Helmet Awareness
-
హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా: మీ పిల్లలకు ఇతన్ని చూపండి
కుర్రాళ్లు వినరు. బైక్ ఎక్కి తుర్రుమంటారు. భర్తలకు నిర్లక్ష్యం. హెల్మెట్ లేకుండానే బయలుదేరుతారు. ఇంటి మగవారి అసురక్షిత ప్రయాణం స్త్రీలకు ఎప్పుడూ ఆందోళనకరమే. ప్రతి ఇంట్లోని స్త్రీలు ఆ ఇంటి మగవారికి రాఘవేంద్ర కుమార్‌ను చూపాలి. స్నేహితుణ్ణి ప్రమాదంలో కోల్పోయిన అతను సొంత డబ్బుతో ఇప్పటికి 56,000 హెల్మెట్లు పంచాడు. పురుషులైనా స్త్రీలైనా హెల్మెట్ లేకుండా బండెక్కారంటే ఇంటి మీదకు ముప్పు తెచ్చినట్టే అంటాడు రాఘవేంద్ర. అతను చెప్పేది వినండి. ‘ఒంటి మీద ఎక్కడా దెబ్బ లేదు. తల ఒక్క దానికే తగిలింది’ అని అయినవారిని కోల్పోయి ఏడ్చేవారు ఎందరో ఉన్నారు. ఆ తలకు దెబ్బ తగలని రీతిలో జాగ్రత్త తీసుకుని ఉంటే వారంతా బతికేవారు. హెల్మెట్ వాడితే బతికేవారు. చట్టాలు ఎన్ని చెప్పినా, నిబంధనలు విధించినా జీవితాన్ని సీరియస్‌గా తీసుకోని వారు ఎప్పుడూ ఉంటారు. వారు ఎక్కడో వేరే కుటుంబాలలో ఉంటారనుకోవద్దు. మన కుటుంబాల్లో కూడా ఉంటారు. కాలేజీకి వచ్చిన కొడుకు, ఉద్యోగానికి వెళ్లే భర్త, ట్రయినింగ్లో ఉన్న కూతురు.. వీరు కూడా ‘ఆ.. ఏముందిలే’ అనుకుని హెల్మెట్ వాడకుండా ఉండొచ్చు. అలాంటి వారు తన కంట పడితే ఊరుకోడు రాఘవేంద్ర కుమార్ (36). ఇతణ్ణి అందరూ ఇప్పుడు ‘హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అంటారు. నోయిడాలో నివాసం ఉండే ఇతను ఉద్యోగం వదిలేశాడు. ఇతర పనులు మానేశాడు. కేవలం హెల్మెట్‌కు సంబంధించిన చైతన్యం కోసం పని చేస్తున్నాడు. అతడు రోజూ చేసే పని కారు వేసుకుని, అందులో కొన్ని హెల్మెట్లు పడేసుకుని నోయిడా ఆగ్రాల మధ్య ఉండే ఆరు లేన్ల యమునా ఎక్స్‌ప్రెస్‌కు చేరుకుంటాడు. ఆ దారి మీద బైక్ వేసుకుని హెల్మెట్ లేకుండా ఎవరైనా వెళుతుంటే వారిని వెంబడించి ఆపుతాడు. హెల్మెట్ వాడకపోతే ఉండే ప్రమాదం గురించి చెప్పి ఉచితంగా హెల్మెట్ ఇచ్చి పంపుతాడు. ‘2014 నుంచి నుంచి నేను హెల్మెట్లు పంచుతున్నాను. ఇప్పటికి 56 వేల హెల్మెట్లు పంచాను. నేను పంచిన రోజునో ఆ తర్వాత ఐదారు రోజుల్లోనో ప్రమాదానికి గురై నేనిచ్చిన హెల్మెట్ వల్లప్రాణాలు కాపాడుకున్న వారు 30 మంది ఉన్నారు. వారంతా ఎంతో సంతోషంతో కృతజ్ఞతతో నాకు ఫోన్ చేసి తాముప్రాణాలతో ఉండటానికి కారణం నేనేనని చెబుతారు. చాలామందికి భారీ యాక్సిడెంట్లు అయ్యి కాళ్లు చేతులు విరిగినా తల మాత్రం ఏమీ కాకపోవడంతో బతికిపోయారు’ అంటాడు రాఘవేంద్ర కుమార్. అయితే అతనికి కూడా హెల్మెట్ విలువప్రాణ స్నేహితుడు మరణించాకే తెలిసింది. బిహార్‌కు చెందిన రాఘవేంద్ర కుమార్ 2009లో నోయిడా వచ్చి లా కోర్సులో చేరాడు. అదే బిహార్ నుంచి ఇంజినీరీంగ్ చేయడానికి వచ్చి కృష్ణకుమార్ అతని రూమ్మేట్ అయ్యారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు అయ్యారు. కాని 2014లో కొత్తగా వేసిన యమున ఎక్స్‌ప్రెస్ వే మీద హెల్మెట్ లేకుండా వెళుతూ కృష్ణకుమార్ యాక్సిడెంట్‌కు లోనయ్యాడు. ఒంటి మీద ఒక్క దెబ్బ లేదు. తలకే తగిలింది. మరణించాడు. ‘ వాళ్లింట్లో వాళ్లకి నా స్నేహితుడు ఒక్కగానొక్క కొడుకు కావడంతో వాడి అమ్మా నాన్నల గుండెలు పగిలిపోయాయి. హెల్మెట్ ఉంటే బతికేవాడు కదా అన్న బాధ ఇప్పటికీ వదల్లేదు నన్ను’ అంటాడు రాఘవేంద్ర. అప్పటి నుంచి అతడు ఒక ఉద్యమంగా హెల్మెట్లు పంచుతున్నాడు. భార్య కొత్తల్లో సహకరించింది. కాని రాఘవేంద్ర కుమార్ దాదాపు తన ఆస్తులన్నీ అమ్మి ఇప్పటికి రెండు కోట్ల వరకు ఖర్చు చేసి హెల్మెట్లు పంచాడు. ‘ఉన్నదంతా ఊడ్చేశాను. పర్వాలేదు. బిహార్‌లోని నా సొంత పల్లెకు వెళ్లిపోతాను’ అని ఇటీవల అతను ప్రకటించాడు. కాని అది పైమాటే. తనకు సరైన ప్రోత్సాహం లభిస్తే దేశంలో హెల్మెట్ల బ్యాంకులు తెరవాలని ఎవరైనా సరే అరువు తీసుకుని వెళ్లి వాడుకునేలా హెల్మెట్లు అందుబాటులో ఉంచాలని అతని కోరిక. ‘4 ఏళ్లు పైబడిన పిల్లలకు హెల్మెట్లు తప్పనిసరి చేయాలని నేను సుప్రీం కోర్టులో పిల్ వేశాను. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిశాను’ అంటాడు రాఘవేంద్ర. ‘ప్రాణం పోతే ఏం చేసినా తిరిగి రాదు’ అంటాడు. హెల్మెట్‌ను వాడటానికి ఇష్టపడని ప్రతి ఒక్కరికి రాఘవేంద్ర చెబుతున్న విషయం అర్థం కావాలి. ప్రాణం ఉంటే లోకం ఉంటుంది. -
'సర్కారు వారి పాట'ను బాగా వాడేసిన హైదరాబాద్ పోలీసులు..
SVP Trailer: Hyderabad Police Awareness With Helmet Scene: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే12న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇటీవల విడుదలైన పెన్నీ, కళావతి, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌లోని సీన్లు, డైలాగ్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ ట్రైలర్‌లోని సీన్లు ప్రేక్షకులనే కాకుండా హైదరాబాద్ సిటీ పోలీసులను సైతం బాగా ఆకర్షించాయి. ఈ మూవీ ప్రచార చిత్రంలో ఓ సన్నివేశంలో విలన్‌కు హెల్మెట్ పెడుతూ డైలాగ్ చెప్తాడు మహేశ్ బాబు. ఈ సీన్‌ను హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విటర్ అకౌంట్ నిర్వాహకులు బాగా వాడారు. మూవీలోని ఈ సీన్‌కు క్రెడిట్ ఇస్తూ హెల్మెట్ ధరించండి, భద్రత ముఖ్యం అంటూ ట్వీట్ చేశారు. సాధారణంగానే బాగా వైరల్ అయిన సీన్లు, సాంగ్స్, హుక్ స్టెప్స్లను మార్ఫింగ్ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక ట్రైలర్లోనే హెల్మెట్ ధరించడం ఉండేసరికి వీడియో పోస్ట్ చేస్తూ కొటేషన్స్‌తో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చదవండి: థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్.. అద్దాలు ధ్వంసం మహేశ్‌బాబు నోట ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట #WearHelmet #SafetyFirst Vc: SarkaruVaariPaataTrailer pic.twitter.com/Npgg05zeXs — హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) May 2, 2022 -
‘తల’రాత మారకుండా!
పవన్ దాదాపు ఇంటికొచ్చేశాడు.. టర్నింగ్ తిరిగితే ఎదురుగా పిల్లలు, భార్య కనిపిస్తారు. కానీ ఇంతలోనే షాక్.. వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఎగిరి అవతల పడ్డాడు. తల సిమెంటు రోడ్డుకు గుద్దుకోవడంతో క్షణాల్లో ప్రాణాలు వదిలాడు. అతని వద్ద హెల్మెట్ ఉన్నా ఆ.. ఇల్లు వస్తుందిలే కదా అని తీసి దానిని పెట్రోల్ ట్యాంక్‌పై పెట్టుకున్నాడు. అదే అతనికి మరణ శాసనం అయింది. అదే హెల్మెట్ ధరించి ఉంటే కచ్చితంగా ప్రాణాలు దక్కేవి. ఇది ఒక్క పవన్ విషాద గాథే కాదు.. ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో నిత్యం యాక్సిడెంట్ కేసుల్లో ఎంతో మంది బలి అవుతూనే ఉన్నారు. దీనికి ఒక చక్కని పరిష్కారం నాణ్యమైన హెల్మెట్లు ధరించడమే! సాక్షి, రాచర్ల(ప్రకాశం) : ‘స్పీడ్ కిక్స్.. బట్ కిల్స్’ అనే వాక్యం హైవేల్లో దర్శనమిస్తూ ఉంటుంది. అంటే వేగంగా పోయినప్పుడు హుషారు అనిపించినా దాని వల్ల మరణం తప్పదనేది అర్థం. సాధారణంగా యూత్ అంటే వేగానికి సింబల్..మాటల్లో..దూకుడులో నిర్ణయాలు తీసుకోవడంలోనూ అంతే. శరీరంలో రక్తం జెట్ వేగంతో పరుగులు తీస్తుంటుంది. ఇలాంటి వారి చేతికి బైక్ ఎక్స్‌లేటర్ దొరికితే..దాని కేబుల్ తెగే దాకా తిప్పుతూనే ఉంటారు. హైవే రోడ్లపై బైక్ గంటకు 100 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. కానీ తేడా వస్తే క్షణకాలంలో జీవితం తిరగబడుతుంది. బైక్ రైడ్ చేసే వారికి హెల్మెట్ లేకపోతే ఫలితం ఘోరంగా ఉంటుంది. ఇలా విగతా జీవులుగా మారుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. డ్రైవింగ్‌లో ఎలాంటి పొరపాట్లు చేయని వారు కూడా రోడ్డు ప్రమాదాల్లో బలైపోతున్నారు. ఇలాంటి ప్రమాదాలకు ఫుల్స్టాప్ పెట్టి తలను రక్షించుకోవడం మన చేతుల్లోనే ఉంది. వేలాది రూపాయలు పెట్టి బైక్ కొనేవారు వందల్లో ఖర్చయ్యే హెల్మెట్ గురించి ఆలోచించాలి. శిరస్సుకు మహారక్షణ శరీరంలో ఇతర భాగాలకు గాయలైతే సాధ్యమైనంతవరకు చికిత్సతో ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ తలకు తీవ్రగాయలైతే మెదడు దెబ్బతిని మరణం సంభవిస్తుంది. కొన్నిసార్లు బ్రెయిన్ డెడ్ కావడం లేదా మతిస్థిమితం కోల్పోడం జరుగుతుంది. ముఖ్యంగా మోటారు సైకిల్ ప్రమాదాల్లో 90 శాతం మరణాలు తలకు తీవ్రమైన గాయలు కావడం వల్లే సంభవిస్తున్నాయని గుర్తించాల్సి ఉంది. అదే హెల్మెట్ వాడితే ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చు. నాణ్యమైన హెల్మెట్ వాడితే శిరస్సు సురక్షితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే కారుల్లో ప్రయాణం చేసే వారు సీటు బెలును పెట్టుకోవాలి. సడన్ బ్రేకులు వేసినప్పుడు కారు దేనికైనా ఢీ కొట్టినప్పుడు, పల్టీలు కొట్టినా తలకు శరీర భాగాలకు తగిలే దెబ్బల నుంచి రక్షణ పొందవచ్చు. ఎలాంటి హెల్మెట్ వాడాలి..? హెల్మెట్ వాడమన్నారు కాదా అని నాసిరకం హెల్మెట్ వాడితే ఇబ్బందులు తప్పవు. హెల్మెట్‌తో ప్రయోజనం లేకపోతే ప్రమాదంలో తలకు అసౌకర్యం కలుగుతుంది. హెల్మెట్‌కు ఐఎస్ఐ మార్కు కలిగి ఉండాలి. తల నుంచి మెడ భాగం వరకూ పూర్తి రక్షణ ఇచ్చేదిగా ఉండాలి. మెడ కింద అమర్చిన ట్యాగ్ బెల్ట్ సౌకర్యంగా ఉండాలి. గడ్డం కిందిబాగంలో నిర్దిష్టమైన గ్యాప్ ఉండాలి. బైక్ నడుపుతున్నప్పుడు గాలి శబ్దం తీవ్రంగా రాకుండా సాధారణంగా ఉండాలి. అన్ని శబ్దాలు బాగా వినిపించేలా ఉండాలి. నిబంధనలు గాలికి వాహనాలు నడిపే సమయంలో తలకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని నిబంధనలు ఉన్నా.. చాలా మంది హెల్మెట్ ధరించడం లేదు. హెల్మెట్ ధరించాలని పలు కార్యక్రమాలు టీవీల్లో ప్రకటనలు ఇస్తున్నా యువతలో ఇంకా చైతన్యం రావడం లేదు. ఈ మధ్యకాలంలో పోలీసులు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. పోలీసుల తనిఖీల్లో జరిమానాలు విధిస్తున్నప్పుటికీ యువతలో ఇప్పటికి కూడా మార్పు రావడం లేదు. ప్రతి నిత్యం ఏదో ప్రదేశంలో పోలీసులు వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచనలు, సలహాలు ఇస్తున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. -
మీరు హెల్మెట్ ధరించి ప్రజల్లో చైతన్యం తేవాలి
రఘునాథపాలెం: ‘మీరు ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించండి. దాని ప్రాముఖ్యతను ప్రజలకు వివరించండి. తద్వారా రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గించండి’ అని రూరల్ ఏసీపీ నరేశ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లో 30 మందికిపైగా సిబ్బ ందికి హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రయాణం ఆనందకరంగా సాగాలంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్రవాహన దారు లు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. ఇటీవ లి కాలంలో హెల్మెట్ ధరించిన వారు ప్రమాదాల కు గురైనప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారని, ఇ లాంటి ఘటనలు అనేకం ఉన్నాయని వివరించా రు. ఇలాంటి ఘటనలు ప్రజలకు వివరించాలని సిబ్బందిని కోరారు. ఏదైనా ఎదుటి వారికి మనం చెప్పే ముందు దానిని పాటించి ఆదర్శంగా ఉండాలని పేర్కొన్నారు. సమావేశంలో సీఐ తిరుపతిరెడ్డి, ఎస్ఐ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రయాణం సాఫీగా సాగేలా..
భువనగిరి క్రైం : ట్రా‘ఫికర్’ లేకుండా సాఫీగా ప్రయాణం సాగడానికి భువనగిరి ట్రాఫిక్ పోలీసులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాహనదారులు, ఆటోడ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. హెల్మెట్ ధరించనివారికి, డ్రైంక్ అండ్ డ్రైవ్ వల్ల కలిగే ప్రమాదాలను షార్ట్‌ఫిల్మ్‌ల రూపంలో నివారించడానికి ప్రయత్నిస్తున్నారు. భువనగిరి పట్టణం రాచకొండ కమిషనరేట్ పరిధి లోకి వెళ్లిన∙తర్వాత భువనగిరిలో ట్రాఫిక్ విభా గం ప్రత్యేకంగా ఏర్పాటైంది. పట్టణంలో ట్రాఫి క్‌ను నియంత్రించడానికి ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లను నియమించింది. ప్రతిరోజు భువనగిరి పట్టణంతో పాటు బైపాస్ రోడ్డుపైన నిబంధనలు పాటించకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి నిబంధనలు పాటించేలా వారికి అవగాహన కల్పిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక శ్రద్ధ ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. మద్యం తాగి హైవేపై, పట్టణంలో వా హనాలు నడిపే వారిని గుర్తించి కేసులు నమోదు చేయడం, కోర్టుకు అప్పగిస్తున్నారు. అంతేకాదు వారికి మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే దుష్ఫలితాలను తెలియజేస్తున్నారు. ఇప్పటి కే ప్రతి మంగళవారం, శుక్రవారం మద్యం తాగి వాహనాలు నడిపిన వారితో పాటు, వారి వారి కుటుంబ సభ్యులకు సైతం భువనగిరి ట్రాఫిక్ పో లీస్‌స్టేషన్‌లో సీఐలు, ఎస్ఐలు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే దుష్ఫలితాలను ఫొటోల రూపంలో చూపిం చడానికి వినూత్నమైన బోర్డులను ఏర్పాటుచేశారు. కొండమడుగు నుంచి రాయిగిరి వరకు 14 బోర్డులను ఏర్పాటుచేశారు. వీటితో పాటుగా ఈ హైవేపైనే రోడ్డు పక్కన ఉన్న జంక్షన్లను సులభంగా గుర్తించడానికి బ్లింకర్స్‌ను ఏర్పాటుచేశారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలకు ప్రత్యేకంగా స్టిక్కర్లను అతికించి ప్రచారం చేశారు. ఆటోడ్రైవర్లకు కౌన్సెలింగ్ పట్టణంలోని ఆటో డ్రైవర్లందరికీ ట్రాఫిక్ సీఐలు శివశంకర్‌గౌడ్, రాజశేఖర్‌రెడ్డిలు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆటో డ్రైవర్లు కచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని, పత్రాలు సరిగ్గా ఉండాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకుండా, ఆటోలో లౌడ్‌స్పీకర్స్‌ను నిషేధించాలని, తప్పనసరిగ్గా ఇన్సురెన్స్ సదుపాయం కలిగిఉండాలని, వేగంగా ప్రయణించడం వలన కలిగే నష్టాలపై కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరితో పాటు రోడ్డు పక్కన పం డ్లు అమ్ముకునే వారికి, చిన్న చిన్న దుకాణాలు ఏ ర్పాటుచేసుకున్న వారికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. హెల్మెట్ వాడకంపై ప్రచారం ద్విచక్ర వాహనాదారులు హెల్మెట్ ధరించడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలియజేసేందుకు ట్రాఫిక్ సీఐ శివశంకర్ సిబ్బందితో కలిసి భువనగిరిలో బైక్ ర్యాలీ నిర్వహించి ద్విచక్రవాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలకు హెల్మెట్ వాడకం తప్పనిసరి అని వివరిస్తున్నారు. త్వరలో ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ ఏర్పాటు త్వరలోనే భువనగిరిలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుచేయనున్నారు. ఈ సిగ్నల్స్‌ను బెల్ సంస్థ అమరుస్తుంది. ఇప్పటికే పట్టణంలో ఎక్కడ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలనే అంశంపై ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ మనోహర్ భువనగిరి పట్టణంలో పర్యటించి ప్రధాన కూడళ్లను పరిశీలించారు. త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దీంతో ట్రాఫిక్ సమస్య చాల వరకు తీరుతుందని ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. నిబంధనలపై విద్యార్థులకూ అవగాహన రహదారిపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు పాటించాల్సిన నిబంధనలు, పాదాచారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వీడియోలు, షార్ట్‌ఫిల్మ్‌ల రూపంలో త్వరలోనే ప్రతి పాఠశాల, కళాశాలకు వెళ్లి అవగాహన కల్పించడానికి వీడియో కూడా తయారు చేశారు. వీటితో పాటు పట్టణంలోని లోకల్ టీవి చానెల్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు. వీటితో పాటుగా పట్టణంలో త్వరలోనే డిజిటల్ బోర్డులను ఏర్పాటుచేయనున్నారు. అలాగే పట్టణంలోని రహదారులపై వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేస్తే వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు రికవరీ వ్యాన్‌ను భువనగిరి పట్టణంలో సైతం ప్రవేశపెట్టారు. ఈ వాహనం ద్వారా ట్రాఫిక్ పోలీసులు ప్రతి రోజు రోడ్డుపైన వాహనాలను నిలపొద్దని ప్రచారం చేస్తూ రాంగ్ పార్కింగ్ చేసిన వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తున్నారు. -
‘మేడమ్ మీ చేతులు అతన్ని రక్షించలేవు’
సాక్షి, హైదరాబాద్ : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ఉపయోగించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. హెల్మెట్లు వాడని బైకర్స్‌కు జరిమానాలు విధిస్తున్నారు. అయినప్పటికి కొందరు హెల్మెట్ వాడకుండా అజాగ్రత్త వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తున్నారు. హెల్మెట్ ధరించని బైకర్స్ ఫొటోలను, వారికి విధించిన జరిమానాలను షేర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (హెచ్వైడీటీపీ) అధికారిక ట్విటర్లో చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సేఫ్ డ్రైవ్.. అవగాహన కోసమని ట్వీట్ చేసిన ఫొటోలో.. దంపతులిద్దరూ బైక్‌పై వెళ్తున్నారు. అయితే బండి నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించకపోగా.. వెనుక కూర్చున్న మహిళ హెల్మెట్ పెట్టుకుంది. అంతేకాకుండా ఆమె తన చేతిని ఆ వ్యక్తి తలపై రక్షణగా పెట్టింది. దీనికి హైదరాబాద్ ట్రాఫిక్ సోషల్ మీడియా విభాగం ‘ఈ ఫొటోలో ఎంతో ప్రేమ కనిపిస్తుంది. కానీ మేడమ్.. మీ చేతులు అతన్ని రక్షించలేవు. హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి’ అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నపోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. So much of love in one picture but madam, your HAND wont be saving him. Helmet does. pic.twitter.com/NsEM2RRlPp — HYDTP (@HYDTP) 4 May 2018 -
గులాబీ తీసుకోండి.. హెల్మెట్ ధరించండి
పెనమలూరు : సార్.. గులాబీ తీసుకోండి.. హెల్మెట్ ధరించండి.. అంటూ పాఠశాల విద్యార్థులు బందరు రోడ్డుపై వినూత్న కార్యక్రమం నిర్వహించారు. పోరంకి శ్రీఉషోదయ స్కూల్ విద్యార్థులు శుక్రవారం పోరంకి, కానూరు గ్రామాల్లో బందరు రోడ్డుపై హెల్మెట్ లేకుండా వాహనాలపై వెళ్లే వారిని ఆపి గులాబీలు ఇచ్చారు. హెల్మెట్ ధరించాలని పోలీసులు ప్రకటించినా చాలామంది వాహనదారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు వినూత్నంగా ఈ కార్యక్రమం చేపట్టారు. వీరికి ట్రాఫిక్ పోలీసులు మద్దతుగా నిలిచారు. కార్యక్రమంలో పాఠశాల అకడమిక్ డైరెక్టర్ విజయలక్ష్మి, రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ నిర్వాహకులు శశికళ, ప్రమీలారాణి పాల్గొన్నారు. వేగం కన్నా.. భద్రత ముఖ్యం వేగంగా ప్రయాణం చేయటం కన్నా భద్రత ముఖ్యమని వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రత్నప్రసాద్, ట్రాఫిక్ సీఐ విజయ్‌కుమార్ అన్నారు. కానూరు వీఆర్ సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు లయన్స్ క్లబ్ సహకారంతో హెల్మెట్ వల్ల కలిగే భద్రతపై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించని వారికి చాక్లెట్లు అందజేశారు. ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రత్నాకర్, ఫిజికల్ డైరెక్టర్ ప్రసాద్, లయన్స్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు, పోలీసులు పాల్గొన్నారు. -
హెల్మెట్ ఉంటేనే ఆర్టీఏకు రండి
అవగాహనార్యాలీలో సుల్తానియా సాక్షి, హైదరాబాద్ : ‘బాధ్యతగా హెల్మెట్ ధరిం చండి. ప్రాణాలను కాపాడుకోండి. మీ కోసం మీ కుటుంబం ఎదురు చూస్తోందనే విషయాన్ని మరచి పోవద్దు.’ అని రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా వాహనదారులకు అన్నారు. హెల్మెట్‌లేని వాహనదారులను ఆర్టీఏ కార్యాల యాల్లోకి అనుమతించబోమని చెప్పారు. శనివారం ఖైరతాబాద్‌లోని రవాణా కమిషనర్ కార్యాలయం వద్ద హెల్మెట్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సుల్తానియా మాట్లాడుతూ హెల్మెట్ ధరించాలనే నిబంధన కొత్తగా వచ్చిందికాదన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారిలో 25 శాతం మంది హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారేనని ఆం దోళన వ్యక్తం చేశారు. కాలేజీలు, విద్యాసంస్థలు, నగరంలోని ప్రధానకూడళ్లలో హెల్మెట్‌పై విస్తృత ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు హైదరాబాద్ సం యుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు. ఖైరతాబాద్ నుంచి సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్డు, రాజీవ్ చౌరస్తా, పంజగుట్ట, ఎర్రమంజిల్ మీదుగా తిరిగి రవాణా కమిషనర్ కార్యాలయానికి ర్యాలీ చేరుకుంది. కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా అధికారులు జీపీఎన్ ప్రసాద్, దశరథం, లక్ష్మి, పలువురు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఉప్పల్ ప్రాంతీయ రవాణా కార్యాలయం వద్ద జరిగిన హెల్మెట్ అవగాహనర్యాలీని రంగారెడ్డి ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ప్రారంభించారు.