- వాహనాలను జాగ్రత్తగా నడపాలి
- వరంగల్ సీపీ సుధీర్‌బాబు
- పోలీస్ కమిషనరేట్‌లో ‘మీ క్షేమం’ సదస్సు
- హెల్మెట్ల వినియోగంపై అవగాహన
- కన్నీటి పర్యంతమైన సీపీ, పలువురు తల్లిదండ్రులు
రోడ్డు ప్రమాదాలతో కడుపుకోత మిగుల్చొద్దు
Published Fri, Jul 29 2016 12:26 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM
వరంగల్: యువత రోడ్డు ప్రమాదాలకు గురై తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు కోరారు. పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో హెల్మెట్ల వినియోగం, ప్రాముఖ్యతపై వాహనాలు నడిపే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇటీవల రోడ్డు ప్రమాదాలకు గురై మృతిచెందిన కుటుంబసభ్యులకు గురువారం సీపీ కార్యాలయంలోని రాణిరుద్రమదేవి ప్రాంగణంలో ‘మీ క్షేమం’ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిబ్బంది రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన ఛాయా చిత్రాలతో ప్రదర్శన చేపట్టారు.
అనంతరం సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ యువకులు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతుండడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి అందివచ్చిన కొడుకులు ప్రమాదాల్లో విగతజీవులుగా మారుతుండడం బాధాకరమన్నారు. కాగా, కొందరు తల్లిదండ్రులు ప్రమాదాల్లో తమ కుమారులు చనిపోయిన సంఘటనలను గుర్తుకు చేసుకుని కన్నీటి పర్యంతమవుతుండగా సీపీ సుధీర్‌బాబు కూడా బోరున విలపించారు. ఈ సందర్భంగా సదస్సును కొనసాగించాలని అధికారులకు సూచించి సీపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సదస్సులో అదనపు డీసీసీ యాదయ్య, ఏసీపీలు శోభన్‌కుమార్, సురేంద్రనాథ్, మహేందర్, ఈశ్వర్‌రావు, రవీందర్‌రావు, వెంకటేశ్వర్‌రావుతో పాటు కమిషనరేట్ పరిధిలోని సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, కాంగ్రెస్ నాయుడు ఈవీ.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
తల్లిదండ్రుల బాధ్యతను వివరించాం : సీపీ సుధీర్‌బాబు
మీ క్షేమం సదస్సు ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు తల్లిదండ్రుల బాధ్యతను కూడా గుర్తు చేశామని సీసీ సుధీర్‌బాబు తెలిపారు. సదస్సు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం మన దేశంలో రోజుకు 384 మంది రోడ్డు ప్రమా దాల్లో మృతిచెందుతున్నారన్నారు. ఇందులో 25 శాతం మైనర్ బాలబాలికలు చనిపోతున్నారని, ఎక్కువ మరణాలు హెల్మెట్లు లేకుండా వాహనాలు నడిపినవే ఉంటున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించిప్పుడే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు.
హెల్మెట్ ధరించి ఉంటే బతికేవాడు
పిల్లల ఆనందం కోసం లక్షలు ఖర్చు చేసి బైక్‌లను కొనుగోలు చేసి ఇస్తున్నాం. కానీ.. వారు హెల్మెట్లు పెట్టుకున్నారో లేదో అన్న విషయాలను గమనించకపోవడంతో కడుపుకోత మిగులుతోంది. నా కుమారుడు హెల్మెట్ ధరించి బైక్ నడిపి ఉంటే ఇప్పుడు జీవించి ఉండేవాడు. నాకు జరిగిన నష్టం ఇతర తల్లిదండ్రులకు జరగకూడదు. వరంగల్ పోలీసులు నిర్వహిస్తున్న మీక్షేమం కార్యక్రమం అభినందనీయం. నా కొడుకు విశాల్ జ్ఞాపకార్థం హెల్మెట్ల వాడకం కోసం చేసే ప్రచారానికి నావంతు సహాయ సహకారాలు అందిస్తాను.
– నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు
నిర్లక్ష్యంతో మృతి
ఇంజినీరింగ్‌లో జాయిన్ కావడంతో నా కొడుకు కోరిక మేరకు రూ.80 వేలతో బైక్ కొనివ్వడంతో పాటు రూ.16 వేలతో హెల్మెట్ కూడా కొనిచ్చాను. కొద్ది దూరం కదా అనే చిన్న నిర్లక్ష్యంతో హెల్మెట్ లేకుండా రోడ్డు పైకి వెళ్లి కేయూసీ రహదారిపై జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. అదే హెల్మెట్ ధరించి ఉంటే నేను ఇక్కడకు రావాల్సిన అవసరం లేకుండా పోయేది.
– ఆకుల నాగరాజు, కాంట్రాక్టర్
భర్తను కోల్పోయాను
నేను, నా భర్త కూలీ పనిచేసుకునే వాళ్లం. ఒక రోజున నా భర్త హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడిపాడు.
రోడ్డు ప్రమాదంలో తలకు గాయమై మృతి చెందాడు. నా భర్త మరణంతో నేను, ఇద్దరు పిల్లల పరిస్థితి ఆగమైంది.
– గుడికందుల లావణ్య, హసన్‌పర్తి
తండ్రిని కోల్పోయాను
హన్మకొండ అశోకాటాకీస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నేను తండ్రిని కోల్పోయాను. హెల్మెట్ ధరించకపోవడంతోనే మా నాన్న చనిపోయాడు. కుటుంబ పెద్ద చనిపోవడంతో పోషణ భారం, ఇంటి బాధ్యత నాపై పడింది. మా మంచి చెడులు చూసే తండ్రి లేకపోవడం బాధకరం.
– అల్వాల సుమంత్‌కుమార్, హన్మకొండ
హెల్మెట్ ఇచ్చి ఉంటే నా భర్త ఉండేవాడు
ప్రతి రోజు నా భర్త బయటకు పోతుంటే మోటార్ సైకిల్ తాళం ఇచ్చేదాన్ని. అదే హెల్మెట్ ఇచ్చి ఉంటే నేడు ఆయనను కోల్పోయేదాన్ని కాదు. నా భర్త ఎరువుల కొనుగోలు కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. పోలీసులు హెల్మెట్ల వినియోగంపై చేస్తున్న ప్రచారం అభినందనీయం.
కాగితాల రమ్య, స్టేషన్‌ఘన్‌పూర్
Advertisement