేంద్ర చెబుతున్న విషయం అర్థం కావాలి. ప్రాణం ఉంటే లోకం ఉంటుంది.
హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా: మీ పిల్లలకు ఇతన్ని చూపండి
Published Sat, Mar 18 2023 12:06 AM | Last Updated on Sat, Mar 18 2023 12:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment