TS RTA Charges Huge Penalties On Vehicle Registration Renewals - Sakshi
Sakshi News home page

తెలంగాణ రవాణాశాఖ దొంగదెబ్బ!

Published Fri, Feb 19 2021 8:50 AM | Last Updated on Fri, Feb 19 2021 7:32 PM

RTA Charge Heavy Penalty On Registration Renewals - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ వెసులుబాటు వాహనదారుల నడ్డి విరిచింది. వాహనాల రిజిస్ట్రేషన్‌లు, డ్రైవింగ్‌ లైసెన్సులు, పర్మిట్లు, పన్ను చెల్లింపులు వంటి వాటి కోసం రవాణా శాఖ మొదట గత ఏడాది డిసెంబర్‌ వరకు వెసులుబాటునిచ్చింది. అనంతరం ఈ గడువును వచ్చే మార్చి వరకు పొడిగించింది. ఈ అవకాశం ఇవ్వడంతో వాహనదారులు తమ కార్యకలాపాలను వాయిదా వేసుకున్నారు. మార్చి తర్వాత పునరుద్ధరించుకోవచ్చని భావించారు. కానీ ఈ సడలింపే ఇప్పుడు వాహనదారుల కొంప ముంచింది. సకాలంలో వాహనాల రిజిస్ట్రేషన్లను రెన్యువల్‌ చేసుకోలేని వారికి భారీగా పెనాల్టీలు విధిస్తోంది. దీంతో సుమారు ఏడాది పాటు తమకు వెసులుబాటు లభించిందనుకున్న వాహనదారులు ఇప్పుడు ఏడాది పెనాల్టీలను చెల్లించాల్సిరావడంతో లబోదిబోమంటున్నారు. రవాణాశాఖ దొంగదెబ్బ తీస్తోందంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  
 
రూ.వేలల్లో వడ్డింపులు.. 
బంజారాహిల్స్‌కు చెందిన సామ శ్రీకాంత్‌రెడ్డి తన మారుతీ 800 కారు (ఏపీ 28ఏఎల్‌3736) రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ నమోదు చేసుకున్నారు. సాధారణంగా అయితే అప్లికేషన్‌ ఫీజు రూ.900, స్మార్ట్‌కార్డు కోసం రూ.200, సర్వీస్‌ చార్జీ రూ.400, పోస్టల్‌ చార్జీ రూ.35 చొప్పున మొత్తం రూ.1,535 చెల్లించాలి. 15 ఏళ్లు దాటిన వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌ రూపంలో మరో రూ.500 అదనపు భారం పడుతుంది. కానీ లేట్‌ ఫీజు రూపంలో రూ.10 వేల జరిమానా విధించడంతో ఆయన ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. మోహన్‌రెడ్డి అనే మరో వాహనదారు రూ.7000కుపైగా పెనాల్టీ చెల్లించి రెన్యువల్‌ చేసుకోవాల్సి వచ్చింది. 

గడువు ముగిసిన బండ్లు లక్షల్లో.. 
► మోటారు వాహన నిబంధనల ప్రకారం 15 ఏళ్ల గడువు ముగిసిన వాహనాల సామర్థాన్ని రవాణా అధికారులు మరోసారి అంచనా వేసి వాటిని వినియోగించేందుకు అనుమతినివ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం వాహనం పాత ఆర్‌సీ, ఇన్సూరెన్స్, అడ్రస్‌ తదితర డాక్యుమెంట్లతో పాటు గ్రీన్‌ట్యాక్స్‌ చెల్లించాలి.  
► నమోదు చేసుకున్న స్లాట్‌ ప్రకారం మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు వాహనం సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. అనంతరం మరో అయిదేళ్ల పాటు ఆ బండిని  వినియోగించుకొనేందుకు అనుమతినిస్తారు. ఇలా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి  రిజిస్ట్రేషన్‌ రెన్యువల్‌ చేసుకోవలసి ఉంటుంది. గ్రేటర్‌ పరిధిలో గడువు ముగిసిన వాహనాలు  సుమారు 13 లక్షల వరకు ఉంటాయి.  
► వీటిలో 5 లక్షల వరకు కార్లు ఉండగా, మిగతావి బైక్‌లు, క్యాబ్‌లు, రవాణా వాహనాలు ఉన్నాయి. కోవిడ్‌ వెసులు బాటు కారణంగా ఈ వాహనాల్లో  70 శాతం వరకు రెన్యువల్స్‌ లేకుండానే తిరుగుతున్నాయి. రవాణా శాఖ లెక్కల ప్రకారం ఈ వాహనదారులు భారీ ఎత్తున జరిమానా చెల్లించుకోవాల్సి వస్తోంది.  

ఇది చాలా దారుణం  
కోవిడ్‌ సమయంలో వెసులుబాటు ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు పెనాల్టీ వసూలు చేయడం దారుణం. వెసులుబాటు సమయంలోనే ఆ విషయం స్పష్టంగా చెప్పాల్సింది. అయినా కోవిడ్‌ ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో ఎలా వెళ్తాం. అప్పుడు ఆర్టీఏ కూడా పని చేయలేదు కదా. 
– సామ శ్రీకాంత్‌రెడ్డి  

పెనాల్టీ చెల్లించాల్సిందే..   
గడువు ముగిసిన వాహనాలు, డ్రైవింగ్‌ లైసెన్సులకు గడువు మాత్రమే పొడిగించాం. పెనాల్టీల నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పలేదు. నిబంధనల ప్రకారం ఫీజులు, పెనాల్టీలు చెల్లించాల్సిందే.   
– పాండురంగ్‌ నాయక్, జేటీసీ, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement