సాక్షి, హైదరాబాద్: మీరు హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తున్నారా.. మీ వెనకాల కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ లేదా.. ఇలా తొలిసారిగా ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే మూడు నెలల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. ఇక రెండోసారి దొరికితే మీకు హెల్మెట్ ఉన్నా, లేకున్నా.. పిలియన్ రైడర్ ధరించకపోతే మాత్రం శాశ్వతంగా మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అంశాన్ని అమలు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు రవాణా శాఖ అధికారులకు లేఖలు రాసేందుకు సమాయత్తం అవుతున్నారు. దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చే ముందు మోటార్ వెహికల్ సవరణల చట్టం–2019, సెక్షన్ 206 (4) ద్వారా హెల్మెట్ లేని వాహనదారులపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారో అవగాహన కలిగించేలా వీడియో చిత్రాలు చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. అలాగే వాహనాలు ఎక్కువగా ఆగే ట్రాఫిక్ జంక్షన్లలో మైక్ ద్వారా ప్రచారం నిర్వహించి జాగృతం చేస్తున్నారు.
భారీగా ఈ–చలాన్లు..
గతేడాది హెల్మెట్ లేని 18,50,000 మంది (వాహనదారులు, పిలియన్ రైడర్లు)కి ఈ–చలాన్లు జారీ చేశారు. గతేడాది జరిగిన 625 రోడ్డు ప్రమాదాల్లో 663 మంది మృతి చెందారు. అత్యధిక శాతం హెల్మెట్ ధరించకపోవడంతోనే మరణించారని ట్రాఫిక్ గణాంకాలు చెబుతున్నాయి. మృతుల్లో చాలామంది పిలియన్ రైడర్లే ఉండటంతో హెల్మెట్ ధరించే అంశాన్ని కఠినంగా అమలు చేయాలని సైబరాబాద్ పోలీసు అధికారులు నిర్ణయించారు. సీపీ సజ్జనార్ మార్గదర్శనంలో ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ ఇప్పటికే పిలియన్ రైడర్లకు హెల్మెట్ లేకున్నా ఈ–చలాన్లు విధిస్తున్నారు. ఆ తర్వాత కూడా హెల్మెట్ లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అంశంపై తొలుత అవగాహన కలిగించి.. అమలు చేసే యోచనలో ఉన్నారు. మరికొన్ని రోజుల పాటు విస్తృత స్థాయిలో అవగాహన కలిగించిన తర్వాతే లైసెన్స్ రద్దుపై రవాణా శాఖకు లేఖలు రాస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment