free distribution
-
మరో నాలుగేళ్లు ఫోర్టీఫైడ్ రైస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరో నాలుగేళ్ల పాటు ఉచిత ఫోర్టీఫైడ్ రైస్ అందించనున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా 2028 డిసెంబర్ వరకు ఉచిత ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా కొనసాగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. సూక్షపోషకాలైన ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12లను బియ్యానికి జోడిస్తారు. దీన్నే ఫోర్టీఫైడ్ రైస్‌గా పిలుస్తారు. 2024 జూలై నుంచి 2028 డిసెంబర్ వరకు ఈ కార్యక్రమం అమలు కోసం రూ.17,082 కోట్లు ఖర్చు చేయనున్నారు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఫోర్టీఫైడ్ రైస్ ఉచిత సరఫరాను కొనసాగించడంతో పాటు పలు అంశాలకు ఆమోదముద్ర వేశారు. గుజరాత్లో ని లోథాల్లో జాతీ య మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్ఎంహెచ్సీ)ని ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్ఎంహెచ్సీ అభివృద్ధిలో 22 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం తెలిపింది. ‘ఫేజ్ 1ఎ’లో జాతీయ మారిటైమ్ హెరిటేజ్ మ్యూజియం, ఆరు గ్యాలరీలు ఉంటాయని వివరించింది. భారత నావికాదళం, తీరప్రాంత రక్షకదళం గ్యాలరీలు ఉంటాయని, దేశంలోనే అతిపెద్దవిగా ఇవి నిలుస్తాయని తెలిపింది. ఫేజ్–2లో తీరప్రాంత రాష్ట్రాల పెవిలియన్లు, మారిటైమ్ ఇనిస్టిట్యూట్, హాస్టల్, నాలుగు థీమ్ బేస్డ్ పార్క్‌లను ఏర్పాటు చేస్తారు. -
హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా: మీ పిల్లలకు ఇతన్ని చూపండి
కుర్రాళ్లు వినరు. బైక్ ఎక్కి తుర్రుమంటారు. భర్తలకు నిర్లక్ష్యం. హెల్మెట్ లేకుండానే బయలుదేరుతారు. ఇంటి మగవారి అసురక్షిత ప్రయాణం స్త్రీలకు ఎప్పుడూ ఆందోళనకరమే. ప్రతి ఇంట్లోని స్త్రీలు ఆ ఇంటి మగవారికి రాఘవేంద్ర కుమార్‌ను చూపాలి. స్నేహితుణ్ణి ప్రమాదంలో కోల్పోయిన అతను సొంత డబ్బుతో ఇప్పటికి 56,000 హెల్మెట్లు పంచాడు. పురుషులైనా స్త్రీలైనా హెల్మెట్ లేకుండా బండెక్కారంటే ఇంటి మీదకు ముప్పు తెచ్చినట్టే అంటాడు రాఘవేంద్ర. అతను చెప్పేది వినండి. ‘ఒంటి మీద ఎక్కడా దెబ్బ లేదు. తల ఒక్క దానికే తగిలింది’ అని అయినవారిని కోల్పోయి ఏడ్చేవారు ఎందరో ఉన్నారు. ఆ తలకు దెబ్బ తగలని రీతిలో జాగ్రత్త తీసుకుని ఉంటే వారంతా బతికేవారు. హెల్మెట్ వాడితే బతికేవారు. చట్టాలు ఎన్ని చెప్పినా, నిబంధనలు విధించినా జీవితాన్ని సీరియస్‌గా తీసుకోని వారు ఎప్పుడూ ఉంటారు. వారు ఎక్కడో వేరే కుటుంబాలలో ఉంటారనుకోవద్దు. మన కుటుంబాల్లో కూడా ఉంటారు. కాలేజీకి వచ్చిన కొడుకు, ఉద్యోగానికి వెళ్లే భర్త, ట్రయినింగ్లో ఉన్న కూతురు.. వీరు కూడా ‘ఆ.. ఏముందిలే’ అనుకుని హెల్మెట్ వాడకుండా ఉండొచ్చు. అలాంటి వారు తన కంట పడితే ఊరుకోడు రాఘవేంద్ర కుమార్ (36). ఇతణ్ణి అందరూ ఇప్పుడు ‘హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అంటారు. నోయిడాలో నివాసం ఉండే ఇతను ఉద్యోగం వదిలేశాడు. ఇతర పనులు మానేశాడు. కేవలం హెల్మెట్‌కు సంబంధించిన చైతన్యం కోసం పని చేస్తున్నాడు. అతడు రోజూ చేసే పని కారు వేసుకుని, అందులో కొన్ని హెల్మెట్లు పడేసుకుని నోయిడా ఆగ్రాల మధ్య ఉండే ఆరు లేన్ల యమునా ఎక్స్‌ప్రెస్‌కు చేరుకుంటాడు. ఆ దారి మీద బైక్ వేసుకుని హెల్మెట్ లేకుండా ఎవరైనా వెళుతుంటే వారిని వెంబడించి ఆపుతాడు. హెల్మెట్ వాడకపోతే ఉండే ప్రమాదం గురించి చెప్పి ఉచితంగా హెల్మెట్ ఇచ్చి పంపుతాడు. ‘2014 నుంచి నుంచి నేను హెల్మెట్లు పంచుతున్నాను. ఇప్పటికి 56 వేల హెల్మెట్లు పంచాను. నేను పంచిన రోజునో ఆ తర్వాత ఐదారు రోజుల్లోనో ప్రమాదానికి గురై నేనిచ్చిన హెల్మెట్ వల్లప్రాణాలు కాపాడుకున్న వారు 30 మంది ఉన్నారు. వారంతా ఎంతో సంతోషంతో కృతజ్ఞతతో నాకు ఫోన్ చేసి తాముప్రాణాలతో ఉండటానికి కారణం నేనేనని చెబుతారు. చాలామందికి భారీ యాక్సిడెంట్లు అయ్యి కాళ్లు చేతులు విరిగినా తల మాత్రం ఏమీ కాకపోవడంతో బతికిపోయారు’ అంటాడు రాఘవేంద్ర కుమార్. అయితే అతనికి కూడా హెల్మెట్ విలువప్రాణ స్నేహితుడు మరణించాకే తెలిసింది. బిహార్‌కు చెందిన రాఘవేంద్ర కుమార్ 2009లో నోయిడా వచ్చి లా కోర్సులో చేరాడు. అదే బిహార్ నుంచి ఇంజినీరీంగ్ చేయడానికి వచ్చి కృష్ణకుమార్ అతని రూమ్మేట్ అయ్యారు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు అయ్యారు. కాని 2014లో కొత్తగా వేసిన యమున ఎక్స్‌ప్రెస్ వే మీద హెల్మెట్ లేకుండా వెళుతూ కృష్ణకుమార్ యాక్సిడెంట్‌కు లోనయ్యాడు. ఒంటి మీద ఒక్క దెబ్బ లేదు. తలకే తగిలింది. మరణించాడు. ‘ వాళ్లింట్లో వాళ్లకి నా స్నేహితుడు ఒక్కగానొక్క కొడుకు కావడంతో వాడి అమ్మా నాన్నల గుండెలు పగిలిపోయాయి. హెల్మెట్ ఉంటే బతికేవాడు కదా అన్న బాధ ఇప్పటికీ వదల్లేదు నన్ను’ అంటాడు రాఘవేంద్ర. అప్పటి నుంచి అతడు ఒక ఉద్యమంగా హెల్మెట్లు పంచుతున్నాడు. భార్య కొత్తల్లో సహకరించింది. కాని రాఘవేంద్ర కుమార్ దాదాపు తన ఆస్తులన్నీ అమ్మి ఇప్పటికి రెండు కోట్ల వరకు ఖర్చు చేసి హెల్మెట్లు పంచాడు. ‘ఉన్నదంతా ఊడ్చేశాను. పర్వాలేదు. బిహార్‌లోని నా సొంత పల్లెకు వెళ్లిపోతాను’ అని ఇటీవల అతను ప్రకటించాడు. కాని అది పైమాటే. తనకు సరైన ప్రోత్సాహం లభిస్తే దేశంలో హెల్మెట్ల బ్యాంకులు తెరవాలని ఎవరైనా సరే అరువు తీసుకుని వెళ్లి వాడుకునేలా హెల్మెట్లు అందుబాటులో ఉంచాలని అతని కోరిక. ‘4 ఏళ్లు పైబడిన పిల్లలకు హెల్మెట్లు తప్పనిసరి చేయాలని నేను సుప్రీం కోర్టులో పిల్ వేశాను. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిశాను’ అంటాడు రాఘవేంద్ర. ‘ప్రాణం పోతే ఏం చేసినా తిరిగి రాదు’ అంటాడు. హెల్మెట్‌ను వాడటానికి ఇష్టపడని ప్రతి ఒక్కరికి రాఘవేంద్ర చెబుతున్న విషయం అర్థం కావాలి. ప్రాణం ఉంటే లోకం ఉంటుంది. -
ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురి మృతి!
చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఉచిత చీరల కోసం వెళ్లిన నలుగురు మహిళలు మృత్యువాతపడ్డారు. తిరువత్తూరులో జిల్లా వాణియంబాడిలోని జిన్నాపాలెం వద్ద మురుగన్ తైపుసం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేటు సంస్థ మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. చీరల కోసం ఉచిత టోకెన్లు పొందేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 2000 మంది మహిళలు తరలివచ్చారు. అయితే టోకెన్ల కోసం మహిళలు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక 16 మంది మహిళలు స్పృహతప్పి పడిపోయారు.వీరిని వెంటనే వాణియంబాడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురు మహిళలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయలపాలైన మరో 12 మంది మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై ఎస్పీ బాలకృష్ణ విచారణకు ఆదేశించారు. టోకెన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసిన ప్రైవేట్ సంస్థ యజమాని అయ్యప్పన్‌ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: పెండింగ్ చలాన్లపై 50శాతం డిస్కౌంట్.. ఒక్కరోజే రూ.5.6 కోట్లు వసూలు.. -
కథలు.. విజ్ఞాన సోపానాలు
కడప ఎడ్యుకేషన్: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టింది. నాడు– నేడు ద్వారా వాటి రూపురేఖలు మార్చారు. విద్యార్థుల అభ్యున్నతికి అనుక్షణం కృషి చేస్తున్నారు. విద్యతోపాటు విజ్ఞానం, మానవీయత, సృజనాత్మకతను వెలికి తీసేందుకు తాజాగా విద్యార్థులకు కథల పుస్తకాలను కూడా అందిçస్తున్నారు.అందులోని కథలు మానవీయ విలువలు తెలియజేసేవిధంగా ఉన్నాయని విద్యావేత్తలు తెలిపారు. సృజనాత్మకతను పెంచేందుకు దోహదం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విజ్ఞానం, నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. కథల పుస్తకాల కాన్సెప్ట్‌ను అమలులోకి తెచ్చింది. జగనన్న విద్యాకానుక ద్వారా ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం అదనంగా ఈ కథల పుస్తకాలను అందజేశారు. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని భారతీయభాషల కేంద్రీయ సంస్థ(సీఐఐఎల్)తో ఒప్పందం కుదుర్చుకుని కథలతో కూడిన పుస్తకాలను రూపొందించారు. ఆకర్షణీయమైన రంగులు, నాణ్యమైన మెటీరియల్‌తో ముద్రించిన 10 రకాల కథల పుస్తకాలను ఉమ్మడి వైఎస్సార్ జిల్లావ్యాప్తంగా 2,762 పాఠశాలలకు పంపిణీ చేసేందుకు సమగ్రశిక్ష అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. 2,493 ప్రాథమిక, 269 ప్రాథమికోన్నత పాఠశాలల పరిధిలో ఒక్కో పాఠశాలకు 10 కథల పుస్తకాలతో కూడిన సెట్‌ను అందించనున్నారు. చదవడం మాకిష్టం కార్యక్రమంలో భాగంగా వేసవి సెలవుల్లో పాఠశాలకు వచ్చే విద్యార్థులకు వీటిని అందచేసి చదివించేందుకు ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలి. తెలుగు, ఆంగ్లభాషలో ఒక్కో పుస్తకంలో ఒక్కో కథను ముద్రించారు. విద్యార్థులు తాము చదివిన కథలో ముఖ్యమైన అంశాలను పుస్తకంలోని చివరి పేజీలో ఇచ్చిన ఖాళీల్లో పూరించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఒక్కో పుస్తకం ధర రూ. 50 ఉండగా ప్రతి పాఠశాలకు రూ. 5 వందల విలువైన 10 రకాల పుస్తకాలను వైఎస్సార్ జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం ద్వారా పంపిణీ చేస్తున్నారు. నీతి నిజాయితీ, విలువలు, క్రమశిక్షణ, సక్రమమైన జీవనం వంటి అంశాలతో కూడిన కథలు ఉన్నాయి. వీటిని చదవడం ద్వారా విద్యార్థుల్లో సత్ప్రవర్తన, నైతిక విలువలు పెంపొందుతాయని విద్యావేత్తల అభిప్రాయం. ఆసక్తి రేకెత్తించే కథలు... 10 రకాల పుస్తకాలతో కూడిన సెట్లో ఉన్న కథల్ని పరిశీలిస్తే పావురం వివేకం, తెలివైన చేప, తొందరపాటు పనికిరాదు, ఊసరవెల్లి అతి తెలివి, యుక్తితో పనులు సాధించవచ్చు. పిల్లిమెడలో గంట, చీమ– పావురం, తెలివైన జింక, పెద్దలమాట చద్దిమూట, మంచి స్నేహితులు వంటి కథలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 58 గ్రంథాలయాలకు కథల పుస్తకాలను అందజేశారు. ఈ వేసవి సెలవుల్లో లైబ్రరీల్లో నిర్వహించిన వేసవి శిబిరాల్లో పిల్లల చేత చదివించారు. ఇప్పటి వరకు జిల్లాలోని 100 పాఠశాలలకు పుస్తకాలను పంపిణీ చేశారు. మిగతా వాటికి కూడా పంపిణీ చేరవస్తున్నారు. విద్యార్థులతో చదివించాలి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే విధంగా విభిన్న అంశాలతో కూడిన కథలను పుస్తకాల్లో చేర్చాం. ప్రతి పాఠశాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న వీటిని విద్యార్థులతో ప్రతిరోజు చదివించాలి.అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి.జిల్లా కేంద్రం నుంచి నేరుగా పాఠశాలలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం పంపిణీ ప్రారంభించాం. – డాక్టర్ అంబవరం ప్రభాకర్‌రెడ్డి, జిల్లా సమగ్రశిక్ష పథక అధికారి, వైఎస్సార్‌జిల్లా -
ఉచిత వ్యాక్సిన్ హామీ కోడ్ ఉల్లంఘన కాదు
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామంటూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కాదని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఉచిత వ్యాక్సిన్ వాగ్దానం వివక్షా పూరితమైనదనీ, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఇచ్చిన ఫిర్యాదుపై స్పందిస్తూ ఎన్నికల కమిషన్ ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదని తేల్చింది. పౌరుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలను చేపట్టవచ్చునని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు చెపుతున్నాయి. ఎన్నికల ప్రణాళికలో ప్రజాసంక్షేమం కోసం ఇలాంటి వాగ్దానాలు చేయడంలో అభ్యంతరం ఉండదని ఈసీ పేర్కొంది. ఆచరణాత్మకమైన వాగ్దానాలు ఎన్నికల ప్రణాళికలో చేర్చడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో తప్పు లేదని ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రణాళికలను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్దిష్ట ఎన్నికల సందర్భాల్లో విడుదల చేస్తుంటారని ఈసీ తెలిపింది. అయితే బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఉచిత వ్యాక్సిన్ వాగ్దానాన్ని ఒక్క బిహార్ రాష్ట్ర ప్రజలకే ఇస్తానని పేర్కొందని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ విస్మరించడం ఆశ్చర్యంగా ఉందని గోఖలే వ్యాఖ్యానించారు. బీజేపీ ఎన్నికల ప్రణాళికను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఇదివరకే బీజేపీ మేనిఫెస్టోని కేంద్ర మంత్రి నిర్మల విడుదల చేశారు. వ్యాక్సిన్‌ని బిహార్ ప్రజలకు ఉచితంగా అందిస్తామని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యం రాష్ట్ర జాబితాలో ఉన్న విషయమని, ఇది కేవలం బిహార్‌కే పరిమితమని, దేశం మొత్తానికి వర్తించదని బీజేపీ తెలిపింది. ప్రధాని బయోపిక్ విడుదల ఉల్లంఘన కాదు బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌ను విడుదల చేయడం నిబంధనావళి ఉల్లంఘనగా పరిగణించలేమని ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ఈ సినిమాను విడుదల చేయడం ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన అంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సెప్టెంబర్ 25వ తేదీన ప్రకటించగా బయోపిక్‌ను అక్టోబర్ 15వ తేదీన విడుదల చేశారని అందులో పేర్కొన్నారు. దీనిపై ఈసీ స్పందిస్తూ ఈ సినిమా గత ఏడాది మేలోనే రిలీజ్ అయినందున ఉల్లంఘన కిందకు రాదంటూ స్పష్టత ఇచ్చింది. -
పెళ్లి కూతుళ్లకు ఉచితంగా డ్రస్సులు
ఏదో ఒకటి కట్టుకుని ఎలాగోలా పెళ్లి చేసుకునే నిరుపేద వధూవరులు ఈ దేశంలో కొల్లలు. అబ్బాయిలు సరే. అమ్మాయిలకు ఎన్ని కలలని. కనీసం పెళ్లినాడు మంచి పెళ్లికూతురి డ్రస్సు వేసుకోవాలని ఉండదా? దానికి కూడా వీలు లేకపోతే ఎంత బాధ? కేరళకు చెందిన సబిత ఈ బాధ గ్రహించింది. దేశంలోని దాతల నుంచి వారు ఉపయోగించిన పెళ్లి డ్రస్సులు సేకరించి కాబోయే పెళ్లికూతుళ్లకు ఉచితంగా ఇస్తోంది. అవి కట్టుకున్న ఆడపిల్లలు ఆనందబాష్పాలు రాలుస్తుంటే సబిత అదే పెద్ద ఆశీస్సుగా భావిస్తోంది. కేరళ కోస్తా టౌన్ అయిన కన్నూర్‌లో సముద్రపు అలలు ఎన్ని ఉంటాయో పేద ఆడపిల్లల కష్టాలూ అన్నే ఉంటాయి. వరుడు దొరకడం, ఆ వరుడికి చేయాల్సిన మర్యాదలకు డబ్బు దొరకడం, పెళ్లి ఖర్చు దొరకడం, అన్నింటికి మించి కనీసం మంచి పెళ్లి డ్రస్సు ఏర్పాటు చేసుకోవడం... నిరుపేద ఆడపిల్లలు నోరు తెరిచి ఏమీ అడగలేరు. మనసులో ఉంటుంది అంతే. ఆ మనసును గ్రహించింది సబిత. ప్రార్థిస్తున్న ద్రౌపదికి వస్త్రాలు బహూకరించాడు కృష్ణుడు. పెళ్లిబట్టలకు కూడా వీలు లేక మనసులోనే బాధపడుతున్న పెళ్లికూతుళ్లకు కొత్త బట్టలు ఇస్తోంది సబిత. అమ్మాయి మనసు కన్నూరులో ‘రెయిన్ బో’ పేరుతో ఒక బొటిక్ నడుపుతోంది సబిత తొమ్మిదేళ్లుగా. కొనుక్కోగలిగిన ఆడపిల్లలు ఆమె దగ్గరకు వచ్చి డిజైనర్ దుస్తులు, డిజైనర్ పెళ్లిబట్టలు కొనుక్కుని వెళ్లేవాళ్లు. కాని కొందరు ఆడపిల్లలు కేవలం చూడ్డానికి వచ్చేవారు. ఈ చూడ్డానికి వచ్చే ఆడపిల్లలు పెళ్లి పెట్టుకొని అలాంటి డ్రస్సులు కొనలేక కనీసం చూసన్నా పోదామని వచ్చేవారు. వారిని గమనించి తనకు వీలున్నప్పుడు కొన్ని డ్రస్సులు తయారు చేయించి సబిత ఇచ్చేది. కాని వారికి అంతగా సంతృప్తి కనిపించేది కాదు. ఎందుకంటే ఉచితంగా వస్తోంది కనుక ఇచ్చింది తీసుకోవాల్సి వచ్చేది. ఛాయిస్ ఉండేది కాదు. ‘నచ్చింది తీసుకున్నామన్న’ తృప్తి వారికి కావాల్సి వచ్చేది. కాని అందుకు బదులుగా ఏం చేయాలో సబితకు అర్థమయ్యేది కాదు. రెండు నెలల క్రితం ఒక అమ్మాయి మాత్రం తనకు పెళ్లి కుదిరిందని, పెళ్లి డ్రస్సు కోసం తండ్రి వాళ్ల కాళ్లూ వీళ్ల కాళ్లూ పట్టుకుంటున్నాడని చెప్పింది. అప్పుడు సబితకు వచ్చింది ‘ఉపయోగించిన పెళ్లిబట్టలను సేకరించాలనే’ ఆలోచన. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ‘పెళ్లికోసం మీరు మంచి డ్రస్సులు కొనుక్కుంటారు. కాని అవి ప్రత్యేకమైనవి కాబట్టి ఒకటి రెండుసార్లు ఉపయోగించి దాచుకుని ఉంటారు. అవి వృధాగా పడి ఉంటాయి. అలాంటి బట్టలు పేద వధువులకు ఉపయోగపడతాయి. మంచి కండిషన్లో ఉండి, డ్రైక్లీనింగ్ చేయించి ఉన్న పెళ్లి బట్టలను మాకు పంపండి. పేద ఆడపిల్లలకు ఇస్తాం’ అని సబిత ఇన్‌స్టాగ్రామ్‌లో, తన వాట్సప్ గ్రూప్‌లో రెండు నెలల క్రితం వీడియో పెట్టింది. అంతే. ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కన్నూర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతోమంది స్త్రీలు సబితకు ఫోన్లు చేశారు. తమ పెళ్లిబట్టలు ఇస్తామని చెప్పారు. వెంటనే సబిత వాటిని కలెక్ట్ చేయడానికి ఒక మనిషిని అపాయింట్ చేసింది. కొన్ని బట్టలు కొరియర్లో వచ్చాయి. ఇప్పటి వరకూ ఆమె 300 జతల పెళ్లి బట్టలు రిసీవ్ చేసుకుంది. వాటిలో ఒక్కోటి లక్ష రూపాయల డ్రస్సు కూడా ఉన్నాయి. కొందరు చెప్పులు, ఇమిటేషన్ జువెలరీ కూడా పంపారు. విడి షోరూమ్ సబిత తన షోరూమ్‌కు ఆనుకునే ఒక గదిని ఈ ఉచిత పెళ్లిడ్రస్సుల షోరూమ్‌గా మార్చింది. దీని గురించి తెలిసిన ఆడపిల్లలు వారు ఏ మతం వారైనా కాని వచ్చి ఉచితంగా తమకు నచ్చినది తీసుకుని వెళ్లవచ్చు. కాని వారికి త్వరలో పెళ్లి కాబోతున్నదని ఏదైనా ఆధారం (వెడ్డింగ్ కార్డ్, మత పెద్ద రాసిచ్చిన లేఖ) చూపించాలి. ఈ ఏర్పాటు గురించి కేరళ అంతా తెలిసి పోయింది. దూర ప్రాంతాల నుంచి డ్రస్సులు అడిగేవారు, డ్రస్సులు పంపుతామనే వారు పెరిగిపోయారు. దాంతో సబిత తన పరిచయస్తులు, బంధువుల ద్వారా ముఖ్యమైన టౌన్లలో వారి ఇళ్లలోనే ఒక గదిలో ఈ బట్టలను చేర్చే ఏర్పాటు చేసింది. ఫోన్ వస్తే దగ్గరి ఊర్లో ఉన్న ఉచిత బొటిక్కు రిఫర్ చేస్తుంది. ఆనందబాష్పాలు ‘ఒక అమ్మాయి ఈ ఉచిత డ్రస్సు కోసం వచ్చింది. దానిని తీసుకున్న వెంటనే ఒక్క నిమిషం కూడా ఆగకుండా పరిగెత్తింది. తర్వాత ఫోన్ చేసి చెప్పింది... నాకు ఏడుపు వచ్చేసింది.. అది కనపడకూడదని పరిగెత్తాను అని. మరొకమ్మాయి.. అక్కా... దేవుడు నా ప్రార్థనను నీ ద్వారా తీర్చాడు అని చెప్పింది. ఇవన్నీ నాకు సంతోషాన్ని ఇచ్చాయి. నేను ఇదంతా ప్రచారానికి చేయడం లేదు. నేను ఆ ఆడపిల్లల ఫొటోలు తీయడం కూడా చేయను. అందుకే వారు అసౌకర్యం లేకుండా నా దగ్గరికి వస్తున్నారు’ అంది సబిత. ఆమె భర్త షార్జాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను ఆమె చేస్తున్న పనికి ఫుల్ సపోర్ట్ అందిస్తున్నాడు. మంచివాళ్లు ఉన్నారు లోకంలో. – సాక్షి ఫ్యామిలీ -
చేపా.. చేపా ఎందుకురాలేదు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో జలకళ ఉట్టిపడుతోంది. జలాశయాలు, చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నా యి. ఇటువంటి పరిస్థితుల్లో చేప పిల్లలను జలాశయాల్లోకి విడుదల చేయడంలో మత్స్యశాఖ విఫలమైందన్న ఆరోపణలున్నాయి. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో అసంతృప్తి వ్యక్తం చేశారంటే నిర్లక్ష్యం ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. నీరు సమృద్ధిగా ఉన్న జలాశయా ల్లోనూ కేవలం లక్ష్యంలో 59.38 శాతం మాత్రమే చేప పిల్లలను వదలడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది 22,203 జలాశయాల్లో 82.28 కోట్ల చేప పిల్లలను వదలాలని మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టు కుంది. 12,778 జలాశయాల్లోకి మాత్రమే నీరు వచ్చిందని, అందులో 55.60 లక్షల చేప పిల్లలు అవసరమని నిర్ధారించారు. ఆ ప్రకారం చూసినా ఇప్పటివరకు కేవలం 9,283 జలాశయాల్లో 33.02 కోట్ల చేప పిల్లలను మాత్రమే విడుదల చేసినట్లు మత్స్యశాఖ నివేదిక వెల్లడించింది. అంటే కేవలం 59.38 శాతం మాత్రమే విడుదల చేశారు. సూర్యాపేటలో 11.44 శాతమే.. ప్రభుత్వం మూడేళ్లుగా మత్స్యకార సొసైటీల ద్వారా ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని మొదలుపెట్టింది. 2016–17లో 27.85 కోట్ల చేప పిల్లలను, 2017–18లో 51 కోట్లు, 2018–19లో 49.15 కోట్ల చేప పిల్లలను వదిలిపెట్టింది. ఈసారి భారీ వర్షాలు కురిసినా లక్ష్యాన్ని చేరుకోవ డంలో అధికారులు తంటాలు పడుతున్నా రు. సూర్యాపేట జిల్లాలో 3.14 కోట్ల చేపపిల్లలను వదలాలని నిర్ణయించ గా, 36 లక్షల చేప పిల్లలను విడుదల చేయడంపై విమర్శలొచ్చాయి. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 94.49 శాతం, ఖమ్మం జిల్లాలో 94.07%, వరంగల్ రూరల్ జిల్లాలో 93.66 శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 89.14 శాతం, వరంగల్ అర్బన్ జిల్లాలో 88.99 శాతం చేప పిల్లలను వదిలారు. చాలా జలాశయాల్లో వరదల కారణంగా నీరు బయటకు పోవడంతో అప్పటికే వేసిన చేప పిల్లలు కూడా వెళ్లిపోయాయని సొసైటీల ప్రతినిధులు చెబుతున్నారు. -
ఈ పేపరు.. ఆ పేపరు
తెల్లారే ఇంటి ముందు మళ్లీ చప్పుడైంది! రోజూ అయ్యే చప్పుడు కాదు అది! ఎలక్షన్ నోటి ఫికేషన్ వచ్చినప్పట్నుంచీ అవుతున్న చప్పుడు. తలుపు తెరిచి చూశాడు ఓటరు. ఎవరో ఇద్దరు.. కళ్లకు గంతలున్నాయి.. కాళ్లకు చెడ్డీలున్నాయి.. గళ్ల ‘టి’ షర్ట్లున్నాయి.. వెనక్కి తిరిగి చూస్తూ పరుగెడుతున్నారు! ఇద్దరి టీ షర్ట్స్ వెనుక ‘ఆర్’ అనే అక్షరాలున్నాయి. ఆర్ అంటే ఏంటో అనుకున్నాడు ఓటరు. ‘చూశాడా మనల్ని’ అంటున్నాడు ఒక ఆర్. ‘చూసినట్లే ఉన్నాడు’ అన్నాడు ఇంకో ఆర్. ఓటరుకు డౌట్ కొట్టింది. చెడ్డీ గ్యాంగ్ చీకట్లో కదా చోరీకి వస్తుంది.. అనుకున్నాడు. ‘మరైతే వీళ్లెవరూ తెల్లారే..’ అనుకున్నాడు. చప్పుడు ఎందుకైందా అని చూశాడు ఓటరు. వాకిట్లో ‘ఈ’పేపర్, ‘ఆ’పేపర్ పడి ఉన్నాయి. ఓటరుకు రోజూ వచ్చే పేపర్.. ముందే వచ్చేసింది. మరి ‘ఈ’ పేపర్, ‘ఆ’ పేపర్ ఎవరు వేసినట్లు? ఎందుకు వేసినట్లు? ఇది ఆ ఇద్దరు దొంగ డాగ్‌ల పనే అని ఓటరుకు అర్థమైంది. అడక్కుండానే పేపర్ వేసి వెళ్లారంటే అబద్ధాలేవో రాసి పంచుతున్నారనే! ‘ఈ’పేపరు, ‘ఆ’పేపరూ ముందేసుకున్నాడు ఓటరు. ఏది ఏ పేపరో అర్థం కాలేదు. పారిపోయిన ఆ ఇద్దరూ ఒకేలా ఉన్నారు. వాళ్లు పడేసిపోయిన రెండు పేపర్లూ ఒకేలా ఉన్నాయి! ‘దొంగలు అంతేకదా ఒకేలా ఉంటారు’ అనుకున్నాడు ఓటరు. రెండు పేపర్లలో టాప్‌లో జగన్మోహన్రెడ్డి ఫొటోలున్నాయి! ఆశ్చర్యపోయాడు ఓటరు. జగన్ పైకి రావడం ఓర్వలేని పేపర్లు, జగన్‌పై అబద్ధాలు మాత్రమే రాసే పేపర్లు, జగన్‌కి అంతా జై కొడుతుంటే బాబు కొంప మునుగుతుందేమోనని కంగారు పడిపోయి పాచి అబద్ధాలనే మళ్లీ పోగేసి ప్రింట్ చేసే పేపర్లు, చంద్రబాబు చెప్పకుండా, చంద్రబాబుకు చెప్పకుండా చిన్న కామా, ఫుల్స్టాప్ పెట్టని పేపర్లు.. జగన్ ఫొటో వెయ్యడం ఏంటా అని చూశాడు ఓటరు. ఫొటోలో జగన్ ఎంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. ఓటరుకు భరోసా ఇస్తున్నట్లున్నాడు. ‘నేనున్నాను’ అన్నట్లున్నాడు. ‘నేనొస్తున్నాను’ అన్నట్లు ఉన్నాడు. ఆయన ఫొటో పెట్టి, చుట్టూ ఏవో రాశాయి ‘ఈ’పేపరు, ‘ఆ’ పేపరు. బాబు నిన్ననే మళ్లీ ఒక కొండను తవ్వాడు అని ‘ఈ’పేపర్ రాసింది! ‘అవునవును ఆయన కొండను తవ్వుతున్నప్పుడు మేమూ పక్కనే ఉన్నాం’ అని ‘ఆ’ పేపర్ రాసింది! చంద్రబాబు కొండను తవ్వి పాత పేపర్లు పట్టాడని ఓటరు కనిపెట్టేశాడు. కొండను తవ్వి పాత పేపర్లు పట్టింది చంద్రబాబు అయితే చంద్రబాబు ఫొటో పెట్టాలి గానీ, జగన్ ఫొటో పెట్టారేమిటి అని ఆలోచించాడు ఓటరు. జగన్ ఫొటో పెడితే కానీ చంద్రబాబు గురించి ఎవరూ చదవరని ‘ఈ’పేపర్, ‘ఆ’పేపర్ అలా చేశాయని అర్థం చేసుకున్నాడు. ‘ఆ’ పేపరైతే పాపం, జగన్ పేరుకున్న ఇమేజ్‌నే కాదు, జగన్ ఫొటోకున్న ఇమేజ్‌ని కూడా డేమేజ్ చేయడానికి ట్రై చేసింది. జగన్ ఫొటోలో రంగులు మార్చితే జగన్‌కు ఓటేసేవాళ్లు, జగన్‌కు ఓటేయాలనుకున్న వాళ్లు మనసు మార్చుకుంటారని ఆశ పడినట్లుంది. ‘ఈ’ పేపర్నీ, ‘ఆ’ పేపర్ని విసిరికొట్టాడు ఓటరు. పెద్ద కర్రొకటి తీసుకుని వాకిట్లో సిద్ధంగా పెట్టుకున్నాడు. దొంగ డాగ్స్ రేపు ఉదయాన్నే మళ్లీ వస్తాయి కదా.. అప్పుడు చెబుతాను అనుకున్నాడు.–మాధవ్ -
తవ్వుకో.. దండుకో
రాష్ట్రంలోని ఇసుక రేవులు టీడీపీ నేతల దోపిడీకి కేంద్రాలుగా మారాయి. ‘తవ్వుకో.. దండుకో’ అనే చందంగా ఇసుక దందా సాగిస్తున్నారు. నదులు, ఉపనదులు, వాగులు, వంకలు ఇలా వేటిని వదలకుండా అక్రమ ఇసుకతవ్వకాలతో వేల కోట్లు దోచుకుంటున్నారు. ఇసుకకోసం తీస్తున్న భారీ గోతులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. వర్షాకాలంలో ఈ గోతుల్లో నీరు నిండుతోంది. ఈ విషయం తెలియక సరదాగాఈతకు వెళ్లినచిన్నారులు, సాధారణ ప్రజలు ఈ అగాథాల్లో చిక్కుకుని మృత్యువాత పడుతున్నారు. మరోవైపు అడ్డగోలు తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. సాగునీటికి, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా ఇసుకాసురుల తీరులో ఇసుమంతైనా మార్పు రావడం లేదు. వీరికి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండటంతో అధికారులుకూడా మిన్నకుండిపోతున్నారు. నాలుగున్నరేళ్లలో ఇసుక దందా ద్వారా అధికార పార్టీ నేతలు దండుకున్న మొత్తం రూ.10 వేల కోట్ల పైమాటే. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక రవాణా పేరుతో టీడీపీ నేతలు సాగిస్తున్న దందా మూడు ట్రాక్టర్లు.. ఆరు లారీలు చందంగా వర్ధిల్లుతోంది. 2014 అధికారంలోకి వచ్చాక తొలి రెండేళ్లు టీడీపీ నేతలు డ్వాక్రా సంఘాల ముసుగులో ఉండి ఇసుక అమ్మకాలు సాగించి రూ.4,400 కోట్లు దోచుకున్నారు. తర్వాత ప్రభుత్వం ఉచిత ఇసుకను తెరపైకి తెచ్చింది. పేరుకు ఉచితమే అయినా ఆచరణలో దీనికి భిన్నం. అన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు ఇసుక రేవులను సొంత జాగీర్లుగా మార్చుకుని నచ్చిన రేటుకు ఇసుకను అమ్ముకోవడం ద్వారా గత రెండున్నరేళ్లలో రూ.5,600 కోట్లు దోచేశారు. ఇసుక కోసం ఎవరైనా క్వారీ దగ్గరకు వాహనాన్ని తీసుకెళ్లాలంటే టీడీపీ నేతలకు కప్పం కట్టాల్సిందే. దీనికి రహదారి నిర్వహణ ఖర్చు అనే ముద్దు పేరు పెట్టారు. డబ్బు ఇవ్వకపోతే వాహనాలను అడ్డుకుంటారు. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ ఇసుక కావాల్సిన వారు టీడీపీ నేతలకే చెబుతున్నారు. దీంతో వారు రవాణా, లోడింగ్ ఛార్జీల పేరుతో నచ్చిన రేట్లకు ఇసుకను విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం బహిరంగంగానే సాగుతున్నా తెరవెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉన్నందున అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. నదులు, వాగుల్లో విధ్వంసం ఇటు శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నుంచి అటు రాయలసీమలోని తుంగభద్ర, పెన్నా వరకూ అన్ని నదులు, వాగులూ అడ్డగోలు ఇసుక తవ్వకాలతో ధ్వంసమయ్యాయి. మీటరు లోతు మించి ఇసుక తవ్వరాదనే నిబంధనను తుంగలో తొక్కి నాలుగు మీటర్ల లోతు వరకూ ప్రొక్లెయిన్లతో, భారీ యంత్రాలతో ఇసుకను తోడేసి బావులను తలపించేలా మార్చేశారు. ఈత కోసం వెళ్లిన చిన్నారులు ఈ గుంతల్లో చిక్కుకుని ప్రాణాలు సైతం కోల్పోయారు. కృష్ణా, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో చాలామందిని ఇసుక గోతులు బలి తీసుకున్నాయి. నిబంధనలను గాలికొదిలేసి.. క్వారీల్లో మనుషులతోనే ఇసుక తవ్వకాలు సాగించాలని, ప్రొక్లెయిన్లు లాంటి యంత్రాలు వినియోగించరాదని నిబంధనలు ఉన్నా అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదు. క్వారీల్లోకి లారీలను తీసుకెళ్లరాదని, ట్రాక్టర్లతోనే ఇసుకను తీసుకెళ్లాలనే నిబంధన కూడా ఉంది. వీటిని కాలరాస్తూ ప్రొక్లెయిన్లతో చాలా లోతుగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో ‘రేలా’ అనే స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ తీవ్రంగా తప్పుబట్టింది. అంతేకాకుండా తనిఖీల కోసం బృందాన్ని పంపినప్పుడు సాక్షాత్తూ ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఇంటిపక్కనే డ్రెడ్జింగ్ యంత్రాలను దాచిపెట్టారు. ట్రిబ్యునల్ బృందం వెళ్లిపోగానే మళ్లీ యథాప్రకారం అక్రమ తవ్వకాలు సాగడం గమనార్హం. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా తదితర నదులు, వాగులపై 460పైగా అధికారిక, అనధికారిక ఇసుక రేవులుండగా వాటిలో 83 పెద్దవి ఉన్నాయి. వీటిలోనే కాకుండా ఎక్కడ ఉంటే అక్కడ ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నారు. వంతెనలకు వంద మీటర్ల దూరం వరకూ ఇసుక తీయరాదనే నిబంధన ఉన్నా దీన్ని కూడా కాలరాస్తూ తవ్వేస్తుండటంతో వాటి భద్రత గాలిలో దీపం చందంగా మారుతోంది. భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం అడ్డగోలుగా సాగిస్తున్న ఇసుక తవ్వకాల ప్రభావం భూగర్భ జలాలపై పడింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూగర్భ జలమట్టం రోజురోజుకూ పాతాళానికి దిగిపోతోంది. ఏడాది కిత్రం (2018, జనవరి 12తో)తో పోల్చితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటున 6.72 అడుగుల మేర భూగర్భ జలమట్టం కిందకు పడిపోయింది. ఇదేకాలంలో రాయలసీమలో సగటున 20.27 అడుగుల మేర నీటి జాడ పాతాళానికి దిగిపోయింది. ఇక జిల్లాలవారీగా చిత్తూరులో 32.87, అనంతపురంలో 17.78, ప్రకాశంలో 14.43 అడుగుల మేర భూగర్భ జలమట్టం కిందకు పోయింది. ఈ గణాంకాలు ప్రమాద ఘంటికలకు సంకేతాలని భూగర్భ జల, పర్యావరణ శాఖల నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చలికాలంలోనే వేసవిని తలపించేలా భూగర్భ జలమట్టం పాతాళానికి చేరడానికి ఇసుక తవ్వకాలే కారణమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. జిల్లాల వారీగా ఇసుక దోపిడీ ఇలా.. కృష్ణా జిల్లాలో ఒక మంత్రి, గూండాగా పేరొందిన ఒక టీడీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లో ఇసుక దందా సాగుతోంది. బహిరంగంగా పట్టపగలే డ్రెడ్జర్లతో తోడేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు నిత్యం ఇసుకను పెద్ద పెద్ద లారీల్లో తరలించి కోట్లు దండుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ఓ మంత్రితోపాటు, నలుగురు సీనియర్ ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ దందాను నడిపిస్తున్నారు. రేపల్లె నియోజకవర్గంలో పెనుమూడి, రావిఅనంతవరం రేవుల్లో ఒక టీడీపీ ఎమ్మెల్యే ఆదేశాలతో అనుచరులు రెచ్చిపోతున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో మరో టీడీపీ ఎమ్మెల్యే ఇసుక రేవులను జాగీర్లుగా మార్చుకున్నారు. ‘నేనే మంత్రి.. నేనే రాజు’ అని చెప్పుకునే ఒక మంత్రి శ్రీకాకుళం జిల్లాలో హవా సాగిస్తున్నారు. ఆయనతోపాటు మంత్రి హోదా గల మరో ఎమ్మెల్యే గుంటూరు జిల్లా టీడీపీ నేతలతో కలిసి ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను తెరవెనుక ఉండి నడిపిస్తున్నారు. పాలకొండ నియోజకవర్గంలో నాగావళి, వంశధార నదీ తీరాల నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. ఆంధ్రా–ఒడిశా పరిధిలో వంశధార నదిలో భారీగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని స్వర్ణముఖి, కాళింగి, పెన్నా నదుల నుంచి చెన్నైకి ఇసుక తరలిపోతోంది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు నుంచి కర్ణాటక, తమిళనాడుకు భారీ ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు పడిపోయి శ్రీకాళహస్తికి నీరందించే బావులు ఎండిపోయాయి. పూతలపట్టు, చిత్తూరు రూరల్ మండలం బీఎన్ఆర్ పేటలో ఇష్టానుసారం తవ్వకాలు సాగుతున్నాయి. వైఎస్సార్ జిల్లాలో ఏ నదినీ, వాగును, వంకనూ వదల్లేదు. కొండాపురం నుంచి ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి వద్ద ఇసుక క్వారీలో ఒక టీడీపీ ఎంపీ సోదరుల అండదండలతో దందా సాగుతోంది. పెన్నా, పాపాఘ్ని, చెయ్యేరు, చిత్రావతి నదుల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తరలించడం ద్వారా టీడీపీ నేతలు కోట్లు కొల్లగొడుతున్నారు. తుంగభద్ర నదిలో రహదారి కర్నూలు జిల్లాలో టీడీపీ ముఖ్య నేతల అనుచరులు తుంగభద్ర, హంద్రీ నదిలో లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తరలించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అధికార పార్టీ ముఖ్య నేత తనయుడి అనుచరులు గోరంట్ల, ఎర్రగుడి, మన్నెకుంట గ్రామాల పరిసర ప్రాంతాల్లో హంద్రీ నదిలో ఇసుకను రాత్రి వేళల్లో లారీలకు లోడ్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. తుంగభద్ర నది మధ్యలో ఇసుక అక్రమ రవాణా కోసమే కిలోమీటర్ల కొద్దీ రహదారి నిర్మించడం గమనార్హం. దీన్ని హైకోర్టు తీవ్రంగా తప్పబట్టడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సర్కారు అండ వల్లే రహదారి వేయగలిగారంటూ కోర్టు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. రీచ్‌లోకి వెళ్లాలంటే కప్పం కట్టాల్సిందే రాష్ట్రంలో మొత్తం 460 ఇసుక రేవులు ఉండగా ప్రజలు సొంత అవసరాలకు ఎక్కడ నుంచైనా ట్రాక్టర్లలో ఇసుక ఉచితంగా తీసుకెళ్లవచ్చని సర్కారు ఉత్తర్వులు ఉన్నాయి. అయితే ఎక్కడా సొంతంగా ట్రాక్టరు తీసుకెళ్లి ఇసుక నింపుకోవాలంటే ఆయా ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలకు కప్పం కట్టాల్సిందే. ‘రీచ్‌లోకి దారి మేమే నిర్మించాం. అందువల్ల ట్రాక్టరు వెళ్లాలంటే డబ్బు ఇవ్వాల్సిందే’ అంటూ మాఫియా గ్యాంగులు బరితెగించి వసూళ్లు సాగిస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. ప్రైవేటు వ్యక్తులు రేవుల్లోకి లారీలను తీసుకెళ్లరాదు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం లాంటి ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే లారీలను తీసుకెళ్లవచ్చని ఉత్తర్వులు ఉన్నాయి. అయితే ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. కాగితాల్లోనే ఉచితం డ్వాక్రా సంఘాలను తప్పించి ఉచిత ఇసుక విధానాన్ని తెరపైకి తేవడం ద్వారా సర్కారు టీడీపీ నేతల దోపిడీకి మరిన్ని ద్వారాలు బార్లా తెరిచింది. 2016, మార్చి 4న ఉచిత ఇసుక విధానానికి సంబంధించి మార్గదర్శకాలతో మెమో నంబర్ 3065 జారీ చేసింది. ఆ వెంటనే రాష్ట్రంలోని 460 అధికారిక, అనధికారిక ఇసుక రీచ్‌ల్లో టీడీపీ నేతలు పాగా వేశారు. తమ జాగీర్లన్నట్లుగా అడ్డగోలుగా తవ్వి అమ్ముకుంటున్నారు. రేవుల్లోకి ఇతరుల వాహనాలను అనుమతించడం లేదు. ఉచిత ఇసుక అమల్లోకి వచ్చినప్పటి నుంచి గత నెలాఖరు (2018, డిసెంబర్) వరకూ చోటా, మోటా నేతలు దండుకున్న మొత్తం పోనూ టీడీపీ పెద్దలు ఇసుక ద్వారా దోచుకున్న మొత్తం రూ.5600 కోట్లు పైమాటే. ఇసుక మాఫియా ఆగడాలను విన్నవించడానికి వెళ్లిన 15 మందిని ఇసుక మాఫియా గ్యాంగులకు చెందిన వాహనాలు గుద్ది చంపేశాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులోని ఏర్పేడు ఈ దుర్మార్గానికి వేదిక కావడం గమనార్హం. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా వాస్తవమే : మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా వాస్తవమేనని, రేవుల్లో ఇసుక తవ్వకాలకు యంత్రాలను వినియోగిస్తున్న సంగతి కూడా నిజమేనని మంత్రివర్గ ఉప సంఘం అంగీకరించడం గమనార్హం. ఇసుక లారీలు రాష్ట్ర సరిహద్దులు దాటిపోతున్నా అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందని, శాఖల మధ్య సమన్వయం లేకపోవడం దీనికి కారణమని ప్రకటించింది. ఇసుక విధానంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కేఈ కృష్ణమూర్తి (రెవెన్యూ), చినరాజప్ప (హోం), సుజయ కృష్ణ రంగారావు (భూగర్భ గనులు) ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం మీడియా సమావేశంలోనే ఈ వివరాలు వెల్లడించారు. ప్రతినెలా మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఇసుక విధానాన్ని సమీక్షించాలని, దీనికి నీటిపారుదల శాఖను కూడా ఆహ్వానించాలని నిర్ణయించినా సమావేశాలు జరిగిన దాఖలాలు మాత్రం లేవు. 25 అడుగులు తవ్వితే నీళ్లు పడేవి మా గ్రామంలో టీడీపీ నేతల విచ్చలవిడి ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గతంలో నీటి పంపులు, బోర్ల కోసం భూమిలో 25 అడుగులు తవ్వితే నీళ్లు పడేవి. ఇప్పుడు 120 అడుగులు తవ్వినా నీరు పడటం లేదు. కృష్ణానదీ తీరం వెంట ఉన్న మా గ్రామంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉండటం నిజంగా కలచివేస్తోంది. - ఆత్మకూరి నాగసురేశ్. ఊరు.. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం పెసర్లంక. గోతుల్లో పడి మరణించారు.. నాగావళి నదిలో టీడీపీ నేతలు అక్రమంగా ఇసుక తవ్వుతుండటంతో భారీ గోతులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల వర్షాకాలంలో నది నిండుగా ప్రవహించినపుడు.. పలువురు ఈత కోసం దిగి తెలియక మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి సాగు, తాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. - ఎస్.జగదీశ్. ఊరు.. శ్రీకాకుళం. -
సర్కార్ బడిలోనే సక్కనైన చదువు
చేవెళ్ల : సర్కారు బడుల్లోనే విద్యార్థులకు సక్కనైన చదువులు దొరుకుతుందని విద్యావేత్త కె.జయదేవ్ అన్నారు. చేవెళ్ల మండలంలోని గుండాల గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు శనివారం సన్‌పరివార్ వారి మెతుకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్‌పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశారు. ఫౌండేషన్ మార్కెటింగ్ డైరెక్టర్ గోపాల్‌రెడ్డి, సభ్యులతో కలిసి విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జయదేవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకుంటే ప్రైవేటు పాఠశాలలు కనిపించవన్నారు. ఇప్పటి వరకు సమాజంలో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వారంతా ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చినవారేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ సీఈఓ రవీందర్, డైరెక్టర్ రాజేందర్, రవికుమార్, శంకర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదుగాలని సూచించారు. పాఠశాలలను గ్రామస్తులంతా కలిసి బాగు చేసుకుంటే విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించినట్లు అవుతుందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఏడాదికి కట్టే ఫీజులో ఒక శాతం డబ్బుతో ప్రభుత్వ పాఠశాలను బాగు చేసుకుంటే కార్పొరేట్ పాఠశాలలను మించి పోతాయన్నారు. దీనికి గ్రామస్తులు కృషి అవసరమన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ముజీబ్, సర్పంచ్ పుష్పకుమారిగణేశ్, పీఏసీఎస్ చైర్మన్ నక్క బుచ్చిరెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ యాదగిరి, సన్‌పరివార్ ఫీల్డ్ అధికారులు జంగారెడ్డి, శేఖర్‌రెడ్డి, సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి విరాళాలు పాఠశాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని విద్యావేత్త జయదేవ్ సూచించడంతో గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి కంప్యూటర్ను ఇప్పిస్తానని, గ్రామానికి చెందిన మరో వ్యక్తి జె. రంగారెడ్డి రూ. 5వేలు, గ్రామంలో మిషన్‌భగీరథ పైపులైన్ పనుల కాంట్రాక్టర్ కరుణాకర్‌రెడ్డి రూ. 5వేలు, గోపాల్‌రెడ్డి రూ. 50వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే శనివారం గ్రామంలో మెతుకు ఫౌండేషన్ సభ్యులంతా కలిసి వచ్చి గ్రామంలో పాఠశాల అభివృద్ధి కోసం గ్రామంలో దాతల ద్వారా చందాలు సేకరించే కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. -
మిరపకాయలను ఉచితంగా పంచిన రైతు
కలిగిరి: కష్టపడి సాగు చేసిన పచ్చిమిర్చికి కనీస ధర పలకకపోవడంతో ఆవేదన చెందిన రైతు, వ్యాపారులకు అమ్మడం ఇష్టం లేక శుక్రవారం ప్రజలకు ఉచితంగా పంచిపెట్టాడు. పోలంపాడు గ్రామానికి చెందిన కల్లూరి చంద్రమౌళి ఎకరా పొలంలో పచ్చిమిరప సాగు చేస్తున్నాడు. పచ్చిమిరపకాయలను బస్తా కోసుకొని అమ్మడానికి మోటర్బైకుపై కలిగిరికి వచ్చాడు. వ్యాపారులు కిలో రూ. 4కు మిరపకాయలు తీసుకుంటామన్నారు. ఆ ధరకు అమ్మితే కనీసం కోత కూలీలు కూడా రావని రైతు ఆవేదన చెందాడు. వ్యాపారులకు తక్కువ ధరకు పచ్చిమిరపకాయలను ఇవ్వడానికి ఇష్టం లేక పోలిస్‌స్టేషన్ సమీపంలోకి వచ్చాడు. అక్కడ ఉన్న ప్రజలకు బస్తాలోని పచ్చిమిరపకాయలను ఉచితంగా అందించాడు. రైతు చంద్రమౌళి కూరగాయలు పండించే రైతులకు చెల్లించే ధరలకు, మార్కెట్లో వ్యాపారులు అమ్మే ధరలకు పొంతన ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. -
మైక్రో ఏటీఎంతో చిల్లర కష్టాలకు చెక్
-
రేపటి నుంచి చేప పిల్లల పంపిణీ: తలసాని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ నుంచి 15 వరకు చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. శనివారం మత్స్యశాఖ అధికారులు, సహకార సంఘాల సభ్యులతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 8 పెద్ద, 17 మధ్య స్థాయి, 53 చిన్న రిజర్వాయర్లు, 35,031 చెరువులు ఉన్నాయని.. వాటిలో 4,553 చెరువులు, రిజర్వాయర్లలో 48 కోట్ల వ్యయంతో 34.63 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. -
కార్మికుల పిల్లలకు ల్యాప్‌టాప్!
సాక్షి, ముంబై: కార్మికుల పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. కార్మికుల పిల్లల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు, ఇళ్లల్లో పనిచేసేవారి పిల్లలకు వీటిని పంపిణీ చేయనున్నారు. ‘మహారాష్ట్ర డొమెస్టిక్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్’లో రిజిస్టర్ చేసుకున్న వారికి వీటిని అందజేయనున్నట్లు అధికారి వెల్లడించారు. కాగా, ట్యాబ్లెట్లను 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న వారికి అందజేస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా స్కూల్ సెకండరీ సర్టిఫికెట్ (ఎస్ఎస్సీ)లో పాస్ అయిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేయనున్నారు. వీటి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.7.86 కోట్లను వెచ్చించనున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. ఈ పథకం ద్వారా దాదాపు 5,700 మంది పిల్లలు లబ్ధిపొందనున్నారు. ఈ సందర్భంగా బోర్డు అధికారులు మాట్లాడుతూ..‘సెకండరీ సెక్షన్లో 4,077 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1,672 మంది ఎస్ఎస్సీ పరీక్షలో పాస్ అయ్యారు. ఈ ఏడాది నుంచే ఎలక్ట్రానిక్ సామగ్రిని పంపిణి చేయాలని నిశ్చయించాం. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లను కొనుగోలు చేయడానికి త్వరలో ఈ-టెండర్లను ఆహ్వానిస్తున్నాం..’ అని తెలిపారు. ట్యాబ్లెట్ల ధర రూ.7,000 ఉండగా ల్యాప్‌టాప్‌ల వెల రూ.30 వేల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో మొత్తం కలిపి రూ.7.86 కోట్లు అవనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పిల్లలకు ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్లను అందజేయడం ప్రశంసించాల్సిన విషయం అయినప్పటికీ వారికి శిక్షణ ఎవరిస్తారని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) జిల్లా అధ్యక్షుడు ఏక్నాథ్ మానే ప్రశ్నించారు. అంతేకాకుండా ఇంటర్నెట్కు అయ్యే ఖర్చును ఎవరు భరిస్తారని తెలిపారు. ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు అంతగా ఉపయోగానికి రావన్నారు. కాగా ‘డొమెస్టిక్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్’ కార్యదర్శి మధుకర్ గైక్వాడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2.38 లక్షల మంది డొమెస్టిక్ వర్కర్లు రిజిస్టర్ చేసుకున్నారన్నారు. నగరంలో వీరి సంఖ్య 20 వేలకు ఉందన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం పొందాలనుకునే విద్యార్థులకు తాము కూడా సహకరిస్తున్నామన్నారు. ఈ ఏడాదిలోనే వీటిని పంపిణీ చేస్తారని, అయితే ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఇదిలా వుండగా డొమస్టిక్ వర్కర్లు స్కూల్ ద్వారా పొందిన బోనాఫైడ్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. కాగా ఒక్కరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబానికి ట్యాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ ఇందులో ఏదో ఒక్కదానినిమాత్రమే అందజేయనున్నట్లు గైక్వాడ్ స్పష్టం చేశారు.