
తెల్లారే ఇంటి ముందు మళ్లీ చప్పుడైంది! రోజూ అయ్యే చప్పుడు కాదు అది!
ఎలక్షన్ నోటి ఫికేషన్ వచ్చినప్పట్నుంచీ అవుతున్న చప్పుడు. తలుపు తెరిచి చూశాడు ఓటరు. ఎవరో ఇద్దరు.. కళ్లకు గంతలున్నాయి.. కాళ్లకు చెడ్డీలున్నాయి.. గళ్ల ‘టి’ షర్ట్‌లున్నాయి.. వెనక్కి తిరిగి చూస్తూ పరుగెడుతున్నారు! ఇద్దరి టీ షర్ట్స్ వెనుక ‘ఆర్’ అనే అక్షరాలున్నాయి. ఆర్ అంటే ఏంటో అనుకున్నాడు ఓటరు. ‘చూశాడా మనల్ని’ అంటున్నాడు ఒక ఆర్. ‘చూసినట్లే ఉన్నాడు’ అన్నాడు ఇంకో ఆర్. ఓటరుకు డౌట్ కొట్టింది. చెడ్డీ గ్యాంగ్ చీకట్లో కదా చోరీకి వస్తుంది.. అనుకున్నాడు. ‘మరైతే వీళ్లెవరూ తెల్లారే..’ అనుకున్నాడు.
చప్పుడు ఎందుకైందా అని చూశాడు ఓటరు. వాకిట్లో ‘ఈ’పేపర్, ‘ఆ’పేపర్ పడి ఉన్నాయి. ఓటరుకు రోజూ వచ్చే పేపర్.. ముందే వచ్చేసింది. మరి ‘ఈ’ పేపర్, ‘ఆ’ పేపర్ ఎవరు వేసినట్లు? ఎందుకు వేసినట్లు? ఇది ఆ ఇద్దరు దొంగ డాగ్‌ల పనే అని ఓటరుకు అర్థమైంది. అడక్కుండానే పేపర్ వేసి వెళ్లారంటే అబద్ధాలేవో రాసి పంచుతున్నారనే! ‘ఈ’పేపరు, ‘ఆ’పేపరూ ముందేసుకున్నాడు ఓటరు. ఏది ఏ పేపరో అర్థం కాలేదు. పారిపోయిన ఆ ఇద్దరూ ఒకేలా ఉన్నారు. వాళ్లు పడేసిపోయిన రెండు పేపర్లూ ఒకేలా ఉన్నాయి! ‘దొంగలు అంతేకదా ఒకేలా ఉంటారు’ అనుకున్నాడు ఓటరు. రెండు పేపర్లలో టాప్‌లో జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలున్నాయి! ఆశ్చర్యపోయాడు ఓటరు. జగన్ పైకి రావడం ఓర్వలేని పేపర్‌లు, జగన్‌పై అబద్ధాలు మాత్రమే రాసే పేపర్‌లు, జగన్‌కి అంతా జై కొడుతుంటే బాబు కొంప మునుగుతుందేమోనని కంగారు పడిపోయి పాచి అబద్ధాలనే మళ్లీ పోగేసి ప్రింట్ చేసే పేపర్లు, చంద్రబాబు చెప్పకుండా, చంద్రబాబుకు చెప్పకుండా చిన్న కామా, ఫుల్‌స్టాప్ పెట్టని పేపర్లు.. జగన్ ఫొటో వెయ్యడం ఏంటా అని చూశాడు ఓటరు.
ఫొటోలో జగన్ ఎంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. ఓటరుకు భరోసా ఇస్తున్నట్లున్నాడు. ‘నేనున్నాను’ అన్నట్లున్నాడు. ‘నేనొస్తున్నాను’ అన్నట్లు ఉన్నాడు. ఆయన ఫొటో పెట్టి, చుట్టూ ఏవో రాశాయి ‘ఈ’పేపరు, ‘ఆ’ పేపరు. బాబు నిన్ననే మళ్లీ ఒక కొండను తవ్వాడు అని ‘ఈ’పేపర్ రాసింది! ‘అవునవును ఆయన కొండను తవ్వుతున్నప్పుడు మేమూ పక్కనే ఉన్నాం’ అని ‘ఆ’ పేపర్ రాసింది!
చంద్రబాబు కొండను తవ్వి పాత పేపర్లు పట్టాడని ఓటరు కనిపెట్టేశాడు.
కొండను తవ్వి పాత పేపర్లు పట్టింది చంద్రబాబు అయితే చంద్రబాబు ఫొటో పెట్టాలి గానీ, జగన్ ఫొటో పెట్టారేమిటి అని ఆలోచించాడు ఓటరు. జగన్ ఫొటో పెడితే కానీ చంద్రబాబు గురించి ఎవరూ చదవరని ‘ఈ’పేపర్, ‘ఆ’పేపర్ అలా చేశాయని అర్థం చేసుకున్నాడు. ‘ఆ’ పేపరైతే పాపం, జగన్ పేరుకున్న ఇమేజ్‌నే కాదు, జగన్ ఫొటోకున్న ఇమేజ్‌ని కూడా డేమేజ్ చేయడానికి ట్రై చేసింది. జగన్ ఫొటోలో రంగులు మార్చితే జగన్‌కు ఓటేసేవాళ్లు, జగన్‌కు ఓటేయాలనుకున్న వాళ్లు మనసు మార్చుకుంటారని ఆశ పడినట్లుంది.
‘ఈ’ పేపర్‌నీ, ‘ఆ’ పేపర్‌ని విసిరికొట్టాడు ఓటరు. పెద్ద కర్రొకటి తీసుకుని వాకిట్లో సిద్ధంగా పెట్టుకున్నాడు. దొంగ డాగ్స్ రేపు ఉదయాన్నే మళ్లీ వస్తాయి కదా.. అప్పుడు చెబుతాను అనుకున్నాడు.–మాధవ్
Comments
Please login to add a commentAdd a comment