తవ్వుకో.. దండుకో | Illegal Sand Mining In The Name Of Free Distribution In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

తవ్వుకో.. దండుకో

Published Sun, Jan 20 2019 7:22 AM | Last Updated on Sun, Jan 20 2019 7:26 AM

Illegal Sand Mining In The Name Of Free Distribution In Andhra Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రంలోని ఇసుక రేవులు టీడీపీ నేతల దోపిడీకి కేంద్రాలుగా మారాయి. ‘తవ్వుకో.. దండుకో’ అనే చందంగా ఇసుక దందా సాగిస్తున్నారు. నదులు, ఉపనదులు, వాగులు, వంకలు ఇలా వేటిని వదలకుండా అక్రమ ఇసుకతవ్వకాలతో వేల కోట్లు దోచుకుంటున్నారు. ఇసుకకోసం తీస్తున్న భారీ గోతులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. వర్షాకాలంలో ఈ గోతుల్లో నీరు నిండుతోంది. ఈ విషయం తెలియక సరదాగాఈతకు వెళ్లినచిన్నారులు, సాధారణ ప్రజలు ఈ అగాథాల్లో చిక్కుకుని మృత్యువాత పడుతున్నారు. మరోవైపు అడ్డగోలు తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. సాగునీటికి, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా ఇసుకాసురుల తీరులో ఇసుమంతైనా మార్పు రావడం లేదు. వీరికి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండటంతో అధికారులుకూడా మిన్నకుండిపోతున్నారు. నాలుగున్నరేళ్లలో ఇసుక దందా ద్వారా అధికార పార్టీ నేతలు దండుకున్న మొత్తం రూ.10 వేల కోట్ల పైమాటే.  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక రవాణా పేరుతో టీడీపీ నేతలు సాగిస్తున్న దందా మూడు ట్రాక్టర్లు.. ఆరు లారీలు చందంగా వర్ధిల్లుతోంది. 2014 అధికారంలోకి వచ్చాక తొలి రెండేళ్లు టీడీపీ నేతలు డ్వాక్రా సంఘాల ముసుగులో ఉండి ఇసుక అమ్మకాలు సాగించి రూ.4,400 కోట్లు దోచుకున్నారు. తర్వాత ప్రభుత్వం ఉచిత ఇసుకను తెరపైకి తెచ్చింది. పేరుకు ఉచితమే అయినా ఆచరణలో దీనికి భిన్నం. అన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు ఇసుక రేవులను సొంత జాగీర్లుగా మార్చుకుని నచ్చిన రేటుకు ఇసుకను అమ్ముకోవడం ద్వారా గత రెండున్నరేళ్లలో రూ.5,600 కోట్లు దోచేశారు. ఇసుక కోసం ఎవరైనా క్వారీ దగ్గరకు వాహనాన్ని తీసుకెళ్లాలంటే టీడీపీ నేతలకు కప్పం కట్టాల్సిందే. దీనికి రహదారి నిర్వహణ ఖర్చు అనే ముద్దు పేరు పెట్టారు. డబ్బు ఇవ్వకపోతే వాహనాలను అడ్డుకుంటారు. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ ఇసుక కావాల్సిన వారు టీడీపీ నేతలకే చెబుతున్నారు. దీంతో వారు రవాణా, లోడింగ్‌ ఛార్జీల పేరుతో నచ్చిన రేట్లకు ఇసుకను విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం బహిరంగంగానే సాగుతున్నా తెరవెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉన్నందున అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.  

నదులు, వాగుల్లో విధ్వంసం 
ఇటు శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నుంచి అటు రాయలసీమలోని తుంగభద్ర, పెన్నా వరకూ అన్ని నదులు, వాగులూ అడ్డగోలు ఇసుక తవ్వకాలతో ధ్వంసమయ్యాయి. మీటరు లోతు మించి ఇసుక తవ్వరాదనే నిబంధనను తుంగలో తొక్కి నాలుగు మీటర్ల లోతు వరకూ ప్రొక్లెయిన్లతో, భారీ యంత్రాలతో ఇసుకను తోడేసి బావులను తలపించేలా మార్చేశారు. ఈత కోసం వెళ్లిన చిన్నారులు ఈ గుంతల్లో చిక్కుకుని ప్రాణాలు సైతం కోల్పోయారు. కృష్ణా, గుంటూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో చాలామందిని ఇసుక గోతులు బలి తీసుకున్నాయి.   

నిబంధనలను గాలికొదిలేసి.. 
క్వారీల్లో మనుషులతోనే ఇసుక తవ్వకాలు సాగించాలని, ప్రొక్లెయిన్లు లాంటి యంత్రాలు వినియోగించరాదని నిబంధనలు ఉన్నా అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదు. క్వారీల్లోకి లారీలను తీసుకెళ్లరాదని, ట్రాక్టర్లతోనే ఇసుకను తీసుకెళ్లాలనే నిబంధన కూడా ఉంది. వీటిని కాలరాస్తూ ప్రొక్లెయిన్లతో చాలా లోతుగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో ‘రేలా’ అనే స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ తీవ్రంగా తప్పుబట్టింది. అంతేకాకుండా తనిఖీల కోసం బృందాన్ని పంపినప్పుడు సాక్షాత్తూ ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఇంటిపక్కనే డ్రెడ్జింగ్‌ యంత్రాలను దాచిపెట్టారు. ట్రిబ్యునల్‌ బృందం వెళ్లిపోగానే మళ్లీ యథాప్రకారం అక్రమ తవ్వకాలు సాగడం గమనార్హం. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా తదితర నదులు, వాగులపై 460పైగా అధికారిక, అనధికారిక ఇసుక రేవులుండగా వాటిలో 83 పెద్దవి ఉన్నాయి. వీటిలోనే కాకుండా ఎక్కడ ఉంటే అక్కడ ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నారు. వంతెనలకు వంద మీటర్ల దూరం వరకూ ఇసుక తీయరాదనే నిబంధన ఉన్నా దీన్ని కూడా కాలరాస్తూ తవ్వేస్తుండటంతో వాటి భద్రత గాలిలో దీపం చందంగా మారుతోంది.   

భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం 
అడ్డగోలుగా సాగిస్తున్న ఇసుక తవ్వకాల ప్రభావం భూగర్భ జలాలపై పడింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భూగర్భ జలమట్టం రోజురోజుకూ పాతాళానికి దిగిపోతోంది. ఏడాది కిత్రం (2018, జనవరి 12తో)తో పోల్చితే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటున 6.72 అడుగుల మేర భూగర్భ జలమట్టం కిందకు పడిపోయింది. ఇదేకాలంలో రాయలసీమలో సగటున 20.27 అడుగుల మేర నీటి జాడ పాతాళానికి దిగిపోయింది. ఇక జిల్లాలవారీగా చిత్తూరులో 32.87, అనంతపురంలో 17.78, ప్రకాశంలో 14.43 అడుగుల మేర భూగర్భ జలమట్టం కిందకు పోయింది. ఈ గణాంకాలు ప్రమాద ఘంటికలకు సంకేతాలని భూగర్భ జల, పర్యావరణ శాఖల నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చలికాలంలోనే వేసవిని తలపించేలా భూగర్భ జలమట్టం పాతాళానికి చేరడానికి ఇసుక తవ్వకాలే కారణమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.  

జిల్లాల వారీగా ఇసుక దోపిడీ ఇలా.. 
కృష్ణా జిల్లాలో ఒక మంత్రి, గూండాగా పేరొందిన ఒక టీడీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లో ఇసుక దందా సాగుతోంది. బహిరంగంగా పట్టపగలే డ్రెడ్జర్లతో తోడేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు నిత్యం ఇసుకను పెద్ద పెద్ద లారీల్లో తరలించి కోట్లు దండుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ఓ మంత్రితోపాటు, నలుగురు సీనియర్‌ ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ దందాను నడిపిస్తున్నారు. రేపల్లె నియోజకవర్గంలో పెనుమూడి, రావిఅనంతవరం రేవుల్లో ఒక టీడీపీ ఎమ్మెల్యే ఆదేశాలతో అనుచరులు రెచ్చిపోతున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో మరో టీడీపీ ఎమ్మెల్యే ఇసుక రేవులను జాగీర్లుగా మార్చుకున్నారు. ‘నేనే మంత్రి.. నేనే రాజు’ అని చెప్పుకునే ఒక మంత్రి శ్రీకాకుళం జిల్లాలో హవా సాగిస్తున్నారు. ఆయనతోపాటు మంత్రి హోదా గల మరో ఎమ్మెల్యే గుంటూరు జిల్లా టీడీపీ నేతలతో కలిసి ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను తెరవెనుక ఉండి నడిపిస్తున్నారు. పాలకొండ నియోజకవర్గంలో నాగావళి, వంశధార నదీ తీరాల నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. ఆంధ్రా–ఒడిశా పరిధిలో వంశధార నదిలో భారీగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని స్వర్ణముఖి, కాళింగి, పెన్నా నదుల నుంచి చెన్నైకి ఇసుక తరలిపోతోంది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు నుంచి కర్ణాటక, తమిళనాడుకు భారీ ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు పడిపోయి శ్రీకాళహస్తికి నీరందించే బావులు ఎండిపోయాయి. పూతలపట్టు, చిత్తూరు రూరల్‌ మండలం బీఎన్‌ఆర్‌ పేటలో ఇష్టానుసారం తవ్వకాలు సాగుతున్నాయి. వైఎస్సార్‌ జిల్లాలో ఏ నదినీ, వాగును, వంకనూ వదల్లేదు. కొండాపురం నుంచి ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి వద్ద ఇసుక క్వారీలో ఒక టీడీపీ ఎంపీ సోదరుల అండదండలతో దందా సాగుతోంది. పెన్నా, పాపాఘ్ని, చెయ్యేరు, చిత్రావతి నదుల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తరలించడం ద్వారా టీడీపీ నేతలు కోట్లు కొల్లగొడుతున్నారు.   

తుంగభద్ర నదిలో రహదారి  
కర్నూలు జిల్లాలో టీడీపీ ముఖ్య నేతల అనుచరులు తుంగభద్ర, హంద్రీ నదిలో లక్షలాది క్యూబిక్‌ మీటర్ల ఇసుకను అక్రమంగా తరలించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. అధికార పార్టీ ముఖ్య నేత తనయుడి అనుచరులు గోరంట్ల, ఎర్రగుడి, మన్నెకుంట గ్రామాల పరిసర ప్రాంతాల్లో హంద్రీ నదిలో ఇసుకను రాత్రి వేళల్లో లారీలకు లోడ్‌ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. తుంగభద్ర నది మధ్యలో ఇసుక అక్రమ రవాణా కోసమే కిలోమీటర్ల కొద్దీ రహదారి నిర్మించడం గమనార్హం. దీన్ని హైకోర్టు తీవ్రంగా తప్పబట్టడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సర్కారు అండ వల్లే రహదారి వేయగలిగారంటూ కోర్టు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది.  

రీచ్‌లోకి వెళ్లాలంటే కప్పం కట్టాల్సిందే
రాష్ట్రంలో మొత్తం 460 ఇసుక రేవులు ఉండగా ప్రజలు సొంత అవసరాలకు ఎక్కడ నుంచైనా ట్రాక్టర్లలో ఇసుక ఉచితంగా తీసుకెళ్లవచ్చని సర్కారు ఉత్తర్వులు ఉన్నాయి. అయితే ఎక్కడా సొంతంగా ట్రాక్టరు తీసుకెళ్లి ఇసుక నింపుకోవాలంటే ఆయా ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలకు కప్పం కట్టాల్సిందే. ‘రీచ్‌లోకి దారి మేమే నిర్మించాం. అందువల్ల ట్రాక్టరు వెళ్లాలంటే డబ్బు ఇవ్వాల్సిందే’ అంటూ మాఫియా గ్యాంగులు బరితెగించి వసూళ్లు సాగిస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. ప్రైవేటు వ్యక్తులు రేవుల్లోకి లారీలను తీసుకెళ్లరాదు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణం లాంటి ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే లారీలను తీసుకెళ్లవచ్చని ఉత్తర్వులు ఉన్నాయి. అయితే ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి.

కాగితాల్లోనే ఉచితం 
డ్వాక్రా సంఘాలను తప్పించి ఉచిత ఇసుక విధానాన్ని తెరపైకి తేవడం ద్వారా సర్కారు టీడీపీ నేతల దోపిడీకి మరిన్ని ద్వారాలు బార్లా తెరిచింది. 2016, మార్చి 4న ఉచిత ఇసుక విధానానికి సంబంధించి మార్గదర్శకాలతో మెమో నంబర్‌ 3065 జారీ చేసింది. ఆ వెంటనే రాష్ట్రంలోని 460 అధికారిక, అనధికారిక ఇసుక రీచ్‌ల్లో టీడీపీ నేతలు పాగా వేశారు. తమ జాగీర్లన్నట్లుగా అడ్డగోలుగా తవ్వి అమ్ముకుంటున్నారు. రేవుల్లోకి ఇతరుల వాహనాలను అనుమతించడం లేదు. ఉచిత ఇసుక అమల్లోకి వచ్చినప్పటి నుంచి గత నెలాఖరు (2018, డిసెంబర్‌) వరకూ చోటా, మోటా నేతలు దండుకున్న మొత్తం పోనూ టీడీపీ పెద్దలు ఇసుక ద్వారా దోచుకున్న మొత్తం రూ.5600 కోట్లు పైమాటే. ఇసుక మాఫియా ఆగడాలను విన్నవించడానికి వెళ్లిన 15 మందిని ఇసుక మాఫియా గ్యాంగులకు చెందిన వాహనాలు గుద్ది చంపేశాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులోని ఏర్పేడు ఈ దుర్మార్గానికి వేదిక కావడం గమనార్హం.    

ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా వాస్తవమే : మంత్రివర్గ ఉపసంఘం
రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా వాస్తవమేనని, రేవుల్లో ఇసుక తవ్వకాలకు యంత్రాలను వినియోగిస్తున్న సంగతి కూడా నిజమేనని మంత్రివర్గ ఉప సంఘం అంగీకరించడం గమనార్హం. ఇసుక లారీలు రాష్ట్ర సరిహద్దులు దాటిపోతున్నా అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందని, శాఖల మధ్య సమన్వయం లేకపోవడం దీనికి కారణమని ప్రకటించింది. ఇసుక విధానంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కేఈ కృష్ణమూర్తి (రెవెన్యూ), చినరాజప్ప (హోం), సుజయ కృష్ణ రంగారావు (భూగర్భ గనులు) ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం మీడియా సమావేశంలోనే ఈ వివరాలు వెల్లడించారు. ప్రతినెలా మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై ఇసుక విధానాన్ని సమీక్షించాలని, దీనికి నీటిపారుదల శాఖను కూడా ఆహ్వానించాలని నిర్ణయించినా సమావేశాలు జరిగిన దాఖలాలు మాత్రం లేవు.  

25 అడుగులు తవ్వితే నీళ్లు పడేవి
మా గ్రామంలో టీడీపీ నేతల విచ్చలవిడి ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గతంలో నీటి పంపులు, బోర్ల కోసం భూమిలో 25 అడుగులు తవ్వితే నీళ్లు పడేవి. ఇప్పుడు 120 అడుగులు తవ్వినా నీరు పడటం లేదు. కృష్ణానదీ తీరం వెంట ఉన్న మా గ్రామంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉండటం నిజంగా కలచివేస్తోంది.
-  ఆత్మకూరి నాగసురేశ్‌. ఊరు.. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం పెసర్లంక.

గోతుల్లో పడి మరణించారు..
నాగావళి నదిలో టీడీపీ నేతలు అక్రమంగా ఇసుక తవ్వుతుండటంతో భారీ గోతులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల వర్షాకాలంలో నది నిండుగా ప్రవహించినపుడు.. పలువురు ఈత కోసం దిగి తెలియక మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి సాగు, తాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి  వస్తోంది.  
- ఎస్‌.జగదీశ్‌. ఊరు.. శ్రీకాకుళం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement