చేవెళ్ల : సర్కారు బడుల్లోనే విద్యార్థులకు సక్కనైన చదువులు దొరుకుతుందని విద్యావేత్త కె.జయదేవ్ అన్నారు. చేవెళ్ల మండలంలోని గుండాల గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు శనివారం సన్‌పరివార్ వారి మెతుకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్‌పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశారు. ఫౌండేషన్ మార్కెటింగ్ డైరెక్టర్ గోపాల్‌రెడ్డి, సభ్యులతో కలిసి విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జయదేవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకుంటే ప్రైవేటు పాఠశాలలు కనిపించవన్నారు. ఇప్పటి వరకు సమాజంలో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వారంతా ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చినవారేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ సీఈఓ రవీందర్, డైరెక్టర్ రాజేందర్, రవికుమార్, శంకర్‌లు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదుగాలని సూచించారు.
పాఠశాలలను గ్రామస్తులంతా కలిసి బాగు చేసుకుంటే విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించినట్లు అవుతుందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఏడాదికి కట్టే ఫీజులో ఒక శాతం డబ్బుతో ప్రభుత్వ పాఠశాలను బాగు చేసుకుంటే కార్పొరేట్ పాఠశాలలను మించి పోతాయన్నారు. దీనికి గ్రామస్తులు కృషి అవసరమన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ముజీబ్, సర్పంచ్ పుష్పకుమారిగణేశ్, పీఏసీఎస్ చైర్మన్ నక్క బుచ్చిరెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్ యాదగిరి, సన్‌పరివార్ ఫీల్డ్ అధికారులు జంగారెడ్డి, శేఖర్‌రెడ్డి, సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పాఠశాల అభివృద్ధికి విరాళాలు
పాఠశాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని విద్యావేత్త జయదేవ్ సూచించడంతో గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి కంప్యూటర్‌ను ఇప్పిస్తానని, గ్రామానికి చెందిన మరో వ్యక్తి జె. రంగారెడ్డి రూ. 5వేలు, గ్రామంలో మిషన్‌భగీరథ పైపులైన్ పనుల కాంట్రాక్టర్ కరుణాకర్‌రెడ్డి రూ. 5వేలు, గోపాల్‌రెడ్డి రూ. 50వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే శనివారం గ్రామంలో మెతుకు ఫౌండేషన్ సభ్యులంతా కలిసి వచ్చి గ్రామంలో పాఠశాల అభివృద్ధి కోసం గ్రామంలో దాతల ద్వారా చందాలు సేకరించే కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment