
పెనమలూరు : సార్.. గులాబీ తీసుకోండి.. హెల్మెట్ ధరించండి.. అంటూ పాఠశాల విద్యార్థులు బందరు రోడ్డుపై వినూత్న కార్యక్రమం నిర్వహించారు. పోరంకి శ్రీఉషోదయ స్కూల్ విద్యార్థులు శుక్రవారం పోరంకి, కానూరు గ్రామాల్లో బందరు రోడ్డుపై హెల్మెట్ లేకుండా వాహనాలపై వెళ్లే వారిని ఆపి గులాబీలు ఇచ్చారు. హెల్మెట్ ధరించాలని పోలీసులు ప్రకటించినా చాలామంది వాహనదారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు వినూత్నంగా ఈ కార్యక్రమం చేపట్టారు. వీరికి ట్రాఫిక్ పోలీసులు మద్దతుగా నిలిచారు. కార్యక్రమంలో పాఠశాల అకడమిక్ డైరెక్టర్ విజయలక్ష్మి, రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ నిర్వాహకులు శశికళ, ప్రమీలారాణి పాల్గొన్నారు.
వేగం కన్నా.. భద్రత ముఖ్యం
వేగంగా ప్రయాణం చేయటం కన్నా భద్రత ముఖ్యమని వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రత్నప్రసాద్, ట్రాఫిక్ సీఐ విజయ్‌కుమార్ అన్నారు. కానూరు వీఆర్ సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు లయన్స్ క్లబ్ సహకారంతో హెల్మెట్ వల్ల కలిగే భద్రతపై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించని వారికి చాక్లెట్‌లు అందజేశారు. ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రత్నాకర్, ఫిజికల్ డైరెక్టర్ ప్రసాద్, లయన్స్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు, పోలీసులు పాల్గొన్నారు.