సాక్షి, విజయవాడ: టాక్సీ, ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించేవరికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని రవాణాశాఖ కమిషనర్ సీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి వాహన బీమా, ఫిట్‌నెస్, మరమ్మత్తుల నిమిత్తం రూ. 10 వేలు ఇవ్వనుందని, దీని కోసం రూ.400 కోట్ల నిధుల్ని విడుదల చేయనుందని వెల్లడించారు. రహదారి భద్రత కోసం 50 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ నిధులతో భద్రతా ప్రమాణాలు పెంపొందించేందుకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేస్తామన్నారు. ఆరు నెలల కాలంలో 9 జిల్లాల్లో సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 100 షోరూంలలో తనిఖీలు నిర్వహించామని, వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్‌లలో అక్రమాలు జరిగినట్టు బయటపడిందని అన్నారు. ఇన్వాయిస్‌లు తక్కువగా చూపించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టిన వారిపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ క్రమంలొ గుంటూరు జిల్లాకు చెందిన గౌతమ్ హీరో షోరూమ్పై చర్యలు తీసుకున్నామని తెలిపారు. అనంతపురంలోని మారుతి డీలర్‌పై 41 లక్షల రూపాయలు టాక్స్‌లు, అదనంగా 41.41 లక్షల రూపాయలు జరిమానా విధించామన్నారు. అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment