డీజిల్ ధరలు పెరిగితే బస్సు చార్జీలూ భగ్గు!
కేంద్రం ధరలు పెంచినప్పుడల్లా తప్పదు: సిద్ధా రాఘవరావు
సాక్షి, హైదరాబాద్: డీజిల్ ధరలు పెరిగితే ఇకపై ఆ సెగ నేరుగా బస్సు ప్రయాణికులకే తగలనుంది! కేంద్రం ప్రభుత్వం డీజిల్ ధరలు పెంచినపుడల్లా ఆర్టీసీ చార్జీలు కూడా వాటంతట అవే సవ రణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రకటించారు. సంస్థ ఇంధన ఖర్చును తగ్గించేందుకు బయో డీజిల్‌ను వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కర్ణాటకలో ఆర్టీసీ(కేఎస్ ఆర్టీసీ) పనితీరును అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాన్ని పంపుతున్నట్లు తెలిపారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాలను వ్యక్తులు, సంస్థలకు లీజుకిచ్చి అదనపు ఆదాయం సమకూర్చుకుంటామన్నారు.పల్లె వెలుగు స్థానంలో చిన్న బస్సులు ప్రవేశ పెడతామన్నారు.