ఎర్రమంజిల్ ఆర్.అండ్.బి కార్యాలయంలో ఆర్.అండ్.బి అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆర్.అండ్.బి,ట్రాన్స్ పోర్టు,హౌసింగ్ మరియు శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ నష్టాల బాట వీడలేదు. రెండేళ్లతో పోలిస్తే నష్టాలు కొంత తగ్గాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరం కంటే ఈసారి మళ్లీ నష్టాలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. జనవరితో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నష్టాలు రూ.603 కోట్లుగా లెక్కతేలింది. ఇందులో జనవరి నెల వాటా రూ.69 కోట్లుగా గుర్తించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో లాభాలు నమోదైతేనే మొత్తంగా నష్టాలు తగ్గుతాయి. కానీ గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఏకంగా రూ.170 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం నష్టాలు రూ.650 కోట్లుగా తేలాయి. 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాల్లో ఈ నష్టాలు ఏకంగా రూ.700 కోట్లను మించిపోయాయి. ఆ తర్వాత దాన్ని రూ.650 కోట్లకే పరిమితం చేశారు. కొన్ని పొదుపు చర్యల వల్లే నష్టాలు తగ్గాయని పేర్కొన్న అధికారులు, పొదుపు మరింత పెంచి ఈ ఆర్థిక సంవత్సరంలో నష్టాలను మరింత తగ్గిస్తామని పేర్కొన్నారు. కానీ, గత నవంబర్‌లో రూ.105 కోట్లు, డిసెంబర్‌లో రూ.72 కోట్ల నష్టం రావటంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ప్రస్తుతం ఆర్టీసీతీరు గందరగోళంగా మారింది. సంస్థకు పూర్తిస్థాయి ఎండీ లేరు. గతంలో పనిచేసిన రిటైర్ట్ అధికారి రమణారావు పదవీకాలం పొడిగించలేదు. సంస్థపై పూర్తిస్థాయిలో దృష్టి సారించేవారు లేక నష్టాలకు ముకుతాడు పడలేదు. ఇదే ఆర్థిక సంవత్సరంలో ముగ్గురు ఈడీలు పదవీవిరమణ పొందారు. మరో నెల రోజుల్లో ఇంకో అధికారి కూడా రిటైర్ కానున్నారు.
నష్టాలకు ముకుతాడు వేస్తా: మంత్రి వేముల
ఆర్టీసీని కచ్చితంగా చక్కదిద్దుతానని రవాణా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... గత ఆర్థిక సంవత్సరం కం టే 5 శాతం నష్టాలు తక్కువగా నమోదయ్యాయని, వచ్చే ఆర్థిక సంవత్సరం తుదివరకు అది 10 శాతం తక్కువగా ఉండేలా చూస్తానని పేర్కొన్నారు. 72 బస్టేషన్లలో బడ్జెట్ హోటళ్ల నిర్మాణం, 97 కేంద్రాల్లో ఇంధన ఔట్‌లెట్ల ఏర్పాటుతో ఆదాయం పెరుగుతుందన్నారు. ఆర్టీసీ ప్రజాసేవకే ఉందని, లాభార్జన కోసం కాదన్న విషయాన్ని కూడా గుర్తించాలన్నారు. రవాణా శాఖ 2015లో రూ.1,800 కోట్లు ఉన్న ఆదాయాన్ని ప్రస్తుతం రూ.3 వేల కోట్లకు పెంచుకుందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా పీటముడిగానే ఉందన్నారు.
నా కోసం కొత్త బస్సుల ప్రారంభం ఆపకండి
‘కొత్త బస్సుల ప్రారంభోత్సవం కోసం నేనో, మరొకరో రావాలని ఎదురు చూడకండి. ఎండీ అందుబాటులో లేకున్నా ఈడీలే వాటిని ప్రారంభించేసుకోవచ్చు. నాలుగైదు రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాలి’అని ఆర్టీసీ అధికారులను మంత్రి వేముల ఆదేశించారు. మంత్రో, మరెవరో ప్రారంభోత్సవాలకు రావాలని ఎదురుచూస్తూ బస్సులను డిపోలకే పరిమితం చేయటం సరికాదన్నారు. గత సంవత్సరం ఆర్టీసీ కొత్తగా సమకూర్చుకున్న దాదాపు 400 బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభించాలన్న ఉద్దేశంతో ఏడెనిమిది నెలలపాటు పార్కింగ్ యార్డులో ఉంచారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు వంద ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేయగా తొలిదశలో 40 బస్సులు సమకూరాయి. ఒక్కోటి రూ.3 కోట్ల ఖరీదు చేసే ఈ బస్సులను అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ వినియోగించుకోనుంది. కేంద్రం ఇచ్చిన సబ్సిడీని కూడా ప్రైవేటు సంస్థకు మళ్లించిన అధికారులు ఆ సంస్థ నుంచి వాటిని అద్దెరూపంలో తీసుకోనున్నారు. కిలోమీటరుకు రూ. 34 చొప్పున ఆ సంస్థకు ఆర్టీసీ అద్దె చెల్లిస్తుంది. అంతకుమించి వసూలయ్యే మొత్తాన్ని తాను జమ చేసుకుంటుంది. ప్రస్తుతం నగరంలోని కంటోన్మెంట్, మియాపూర్–2 డిపోలకు 20 చొప్పున బస్సులు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment