డీజిలే అసలు విలన్‌... | Transport Department in an effort to increase ticket prices | Sakshi
Sakshi News home page

డీజిలే అసలు విలన్‌...

Published Wed, May 22 2019 3:05 AM | Last Updated on Wed, May 22 2019 3:05 AM

Transport Department in an effort to increase ticket prices - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డీజిల్‌ ఉంటే బస్సు ముందుకు పోతుంది. కానీ, డీజిల్‌ కొంటే ఆర్టీసీ సంస్థ ఆర్థికంగా వెనక్కి పోతోంది. చమురు ధరల భారంతో నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత డీజిల్‌ ధర ఒక్కసారిగా పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న సమయంలో ఆర్టీసీ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇప్పటికే ఆ భారాన్ని మోయలేక చతికిలబడ్డ రవాణాసంస్థ, భవిష్యత్తు భారాన్ని బేరీజు వేసుకుని కాపాడాలంటూ రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతోంది. విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌)ను ఒక శాతానికి తగ్గించాలని చాలాకాలంగా ఆర్టీసీ కోరుతోంది. మూడేళ్లుగా బస్సుచార్జీలు పెంచనందున ఈసారి కచ్చితంగా టికెట్‌ ధరలను సవరించాల్సిందేనని రవాణాశాఖ ముఖ్యకార్యదర్శికి విజ్ఞప్తి చేసింది.

మూడేళ్ల క్రితం ఆర్టీసీ చార్జీలను ప్రభుత్వం 10 శాతానికి పెంచింది. అప్పట్లో డీజిల్‌ ధర లీటరుకు రూ.44.50 ఉంది. అది కొంత పెరుగుతూ, తగ్గుతూ ఇప్పుడు రూ.72కు చేరుకుంది. అంటే లీటరుపై రూ.28 పెరిగింది. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. దీనికి ప్రధానకారణం డీజిల్‌ భారమేనని, అంతర్గత సామర్థ్యం పెంచుకుంటూ ఆదాయాన్ని మెరుగుపరుచుకుంటున్నా డీజిల్‌ భూతం మింగేస్తోందని తాజాగా లెక్కలు తేల్చింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 11 నెలల కాలం(మార్చి లెక్కలు తేల్చాల్సి ఉంది)లో తెలంగాణ ఆర్టీసీ అంతకుముందు సంవత్సరం అదే సమయం కంటే రూ.295 కోట్ల ఆదాయాన్ని పెంచుకుంది.

ఇందులో టికెట్ల రూపంలో రూ.165 కోట్లు, స్క్రాప్‌ విక్రయం, ఇతర వాణిజ్యమార్గాల ద్వారా రూ.56 కోట్లు, బస్‌ పాస్‌ రీయింబర్స్‌మెంటు ద్వారా మిగతా మొత్తం సమకూర్చుకుంది. కానీ, ఇదే సమయానికి పెరిగిన నష్టాలు ఏకంగా రూ.432 కోట్లు ఉన్నాయి. ఇందులో డీజిల్‌ వాటా రూ.186 కోట్లని లెక్కలు తేల్చారు.  తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు డీజిల్‌ ధరలను ఏకంగా 130 సార్లు సవరించారు. తెలంగాణ ఆవిర్భవించిన సమయంలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.63గా ఉంది. అంతర్జాతీయంగా వచ్చిన మార్పుల కారణంగా 2016లో ఫిబ్రవరిలోరూ. 44గా మారింది. ఆ తర్వాత క్రమంగా పెరగటం మొదలుపెట్టి ఇప్పుడు రూ.72కు చేరుకుంది.  

►ఆర్టీసీ నిత్యం ఐదున్నర లక్షల లీటర్ల డీజిల్‌ ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి 20 కోట్ల లీటర్లకు పైమాటే..

►2018–19లో 11 నెలల కాలానికి నష్టాలు రూ.684 కోట్లు. ఇది అంతకుముందు సంవత్సరం అదే కాలానికి వచ్చిన నష్టాల కంటే రూ.137 కోట్లు అధికం. ఇదే సమయంలో ముందు సంవత్సరం కంటే పెరిగిన డీజిల్‌ భారం రూ.186 కోట్లు. 2017–18 సంవత్సరానికి డీజిల్‌బిల్లు రూ.1,084 కోట్లు నమోదు కాగా, 2018 –19లో రూ.1,270 కోట్లు వచ్చింది. ఇందులో దాదాపు రూ.300 కోట్లు వ్యాట్‌ కింద రాష్ట్రప్రభుత్వం వసూలు చేసిందే కావటం గమనార్హం.  

►2015లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ ఆదేశం ఇచ్చారు. హైదరాబాద్‌లో ఆర్టీసీకి వచ్చే నష్టాలను జీహెచ్‌ఎంసీ భర్తీ చేస్తుందన్నది దాని సారాంశం. ఆ మేరకు విడుదల చేసిన ఉత్తర్వులో రూ.336 కోట్లు జీహెచ్‌ఎంసీ ఆర్టీసీకి ఇవ్వాలంటూ పేర్కొంది. 2015–16కుగాను ఒకసారి జీహెచ్‌ఎంసీ ఇచ్చింది. ఆ తర్వాత చేతులెత్తేసింది.  

►పల్లె వెలుగు బస్సులు గ్రామాలకు ఊతం. కానీ, గత ఆర్థిక సంవత్సరంలో ఆ బస్సుల రూపంలో ఆర్టీసీకి వచ్చిన నష్టాలు రూ.330 కోట్లు.

60 వేల లోపే...
ఇటీవల విమానయాన సంస్థలను ఆదుకునే క్రమంలో ప్రభుత్వాలు రాయితీలు ప్రకటిస్తున్నాయి. విమాన ఇంధనంపై 16 శాతంగా ఉన్న వ్యాట్‌ను గతేడాది ఒక శాతంగా మార్చారు. దీంతో విమానయాన సంస్థలు లాభపడ్డాయి. విచిత్రమేంటంటే... మన రాష్ట్రంలో సగటున నిత్యం ప్రయాణించే విమాన ప్రయాణికుల సంఖ్య 60 వేలలోపే. కానీ నిత్యం కోటిమందిని గమ్యం చేరుస్తున్న ఆర్టీసీ మాత్రం అదే ఇంధనంపై ఏకంగా 27 శాతం చెల్లించాల్సి వస్తోంది.

ధనికులు ప్రయాణించే విమానాలకు వెసులుబాటు కల్పించినప్పుడు ఎక్కువ మంది పేదలే ప్రయాణించే ఆర్టీసీ బస్సుకు ఎందుకు వెసులుబాటు రాదని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. విమానయాన సంస్థలు ఆర్థిక ఒడిదొడుకులకు గురైతే దాని ప్రభావం ధనిక వర్గాలపైనే ఉంటుందని, కానీ ఆర్టీసీ ఇబ్బంది పడితే నేరుగా పేదలే సతమతమవ్వాల్సి వస్తుందన్న విషయాన్ని వారు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిస్తే సాలీనా మిగులుబాటు రూ.300 కోట్ల(ప్రస్తుత ధరల ప్రకారం)కే పరిమితమవుతుందని, అదే టికెట్‌ ధరలను డిమాండ్‌ చేసిన 30 శాతంలో సగం 15 శాతం పెంచినా రూ.500 కోట్ల లబ్ధి చేకూరుతుండటమే దీనికి కారణం.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement