సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ధనంజయరెడ్డి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ వాడకం తప్పనిసరని జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి అన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జిల్లాలోని అన్ని రహదారుల్లో దీని వాడకాన్ని కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాస్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే జాతీయ రహదారిపై హెల్మెట్ వాడకం నిబంధన అమలు జరుగుతోందన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఈ నెల 15వ తేదీ నుంచి కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ పదో తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కొంత వెసులుబాటు ఇచ్చామన్నారు. పరీక్షలు పూర్తయిన అనంతరం నిబంధన కఠినంగా అమలు చేసేందుకు సమావేశం నిర్ణయించింది. హెల్మెట్ వినియోగం విషయంలో సుప్రీంకోర్టు సైతం మార్గదర్శకాలు జారీ చేసిందని కలెక్టర్ చెప్పారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం స్పష్టమైన నిర్దేశాలు జారీ చేసిందన్నారు. ప్రతి ప్రాణం విలువైనదేనని... స్వయం రక్షణ కోసం హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు.
రూ. 14 లక్షలు మంజూరు
ప్రమాదాల నివారణలో భాగంగా రహదారులపై స్టాపర్ బోర్డులు ఏర్పాటుకు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 14 లక్షలు మంజూరు చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు. తక్షణమే స్టాపర్ బోర్డులు ఏర్పాటు చేయాలని రవాణా, పోలీసు శాఖలకు సూచించారు. రహదారులు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖలకు స్పీడ్ బ్రేకర్లు, జీబ్రా క్రాసింగ్స్ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ రద్దీ నివారణకు, వాహనాలు ఆగిపోయినపుడు వాటిని పక్కకు తీసేందుకు, రాంగ్ పార్కింగు వంటి సమయాల్లో త్రోయింగ్ వెహికల్ అవసరమని, దానిని సమకూర్చడం జరుగుతోందన్నారు. ఇప్పటికే నగరపాలకసంస్థ టెండర్లను పిలిచామని సహాయ సిటీ ప్లానర్ వివరించారు. జాతీయ రహదారి పొడవునా రహదారి భద్రతా అంశాలను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జంక్షన్ల వద్ద రంబ్లిక్ స్టిక్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.
ట్రామాకేర్ కేంద్రం ఏర్పాటుకు రూ. 8 లక్షలు
పలాస 50 పడకల ఆస్పత్రిలో ట్రామాకేర్ కేంద్రం ఏర్పాటుకు రూ. 8 లక్షలు కేటాయించినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత సౌకర్యాలు త్వరితగతిన ఏర్పాటు చేయాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి బి.సూర్యారావును ఆదేశించారు. గోల్డెన్ అవర్ సమయంలో ట్రామాకేర్ సేవలు ఎంతో అవసరమన్నారు. ట్రామాకేర్‌కు అవసరమయ్యే ఇతర సదుపాయాలను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధుల నుంచి సమకూర్చాలని ఆదేశించారు.
భద్రతపై విస్తృత ప్రచారం: ఎస్పీ
జిల్లా ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ మాట్లాడుతూ రహదారి భద్రతపై పోలీసుశాఖ ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టడం జరుగుతోందన్నారు. అవగాహన చర్యలతో ఫిబ్రవరి నెలలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో కేవలం మూడు మరణాలు మాత్రమే సంభవించాయన్నారు. జాతీయ రహదారిపై హెల్మెట్ నిబంధన కచ్చితంగా అమలు చేస్తుండడంతో ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో రాత్రిపూట అవగాహన చర్యలు చేపట్టడమే కాకుండా స్టాప్ అండ్ వాష్ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
23 నుంచి రహదారి భద్రతా వారోత్సవాలు
రవాణాశాఖ ఉప కమిషనర్ సీహెచ్ శ్రీదేవి మాట్లాడుతూ రహదారి భద్రతా చర్యలకు రూ. 50.69 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామన్నారు. ఈ మొత్తంలో రూ. 22.54 లక్షలు విడుదల చేసిందని, మిగిలిన మొత్తంలో రాష్ట్రస్థాయిలో రహదారి భద్రతా పరికరాలు కొనుగోలు చేసి సరఫరా చేస్తారన్నారు. రహదారి భద్రతా వారోత్సవాలను ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రహదారి భద్రతా చర్యలకు కేఆర్ స్టేడియం వద్ద ఉన్న సంస్కార్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం రూ. 2 లక్షలను విరాళంగా అందించిందన్నారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వై.వెంకటేశ్వరరావు, డీఎస్పీలు ఎం. కృష్ణమూర్తినాయుడు, పి. మారావు, జి.స్వరూపారాణి, కె.రాఘవ, రవాణాశాఖ అధికారులు జె.రామ్‌కుమార్, పీవీ రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment